సాక్షి, హైదరాబాద్: ‘కరోనా’.. తెలంగాణలో మార్చి 2న అడుగుపెట్టింది. కరోనా వైరస్ లక్షణాలతో తొలి కేసు మొదలైంది ఆ రోజునే. అక్కడితో మొదలై పదులు, వందల సంఖ్యలో బాధితులు దీని బారినపడ్డారు. ఏప్రిల్ 18 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 809 మందికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. తొలినాళ్లలో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్నా.. మర్కజ్ ఘటన తర్వాత తీవ్రత పెరిగి అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
ఏడు వారాల్లో ఎన్నో రెట్లు..
రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన తొలివ్యక్తిని మార్చి 2న గుర్తించారు. ఆ రోజు నుంచి ఈ 48 రోజుల్లో వైరస్ వ్యాప్తి ఎన్నో రెట్లు పెరిగింది. మొదటి కేసు నమోదైన తర్వాత రెండో కేసు నమోదుకు 12 రోజులు పట్టింది. మార్చి 14న రెండో కేసు నమోదు కాగా, అక్కడి నుంచి ప్రతి రోజు కేసుల నమోదు క్రమంగా పెరిగింది. అలా 24 రోజుల్లో కరోనా కేసుల సంఖ్య 50కి పెరిగింది. కేసుల సంఖ్య ఒకటి నుంచి యాభై కావడానికి 24 రోజులు పడితే మరో 24రోజుల్లో 800 మార్కు దాటింది. మార్చి 31 నాటికి వంద కేసులు కాగా, ఏప్రిల్ 3కి ఈ సంఖ్య రెట్టింపై 233 అయ్యింది. మరో నాలుగు రోజుల్లో 400 దాటి.. ఈనెల 18 నాటికి 809 కేసులు నమోదయ్యాయి. చదవండి: కిరాణా C/o గల్లీ దుకాణం
రోజుకు 17 మంది బాధితులు..
కరోనా కేసుల నమోదు రాష్ట్రంలో వేగంగా పెరుగుతోంది. తొలి కేసు నమోదైన తర్వాత ఈ ఏడు వారా ల్లో రోజుకు సగటున 17 కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. మార్చి నెలాఖరుకురాష్ట్రంలో కేసుల సంఖ్య వందకు చేరింది. తొలి 30 రోజుల్లో కేసుల నమోదు సగటున 3.3 చొప్పున ఉంది. ఆ తర్వాత వైరస్ వ్యాప్తి పెరగడంతో ఏప్రిల్ 1 నుంచి 18వ తేదీ వరకు 700 కేసులు నమోదయ్యాయి. ఇక, ఏప్రిల్ విషయానికి వస్తే.. ఈనెల 1 నుంచి 18 వరకు రోజూ సగటున 39 పాజిటివ్ కేసులు నమోదైనట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
పరీక్షల్లో 6.5శాతం పాజిటివ్..
ఈనెల 18 వరకు 12,269 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 809 మందికి పాజిటివ్ వచ్చింది. పరీక్షలు చేసిన వాటిలో ఇప్పటివరకు 6.5% మందికి ఫలితాలు పాజిటివ్ వచ్చాయి. మొత్తం నమోదైన కేసుల్లో 64 మంది విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు వారి సన్నిహితులున్నారు. మర్కజ్‌తో సంబంధం ఉన్న కేసులు 664 ఉన్నాయి. ఇందులో మర్కజ్ ట్రావెల్ కేసులు 232, వాటి కాంటాక్ట్ కేసులు 432 ఉన్నాయి. మిగతా కేసులు వైద్య సిబ్బంది, సెకండరీ కాంటాక్ట్, ఇతరులున్నారు. వీరిలో 186 మంది డిశ్చార్జి కాగా, 18 మంది చనిపోయారు.
మర్కజ్ లింకు కేసులు 82శాతం..
రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అగ్రభాగం మర్కజ్‌తో సంబంధం ఉన్నవే. రాష్ట్రంలో ఇప్పటివరకు 809 కేసులు నమోదు కాగా, ఇందులో 664 కేసులు మర్కజ్ యాత్రికులు, వారితో సన్నిహితం గా మెలిగిన వారివే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం నమోదైన కేసుల్లో 82శాతం కేసులివే. మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారిలో 1,247 మందికి పరీక్షలు నిర్వహించగా 17.76% (232 మందికి) కరోనా పాజిటివ్ వచ్చింది. వారి కుటుంబీకులు, సన్నిహితంగా ఉన్న 2,593 మందికి కూడా పరీక్షలు నిర్వహించగా 18% (432మందికి) పాజిటివ్ వచ్చింది. చదవండి: నెల రోజులు వైఎస్సార్ జిల్లాలోనే..
Comments
Please login to add a commentAdd a comment