హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాఫ్ట్‌వేర్ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్... హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వంతో చర్చలు మొదలుపెట్టామని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ తెలియజేశారు.
ఫిబ్రవరిలో జరగనున్న వరల్డ్ ఐటీ కాంగ్రెస్‌లో దీనికి సంబంధించి ప్రకటన వెలువడే అవకాశమున్నట్లు తెలియవచ్చింది. ఇప్పటికే నాస్కామ్ ఏఐ సెంటర్ ఒకటి బెంగళూరులో ఉందని.. దేశంలో మరో రెండు మూడు ఏఐ కేంద్రాల అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో శరవేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయని.. వీటిల్లో ఏఐతో పాటూ డేటా అనలిటిక్స్, మిషన్ లెర్నింగ్, త్రీడి ప్రింటింగ్ వంటి 8 విభాగాలను గుర్తించామని, వీటిలో నైపుణ్యమున్న ఉద్యోగుల అవసరముందని వివరించారు.
ఈ ఏఐ సెంటర్ల ద్వారా ఏఐ, సైబర్ సెక్యూరిటీ వంటి టెక్నాలజీల్లో శిక్షణ, నైపుణ్యాలు అభివృద్ధి చేయటం వంటివి ఉంటాయని తెలిపారు. వీటితో పాటు ఈ ఏఐ సెంటర్ స్థానిక స్టార్టప్ సంస్థలు, మెంటార్లు, విద్యావేత్తలు, వెంచర్ క్యాపిటలిస్ట్‌లతో అనుసంధానమై ఉంటుందని.. స్థానిక సమస్యలకు టెక్నాలజీతో పరిష్కార మార్గాలను అన్వేషిస్తుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment