కూటమి పాలనలో అప్పుల జాతర.. సంక్షేమానికి పాతర | Tatiparthi Chandrasekhar comments over Govt | Sakshi
Sakshi News home page

కూటమి పాలనలో అప్పుల జాతర.. సంక్షేమానికి పాతర

Published Fri, Nov 15 2024 5:16 AM | Last Updated on Fri, Nov 15 2024 5:16 AM

Tatiparthi Chandrasekhar comments over Govt

ఐదు నెలల్లో రూ.57వేల కోట్ల అప్పులు చేసిన ప్రభుత్వం 

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి 

ఐదు నెలల్లోనే ఆడబిడ్డలపై 7,393 ఘోరాలు 

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఐదు నెలల పాలన ‘అప్పుల జాతర–సంక్షేమానికి పాతర‘ అన్నట్లుగా ఉందని వైఎస్సార్‌సీపీ యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోందని చెప్పారు. ప్రశ్నించిన వారిని అక్రమంగా నిర్బంధించడం తప్ప ఈ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఐదు నెలల్లో రూ.57వేల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రచారం చేసిన సూపర్‌ సిక్స్‌ హామీలను కూడా గాలికొదిలేసిందని చెప్పారు. నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు ప్రయాణం, ఆడబిడ్డ నిధికి అసలు కేటాయింపులే చేయలేదని వివరించారు. తల్లికి వందనం పథకానికి రూ.12,600 కోట్లు కావాల్సి ఉండగా, బడ్జెట్‌లో కేవలం రూ.5,380 కోట్లు కేటాయించడం చూస్తే లబ్ధిదారుల్లో సగం మందికి కోత పడే పరిస్థితి కనిపిస్తోందని తెలిపారు. 

ఉచిత సిలిండర్‌ పథకానికి రూ.850 కోట్లు, రైతులకు పెట్టుబడి సాయం కోసం కేవలం రూ.1,000 కోట్లు మాత్రమే కేటాయించడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు ఐదు నెలల్లో ఆడబిడ్డలపై జరిగిన ఘోరాలకు సంబంధించి 7,393 కేసులు నమోదయ్యాయని, అంటే రోజుకు సగటున 48 ఘటనలు జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. నేరాలను అదుపు చేయలేని ఈ ప్రభుత్వానికి కొనసాగే అర్హత లేదని, వెంటనే సీఎం, డిప్యూటీ సీఎం రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement