NASCAM
-
ఐటీ వృద్ధి 2.3 శాతం
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) దేశీ ఐటీ పరిశ్రమ ఆదాయాలు 2.3 శాతం వృద్ధి చెంది 194 బిలియన్ డాలర్లకు చేరనున్నాయి. అలాగే ఎగుమతులు 1.9 శాతం పెరిగి 150 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ఈ మేరకు అంచనాలు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌పరమైన ప్రతికూల పరిణామాలు ఉన్నప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరం కూడా ఐటీ సంస్థలు నికరంగా నియామకాలు చేపట్టాయని తెలిపింది. కొత్తగా 1.38 లక్షల ఉద్యోగాలు కల్పించడంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 44.7 లక్షలకు చేరిందని పేర్కొంది. ‘కరోనా సంక్షోభం నుంచి దేశీ పరిశ్రమ మరింత పటిష్టంగా బైటిపడింది. కోవిడ్ ఎదుర్కొనడంలో చుక్కానిగా నిల్చింది‘ అని నాస్కామ్ ప్రెసిడెంట్ దేవయాని ఘోష్ తెలిపారు. లిస్టెడ్ కంపెనీలు వెల్లడించిన గణాంకాల ప్రకారం 15 బిలియన్ డాలర్ల దాకా విలువ చేసే కాంట్రాక్టులు కుదిరే అవకాశాలు ఉన్నట్లు ఘోష్ వివరించారు. 2021లో అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు.. టెక్నాలజీపై వ్యయాలు మరింత పెంచుకోనున్నట్లు సీఈవోల సర్వేలో వెల్లడైనట్లు తెలిపారు. నాస్కామ్ సదస్సులో ప్రధాని ప్రసంగం.. బుధవారం జరిగే 29వ నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్షిప్ ఫోరం (ఎన్టీఎల్ఎఫ్) సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించనున్నారు. కరోనా మహమ్మారి నుంచి బైటపడి మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు భవిష్యత్‌లో తీసుకోవాల్సిన చర్యలు ప్రధానాంశంగా నాస్కామ్ దీన్ని నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 17 నుంచి 19 దాకా ఈ సదస్సు జరుగుతుంది. -
192 బిలియన్ డాలర్లకు ఐటీ ఆదాయాలు
ముంబై: దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ (ఐటీ–బీపీఎం రంగం ఆదాయాలు 2020 ఆర్థిక సంవత్సరంలో 8.4 శాతం మేర వృద్ధి నమోదు చేయొచ్చని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ తెలిపింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన 192 బిలియన్ డాలర్లకు చేరవచ్చని పేర్కొంది. 2019–20లో కొత్త తరం డిజిటల్ విభాగాల ఆదాయాలు 23 శాతం పెరగడం, నికరంగా 2.05 లక్షల ఉద్యోగాల కల్పన జరగడం తదితర అంశాలు ఇందుకు దోహదపడగలవని నాస్కామ్ వివరించింది. భవిష్యత్ అంచనాలకు సంబంధించి పరిశ్రమ ఆశావహంగానే ఉన్నప్పటికీ కాస్త ఆచితూచి వ్యవహరించే ధోరణే కొనసాగించనున్నట్లు నాస్కామ్ చైర్మన్ కేశవ్ మురుగేశ్ విలేకరులకు తెలిపారు. 43.6 లక్షల మంది సిబ్బందికి కొత్త నైపుణ్యాల్లో శిక్షణనిచ్చే ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. కరోనా వైరస్ ప్రతికూల ప్రభావాలు కచ్చితంగా ఎంత స్థాయిలో ఉంటాయన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సీవోవో ప్రవీణ్ రావు చెప్పారు. అయితే, సరఫరా వ్యవస్థలో చైనా కీలక దేశం కావడంతో క్లయింట్లపైనా, ఫలితంగా పరిశ్రమపైనా పరోక్ష ప్రభావాలు ఉండొచ్చన్నారు. మెషీన్ లెర్నింగ్‌తో ప్రయోజనమే: చంద్రశేఖరన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీలు.. భారత్ వంటి వర్ధమాన దేశాలకు ప్రయోజనకరమేనని టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తెలిపారు. -
కొత్త హెచ్1బీ ప్రతిపాదనలతో అనిశ్చితి: నాస్కామ్
న్యూఢిల్లీ: హెచ్1బీ వీసాల కోసం కంపెనీలు ముందుగానే ఎలక్ట్రానిక్ రూపంలో నమోదు చేసుకోవాలనే అమెరికా నూతన ప్రతిపాదనతో అనిశ్చితి పెరుగుతుందని, అక్కడి ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుందని సాఫ్ట్వేర్ కంపెనీల సమాఖ్య ‘నాస్కామ్’ ఆందోళన వ్యక్తం చేసింది. హెచ్1బీ వీసాలకు సంబంధించిన 139 పేజీల ప్రతిపాదనను పూర్తిగా అధ్యయనం చేసి వాటి ప్రభావం అమెరికా కంపెనీలు, ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావాన్ని తమ అభిప్రాయాల రూపంలో తెలియజేస్తామని ప్రకటించింది. ట్రంప్ సర్కారు హెచ్1బీ వీసాల్లో భారీ మార్పులను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీనిపై జనవరి 2 వరకు అభిప్రాయాలను స్వీకరిస్తామని అమెరికా అంతర్గత భద్రత విభాగం తన ప్రకటనలో తెలిపింది.‘‘కొత్త ప్రతిపాదనతో అంతర్జాతీయ ఐటీ కంపెనీలు అమెరికాలో తమ నైపుణ్య సేవలను అందించడం మరింత భారం అవుతుంది. వాటిపై ఆధారపడిన అమెరికా కంపెనీలను బలహీనపరుస్తుంది. అమెరికా ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుంది. ఐటీ సేవలను మరింతగా విదేశాలకు అవుట్సోర్స్ చేయడానికి దారితీస్తుంది’’ అని నాస్కామ్ పేర్కొంది. -
బ్యాక్ ఆఫీస్ సేవలపై పన్నులతో వివాదాలు
న్యూఢిల్లీ: బహుళ జాతి కంపెనీలకు అందించే బ్యాక్ ఆఫీస్, సపోర్ట్ సేవలకు కూడా జీఎస్టీ వర్తిస్తుందంటూ అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఏఆర్) ఇచ్చిన ఉత్తర్వులతో అనవసర వివాదాలు తలెత్తే అవకాశం ఉందని సాఫ్ట్వేర్ సంస్థల సమాఖ్య నాస్కామ్ అభిప్రాయపడింది. దీనివల్ల అనేక ఉద్యోగాల్లో కోత పడటంతో పాటు అంతర్జాతీయ సర్వీస్ ప్రొవైడర్‌గా భారత ప్రతిష్ట మసకబారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాక్ ఆఫీస్ సర్వీసులను ఎగుమతులుగా పరిగణించరాదని, 18 శాతం జీఎస్టీ పన్ను రేటు వర్తిస్తుందని వీసర్వ్ గ్లోబల్ కేసులో ఏఏఆర్ మహారాష్ట్ర బెంచ్ ఇటీవల ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు ఊతంతో రెట్రాస్పెక్టివ్ ప్రాతిపదికన (గత కాలంలో జరిగిన లావాదేవీలపై కూడా) పన్నుల శాఖ ట్యాక్స్ డిమాండ్ చేసే అవకాశం ఉందని, ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో దేశీ సంస్థలు పోటీపడలేని పరిస్థితి నెలకొంటుందని నాస్కామ్ పేర్కొంది. -
హైదరాబాద్‌లో డేటా సైన్స్ కేంద్రం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ రంగంలో దూసుకెళ్తున్న భాగ్యనగరి మరో రికార్డు నమోదు చేయబోతోంది. డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో పరిశోధన, ఆవిష్కరణలకై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ముందడుగు పడింది. మంగళవారం ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం, నాస్కామ్ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇక్కడి హెచ్ఐసీసీలో జరుగుతున్న నాస్కామ్ ఇండియా లీడర్షిప్ ఫోరం–2018లో భాగంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కె.తారక రామారావు సమక్షంలో నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం, నాస్కామ్ సంయుక్తంగా ఈ సెంటర్‌కు తొలుత రూ.40 కోట్లు వ్యయం చేస్తాయి. ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో తాత్కాలికంగా సెంటర్ ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్ సమీపంలోని బుద్వేల్ వద్ద రానున్న ప్రతిపాదిత డేటా అనలిటిక్స్ పార్క్‌లో శాశ్వత కేంద్రాన్ని నెలకొల్పుతారు. లక్షన్నర మందికి: డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం భారత్‌లో 2025 నాటికి రూ.1,00,800 కోట్లు నమోదు చేయనుంది. 1,50,000 మందికి కొత్తగా ఉపాధి లభిస్తుందని కె.తారక రామారావు వెల్లడించారు. భవిష్యత్‌ను మార్చనున్న ఎనిమిది రకాల టెక్నాలజీల్లో డేటా సైన్స్, ఏఐ ఉన్నాయని చంద్రశేఖర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఐటీ పాలసీలో భాగంగా ప్రోత్సహించనున్న 10 విభాగాల్లో ఈ రెండు కూడా చోటు దక్కించుకున్నాయని జయేశ్ రంజన్ చెప్పారు. -
హైదరాబాద్‌లో నాస్కామ్ ఏఐ కేంద్రం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాఫ్ట్వేర్ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్... హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వంతో చర్చలు మొదలుపెట్టామని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ తెలియజేశారు. ఫిబ్రవరిలో జరగనున్న వరల్డ్ ఐటీ కాంగ్రెస్‌లో దీనికి సంబంధించి ప్రకటన వెలువడే అవకాశమున్నట్లు తెలియవచ్చింది. ఇప్పటికే నాస్కామ్ ఏఐ సెంటర్ ఒకటి బెంగళూరులో ఉందని.. దేశంలో మరో రెండు మూడు ఏఐ కేంద్రాల అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో శరవేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయని.. వీటిల్లో ఏఐతో పాటూ డేటా అనలిటిక్స్, మిషన్ లెర్నింగ్, త్రీడి ప్రింటింగ్ వంటి 8 విభాగాలను గుర్తించామని, వీటిలో నైపుణ్యమున్న ఉద్యోగుల అవసరముందని వివరించారు. ఈ ఏఐ సెంటర్ల ద్వారా ఏఐ, సైబర్ సెక్యూరిటీ వంటి టెక్నాలజీల్లో శిక్షణ, నైపుణ్యాలు అభివృద్ధి చేయటం వంటివి ఉంటాయని తెలిపారు. వీటితో పాటు ఈ ఏఐ సెంటర్ స్థానిక స్టార్టప్ సంస్థలు, మెంటార్లు, విద్యావేత్తలు, వెంచర్ క్యాపిటలిస్ట్‌లతో అనుసంధానమై ఉంటుందని.. స్థానిక సమస్యలకు టెక్నాలజీతో పరిష్కార మార్గాలను అన్వేషిస్తుందని వివరించారు. -
పన్నుల విధానాలే స్టార్టప్‌లకు అడ్డం
బెంగళూరు: సంక్లిష్టమైన పన్నుల విధానాలే స్టార్టప్ సంస్థల వృద్ధికి నిరోధకాలుగా ఉంటున్నాయని దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ చైర్మన్ రమణ్ రాయ్ వ్యాఖ్యానించారు. స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టే ఏంజెల్ ఇన్వెస్టర్లకు ఈ నిబంధనలు సమస్యాత్మకంగా ఉంటున్నాయని చెప్పారు. నాస్కామ్ ఉత్పత్తుల సదస్సు 2017లో ‘భారతీయ స్టార్టప్ వ్యవస్థ’పై నాస్కామ్–జిన్నోవ్ నివేదికను విడుదల చేసిన సందర్భంగా రాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. నాస్కామ్ అంచనా ప్రకారం ఏటా 30–35 శాతం స్టార్టప్ సంస్థలు మూతబడుతున్నాయి. పలు స్టార్టప్‌లలో ఏంజెల్ ఇన్వెస్టర్లు పెట్టే పెట్టుబడులను పన్నుల శాఖ ఇన్వెస్ట్మెంట్గా చూడటం లేదని, వీటిని ఆదాయం కింద పరిగణిస్తుండటంతో ఆయా స్టార్టప్ సంస్థలు అసలు పని వదిలేసి పన్నుల శాఖల కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రారంభ దశ, తదుపరి దశ ఫడింగ్ మెరుగ్గానే ఉంటున్నా.. ఏంజెల్ స్థాయి పెట్టుబడులు 53 శాతం మేర తగ్గిపోయాయని చెప్పారాయన. -
ఏఐపై నాస్కామ్ సెంటర్స్ ఫర్ ఎక్సలెన్స్
ముంబై: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా సైన్సెస్ వంటి కొంగొత్త టెక్నాలజీలపై మరింతగా అవగాహన పెంపొందించే దిశగా దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ పలు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు (సీవోఈ) ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్, బెంగళూరులో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ తెలిపారు. ఇవి అంతర్జాతీయంగా ఉత్తమ విధానాలను అధ్యయనం చేయడంతో పాటు ఆయా ప్రాంతాల్లోని స్టార్టప్స్‌ని ప్రోత్సాహం అందించడం తదితర కార్యకలాపాలు సాగిస్తాయని వివరించారు. అయితే, ఇందుకోసం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నదీ, ఎప్పట్లోగా ఏర్పాటు చేయనున్నది మాత్రం చంద్రశేఖర్ వెల్లడించలేదు. కొత్త సాంకేతికాంశాలపై నియంత్రణలపై స్పందిస్తూ.. నియంత్రణ ముఖ్యమే అయినప్పటికీ మారే టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు విధి విధానాలు తగు రీతిలో సవరించుకుంటూ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ తదితరులు టెక్నాలజీపై నియంత్రణలకు మద్దతునిస్తుండగా టెక్ దిగ్గజం ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ మొదలైన వారు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. -
‘టీ-హబ్’తో దేశ ఐటీ రంగానికి ఊతం
అమెరికాలో కేటీఆర్ ఉద్ఘాటన కాలిఫోర్నియాలో పెట్టుబడిదారులతో భేటీ రాష్ట్రానికి రావాలని ఆహ్వానం సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో పరిశోధనలకు ప్రాధాన్యమిస్తూ, స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘టీ-హబ్’ కార్యక్రమాన్ని చేపట్టిందని ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఇటువంటి కార్యక్రమం దేశంలోనే మొట్టమొదటిదని చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ గురువారం ప్రముఖ కంపెనీల సీఈవోలతో సమావేశమయ్యారు. నాస్కామ్ ఆధ్వర్యంలో కాలిఫోర్నియాలోని ‘శాప్’ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇన్నోట్రెక్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తాము చేపట్టిన టీ-హబ్ ద్వారా హైదరాబాద్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఐటీ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధ్యమవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సిలికాన్ వ్యాలీలోని ప్రసిద్ధ కంపెనీలు, భారతీయ పెట్టుబడిదారులతో కలసి పనిచేసేలా రూపొందించిన ఇన్నోట్రెక్ను అద్భుతమైన కార్యక్రమంగా అభివర్ణించారు. దీని ద్వారా భారత్‌లో పరిశోధనలకు ఊతమిచ్చిన ట్లు అవుతుందన్నారు. ఇన్నోట్రెక్కు వచ్చిన సిలికాన్ వ్యాలీ పెట్టుబడిదారులు, మెంటార్లు తెలంగాణలో తాము చేపట్టిన ఐటీ కార్యక్రమాలను కూడా పరిశీలించేందుకు రావాలని కేటీఆర్ ఆహ్వానించారు. టీ-హబ్‌ను అభినందించిన పెట్టుబడిదారులు... టీ-హబ్ ద్వారా వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సిలికాన్ వ్యాలీలో అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పాల్ ఆట్లో నగర మేయర్ కరెన్ హోల్మన్, నాస్కామ్ నుంచి బీవీఆర్ మోహన్‌రెడ్డి, రవి గుర్రాల, సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ పెట్టుబడిదారులైన రాజురెడ్డి, సునీల్ ఎర్రబెల్లి, మాలవల్లి కుమార్, నిశిత్ దేశాయ్, మోహన్ ఉత్తర్వర్, పి.కె.గులాటి, మైక్రోసాఫ్ట్ నుంచి రవినారాయణ్, బ్లూమ్ వెంటర్ నుంచి కార్తీక్‌రెడ్డి, సంజయ్ నాథన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కావియమ్ సీఈవో సయీద్ అలీతో సమావేశమైన కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన పారిశ్రామిక విధానం గురించి వివరించారు. అంతకుముందు ప్రముఖ చిప్ తయారీ కంపెనీ ఎన్ విడియా కార్పొరేషన్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు డెబోరా సి షోకిస్ట్, డ్విట్ డెరైక్టర్లతో కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణలో ఎలక్ట్రానిక్ సంస్థల ఏర్పాటు కోసం చేపట్టనున్న కార్యక్రమాలను, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వారికి వివరించారు.