
సాక్షి, హైదరాబాద్: నూతనంగా ఏర్పాటైన 21 జిల్లాల్లో గొర్రెల పెంపకందారులు, మత్స్యకారులతో కూడిన నూతన సొసైటీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మత్స్య, పశుసంవర్ధక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో పశుసంవర్ధకశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ, డైరెక్టర్ వెంకటేశ్వర్లు, గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మారెడ్డిలతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందున్న 9 జిల్లాల జిల్లా స్థాయి గొర్రెల పెంపకందారుల సొసైటీల్లో మహబూబ్‌నగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల సొసైటీల పదవీకాలం ముగిసిందని, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాస్థాయి సొసైటీల పదవీకాలం వచ్చే ఏడాది ముగియనుందని పేర్కొన్నారు.
ఇవే కాకుండా రాష్ట్రంలో మొత్తం 8,025 గొర్రెల పెంపకందారుల సొసైటీలు ఉండగా, వీటిలో 3,257 పాత సొసైటీలు, 3,780 కొత్త సొసైటీలు మొత్తం 7,037 సొసైటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో మొత్తం 3,820 మత్స్య సహకార సొసైటీలు ఉండగా, 946 సొసైటీలకు ఎన్నికలు జరగాల్సి ఉందని, 153 సొసైటీలు పర్సన్ ఇన్‌చార్జిల ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయని వివరించారు. ఈ సొసైటీలకు కో–ఆపరేటివ్ చట్టం ప్రకారం ఎన్నికలను నిర్వహించాలని, అందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని ఆయన సూచించారు. త్వరలో కేబినెట్ సబ్‌కమిటీ సమావేశం ఏర్పాటు చేసి సొసైటీలకు ఎన్నికలు నిర్వహించే విషయమై సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment