
శైలజా రామయ్యర్‌కు జ్ఞాపికను బహూకరిస్తున్న శుభాశర్మ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ చేనేత రంగం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఒడిశా ఉన్నతాధికారుల బృందం కితాబు ఇచ్చింది. భారీ నిధుల కేటాయింపు, వినూత్న పథకాల అమలు, ప్రోత్సాహకాలు, పవర్‌లూమ్ క్లస్టర్లు, టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటు వంటి చర్యలతో చేనేత రంగం పునరుజ్జీవం పొందిందని పేర్కొన్నారు.
ఒడిశా చేనేత, టెక్స్‌టైల్స్, హస్తకళల శాఖ కార్యదర్శి శుభాశర్మ నేతృత్వంలోని అధికారుల బృందం ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు పోచంపల్లి, సిరిసిల్లలోని చేనేత, టెక్స్‌టైల్ పార్కులు, పవర్‌లూమ్‌లు, విక్రయ కేంద్రాలను, అబిడ్స్, నాంపల్లిలో తెలంగాణ రాష్ట్ర చేనేత కార్మికుల సహకార సంఘం(టెస్కో) కార్యాలయాన్ని సందర్శించారు.
అనంతరం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్ జనరల్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీపీ ఆచార్య, రాష్ట్ర చేనేత, టెక్స్‌టైల్ శాఖ డైరెక్టర్ శైలజా రామయ్యర్, చేనేత, హస్తకళల విభాగం అధికారి సురయ హసన్, మల్ఖా ట్రస్ట్ డైరెక్టర్ ఉజ్రమ్మ, నిఫ్ట్ మాజీ డైరెక్టర్ డాక్టర్ ఎన్‌వీఆర్ నాథన్‌లతో చేనేత అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా శుభాశర్మ మాట్లాడుతూ తెలంగాణ స్ఫూర్తితో తమ రాష్ట్రంలోనూ చేనేత రంగం అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment