సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి ప్రభుత్వంతో చర్చలకు వెళ్లాలని హైకోర్టు సూచించింది. ఆర్టీసీ సమ్మెపై విచారణ చేపట్టిన హైకోర్టు మంగళవారం కీలక ఆదేశాల జారీచేసింది. రెండు రోజుల్లో సమ్మెపై కోర్టుకు నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సర్కార్ మెట్టుదిగి కార్మికులతో వెంటనే చర్చలు జరిపి.. ప్రజలకు సమస్య లేకుండా చూడాలని తెలిపింది. ఈ నెల 18లోగా చర్చలు ముగించి శుభవార్తతో రావాలని పేర్కొంది. అలాగే కార్మికులు తొందరపడి ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరింది.
ప్రభుత్వ తీరుపై కాసింత అసహనం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. ఆర్టీసీకి తక్షణమే ఎండీ నియమించాలని ఆదేశించింది. అలాగే తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాలపై స్పందించిన ఆర్టీసీ జేఏసీ నాయకులు.. ప్రభుత్వంతో చర్చలు తాము సిద్ధంగా ఉన్నామని.. కానీ డిమాండ్లు పరిష్కారం కాకుండా సమ్మె విరమించబోమని స్పష్టం చేశారు. అంతకు ముందు విచారణలో భాగంగా.. ప్రభుత్వం, ఆర్టీసీ యూనియన్ల పట్టుదల మధ్యలో ప్రజలు నలిగిపోతున్నారని న్యాయస్థానం అభిప్రాయపడింది. అలాగే విచారణలో భాగంగా ప్రభుత్వానికి, యూనియన్లకు హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. కార్మికులు నిరసన తెలిపేందుకు అనేక మార్గాలున్నాయని కోర్టు తెలిపింది. అలాగే ఆర్టీసీ సమ్మె విరమణకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
అయితే కార్మికులను ప్రభుత్వం సెల్ఫ్ డిస్మిస్ చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ నిర్ణయంతో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆర్టీసీ జేఏసీ తెలిపింది. సమ్మె విరమిస్తే తమ సమస్యలు పరిష్కారం కావని పేర్కొంది. మరోవైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఆర్టీసీని విలీనం చేస్తే మరిన్ని కార్పొరేషన్లు ముందుకొస్తాయని కోర్టుకు విన్నవించింది.
Comments
Please login to add a commentAdd a comment