1,650 జనాభా ఉన్న గ్రామంలోనే 270 మందికి పింఛన్లా! | Chandrasekhar Kumar Field Review | Sakshi
Sakshi News home page

1,650 జనాభా ఉన్న గ్రామంలోనే 270 మందికి పింఛన్లా!

Published Wed, May 31 2023 3:55 AM | Last Updated on Wed, May 31 2023 3:55 AM

Chandrasekhar Kumar Field Review  - Sakshi

సాక్షి, అమరావతి/తాడేపల్లిరూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం 1,650 మంది (448 ఇళ్లు) జనాభా ఉన్న గుంటూరు జిల్లా చింతలపూడిలో 252 మందికి నెలనెలా పింఛన్లు ఇస్తోందని అధికారులు తెలపడంతో కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ అదనపు కార్యదర్శి చంద్ర­శేఖర్‌­కుమార్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు బాగుందని ఆయన ప్రశంసించారు. పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న కార్యక్రమాల సమీ­క్షతో పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఆయన మంగళవారం రాష్ట్ర పర్యటనకు వచ్చారు.

తాడే­­పల్లిలో రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికా­రు­­లతో సమీక్ష నిర్వహించిన అనంతరం గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో వివిధ కార్య­క్రమాల అమలును స్వయంగా పరిశీలించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామంలో వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష సర్వే, స్వమిత్వ కార్యక్రమంలో భాగంగా గ్రామ కంఠాల పరిధిలోని ఉండే ఇళ్లకు సంబంధించి యాజమాన్య హక్కుపత్రాలు ఇచ్చే ప్రక్రియ పురో­గ­తిని పరిశీలించారు.

గ్రామ పంచాయతీకి కేటాయించిన 15వ ఆర్థికసంఘం నిధుల విని­యోగంపై ఆరా తీశారు. పంచాయతీ ఆధ్వర్యంలో వివిధ పనులు చేపట్టిన అనంతరం ప్రస్తుతం పంచాయతీ ఖాతాలో ఇంకా రూ.3.89 లక్షలు ఆర్థికసంఘ నిధులు మిగిలి ఉన్నాయని అధికారులు తెలి­పారు. గ్రామ పంచా­యతీకి కేటాయించిన నిధు­లను కేవలం సీసీ రోడ్ల నిర్మా­ణానికే పరిమితం కాకుండా గ్రామంలో సోలా­ర్‌ విద్యుత్‌ ఏర్పాటు వంటి వినూత్న  కార్య­క్రమాల నిర్వ­హణకు ఖర్చు పెట్టాలని చంద్రశేఖర్‌­కుమార్‌ సూచించారు.

పంచాయతీపై భారం లేకుండా గ్రామ సచివాలయాల్లో పని­చేస్తున్న ఉద్యోగులందరికీ ప్రభు­త్వమే జీతాలు చెల్లి­స్తోందని అధికారులు ఆయ­నకు వివరించారు. గ్రా­మ­ంలో డిజిటల్‌ లైబ్రరీ నిర్మా­ణానికి ప్రభుత్వం అను­మతి తెలిపిందని చెప్పారు. డిజిటల్‌ ల్రైబరీల ఏర్పాటు ద్వారా గ్రామ­ం­లోని పేద విద్యార్థులు, నిరు­ద్యోగులు సైతం ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర పోటీపరీక్షలకు సమ­ర్థంగా ప్రిపేరయ్యే అవకాశం ఉంటుందని ఆయన మెచ్చుకున్నారు.

అనంతరం ఆయన ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడిలో పర్య­టించి అక్కడ అమలవు­తున్న వివిధ కార్యక్ర­మాలను పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో పంచాయతీరాజ్‌ కమిషనర్‌ సూర్య­కుమారి, అద­నపు కమిషనర్‌ సుధా­కర్, గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, ఎన్టీఆర్‌ జిల్లా కలె­క్టర్‌ ఢిల్లీరావు, తెనాలి సబ్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మ, గుంటూరు జెడ్పీ సీఈవో మోహన­రావు, డీపీవో కేశవరెడ్డి, సర్వే, ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ రూప్లానాయక్, దుగ్గిరాల తహ­శీల్దార్‌ మల్లేశ్వరి, చింతలపూడి సర్పంచ్‌ రామకృష్ణ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement