‘టీ-హబ్’తో దేశ ఐటీ రంగానికి ఊతం
అమెరికాలో కేటీఆర్ ఉద్ఘాటన
కాలిఫోర్నియాలో పెట్టుబడిదారులతో భేటీ
రాష్ట్రానికి రావాలని ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో పరిశోధనలకు ప్రాధాన్యమిస్తూ, స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘టీ-హబ్’ కార్యక్రమాన్ని చేపట్టిందని ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఇటువంటి కార్యక్రమం దేశంలోనే మొట్టమొదటిదని చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ గురువారం ప్రముఖ కంపెనీల సీఈవోలతో సమావేశమయ్యారు. నాస్కామ్ ఆధ్వర్యంలో కాలిఫోర్నియాలోని ‘శాప్’ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇన్నోట్రెక్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తాము చేపట్టిన టీ-హబ్ ద్వారా హైదరాబాద్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఐటీ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధ్యమవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సిలికాన్ వ్యాలీలోని ప్రసిద్ధ కంపెనీలు, భారతీయ పెట్టుబడిదారులతో కలసి పనిచేసేలా రూపొందించిన ఇన్నోట్రెక్‌ను అద్భుతమైన కార్యక్రమంగా అభివర్ణించారు. దీని ద్వారా భారత్‌లో పరిశోధనలకు ఊతమిచ్చిన ట్లు అవుతుందన్నారు. ఇన్నోట్రెక్‌కు వచ్చిన సిలికాన్ వ్యాలీ పెట్టుబడిదారులు, మెంటార్లు తెలంగాణలో తాము చేపట్టిన ఐటీ కార్యక్రమాలను కూడా పరిశీలించేందుకు రావాలని కేటీఆర్ ఆహ్వానించారు. టీ-హబ్‌ను అభినందించిన పెట్టుబడిదారులు... టీ-హబ్ ద్వారా వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సిలికాన్ వ్యాలీలో అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో పాల్ ఆట్లో నగర మేయర్ కరెన్ హోల్మన్, నాస్కామ్ నుంచి బీవీఆర్ మోహన్‌రెడ్డి, రవి గుర్రాల, సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ పెట్టుబడిదారులైన రాజురెడ్డి, సునీల్ ఎర్రబెల్లి, మాలవల్లి కుమార్, నిశిత్ దేశాయ్, మోహన్ ఉత్తర్వర్, పి.కె.గులాటి, మైక్రోసాఫ్ట్ నుంచి రవినారాయణ్, బ్లూమ్ వెంటర్ నుంచి కార్తీక్‌రెడ్డి, సంజయ్ నాథన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కావియమ్ సీఈవో సయీద్ అలీతో సమావేశమైన కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన పారిశ్రామిక విధానం గురించి వివరించారు. అంతకుముందు ప్రముఖ చిప్ తయారీ కంపెనీ ఎన్ విడియా కార్పొరేషన్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు డెబోరా సి షోకిస్ట్, డ్విట్ డెరైక్టర్లతో కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణలో ఎలక్ట్రానిక్ సంస్థల ఏర్పాటు కోసం చేపట్టనున్న కార్యక్రమాలను, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వారికి వివరించారు.