Tharasani Srinivas Yadav
-
ఎందుకు ఈ ఉలికిపాటు?
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల గురించి మాట్లాడితే టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ఉలికిపాటు ఎందుకని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ దేశ రాజకీయాల గురించి మాట్లాడితే చంద్రబాబు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. కేంద్రం నిధులు ఇస్తోందని చంద్రబాబు ఈ రోజు ఒప్పుకున్నారు కదా అని గుర్తుచేశారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు పెట్టిన రూ.1000 కోట్లు ఎక్కడి నుండి వచ్చాయో బాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ఎన్టీఆర్ అల్లుడిగా నీవు వచ్చినప్పడు, నిన్ను ముఖ్యమంత్రి చేసిందే మేం’అని అన్నారు. ‘నేను హుందాగా మాట్లాడుతా అని చంద్రబాబు అంటున్నారు. హుందాగా మాట్లాడటం గురించి మీరు మాకు నేర్పాలా?’అని ప్రశ్నించారు. ప్రధానికి తమకు ఎందుకు లంకె పెడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఈ విషయంలో చంద్రబాబు వ్యాఖ్యలు ‘దెయ్యాలు వేదాలు వల్లించినట్టు’ ఉన్నాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హైదరాబాద్‌కు వస్తే నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హైటెక్ సిటీకి ఎక్కడ ఫౌండేషన్ వేశారో చూపిస్తామని సవాల్ విసిరారు. ఒడిశా, కలకత్తా వెళ్లిన సీఎం కేసీఆర్ ఏం చేశారో ముందు ముందు మీకు తెలుస్తుందన్నారు. ధర్మపోరాటాల దీక్ష పేరుతో వందల కోట్లు వృథా చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఓడిపోవడం ఖాయమన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలు ఇరిగేషన్ ప్రాజెక్టులను అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మొదలు పెట్టారని అన్నారు. -
కొత్త జిల్లాల్లో గొర్రెలు, మత్స్యకారుల సొసైటీలు
సాక్షి, హైదరాబాద్: నూతనంగా ఏర్పాటైన 21 జిల్లాల్లో గొర్రెల పెంపకందారులు, మత్స్యకారులతో కూడిన నూతన సొసైటీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మత్స్య, పశుసంవర్ధక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో పశుసంవర్ధకశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ, డైరెక్టర్ వెంకటేశ్వర్లు, గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మారెడ్డిలతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందున్న 9 జిల్లాల జిల్లా స్థాయి గొర్రెల పెంపకందారుల సొసైటీల్లో మహబూబ్‌నగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల సొసైటీల పదవీకాలం ముగిసిందని, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాస్థాయి సొసైటీల పదవీకాలం వచ్చే ఏడాది ముగియనుందని పేర్కొన్నారు. ఇవే కాకుండా రాష్ట్రంలో మొత్తం 8,025 గొర్రెల పెంపకందారుల సొసైటీలు ఉండగా, వీటిలో 3,257 పాత సొసైటీలు, 3,780 కొత్త సొసైటీలు మొత్తం 7,037 సొసైటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో మొత్తం 3,820 మత్స్య సహకార సొసైటీలు ఉండగా, 946 సొసైటీలకు ఎన్నికలు జరగాల్సి ఉందని, 153 సొసైటీలు పర్సన్ ఇన్చార్జిల ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయని వివరించారు. ఈ సొసైటీలకు కో–ఆపరేటివ్ చట్టం ప్రకారం ఎన్నికలను నిర్వహించాలని, అందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని ఆయన సూచించారు. త్వరలో కేబినెట్ సబ్‌కమిటీ సమావేశం ఏర్పాటు చేసి సొసైటీలకు ఎన్నికలు నిర్వహించే విషయమై సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. -
గొర్రెలు దొరకడం లేదు!
♦ పంపిణీ నెమ్మదించిందని తలసానికి కలెక్టర్ల ఫిర్యాదు ♦ పథకం అమలులో సమస్యలు తెలుసుకున్న మంత్రి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకానికి జీవాల కొరత ఏర్పడింది. తమకు కేటా యించిన కొన్ని ప్రాంతాలలో లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేయడానికి సరిపడా జీవాలు దొరకడంలేదని కొందరు జిల్లా కలెక్టర్లు పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకొచ్చారు. ఇక గొర్రెలు లభ్యమైన ప్రాంతాలలో మందలోని అన్ని గొర్రెలూ కొనుగోలు చేయాలని విక్రయదారులు కోరుతుంటే, మరోవైపు అన్నీ ఒకే సైజులో ఉన్న గొర్రెలే కావాలని లబ్ధిదారులు కోరుతున్నారని కలెక్టర్లు వివరించారు. దీంతో గొర్రెల కొనుగోళ్లు, పంపిణీ నెమ్మదిగా సాగుతోందని వివిధ జిల్లాల కలెక్టర్లు మంత్రికి తెలిపారు. గొర్రెల పంపిణీ అమలు తీరుపై శుక్రవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, పశుసంవర్థకశాఖ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గొర్రెల అభివృద్ధి సమాఖ్య ఫెడరేషన్ చైర్మన్ రాజయ్య యాదవ్, పశుసంవర్థకశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సురేష్‌చందా, డైరెక్టర్ వెంకటేశ్వర్లు, గొర్రెల అభివద్ధి సమాఖ్య ఫెడరేషన్ ఎండీ లక్ష్మారెడ్డిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల కలెక్టర్లు, పశుసంవర్థకశాఖ అధి కారులను పథకం అమలుపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేగం పెంచండి... గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని తలసాని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులతో సమన్వయం చేసుకొని మంచి గొర్రెలను కొనుగోలు చేయాలన్నారు. ఆయా జిల్లాలకు నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తిచేసేలా చర్యలు తీసుకో వాలన్నారు. ఏ జిల్లా అధి కారులైనా వారికి కేటా యించిన ప్రాం తాలలోనే... గొర్రెల కొనుగోళ్ల ను జరపాలన్నారు. ఎవరికీ కేటాయించని గొర్రెలు లభ్యమయ్యే ప్రాంతాలు ఉంటే అవసరమైన జిల్లాలకు కేటాయించే విధంగా చూస్తామన్నారు. లబ్ధిదారుల వాటాధనాన్ని గొర్రెల కొనుగోలుకు 10 రోజుల ముందే చెల్లించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అధికసంఖ్యలో గొర్రెలను లారీలలో రవాణా చేయడం వల్ల అవి మృత్యువాత పడే ప్రమాదం ఉందని, ఒక్కో లారీలో కేవలం 4 యూనిట్ల గొర్రెలను మాత్రమే రవాణా చేయాలని మంత్రి ఆదేశించారు. రూ.వెయ్యి కోట్లతో మత్స్యరంగ సమగ్ర అభివృద్ధి... మత్స్యరంగ సమగ్ర అభివద్ధి కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని తలసాని అన్నారు. శుక్రవారం మత్స్యశాఖ అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. ఈ సంవత్సరం కూడా సుమారు 70 కోట్ల చేపపిల్లలను చెరువులు, రిజర్వాయర్లలో విడుదల చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు మంత్రి వివరించారు. చేపపిల్లల కొనుగోలులో కచ్చితంగా నిబంధనలను పాటించాల్సిందేనన్నారు. చేపపిల్లలను విడుదల చేసే సమయంలో మత్స్యశాఖ అధికారులతో పాటు మత్స్య సొసైటీ సభ్యులు కూడా బాధ్యతతో వ్యవహరించాలని ఆదేశించారు. రూ.వెయ్యి కోట్ల ఎన్సీడీసీ నిధులతో మత్స్యరంగ అభివృద్ధికోసం 2017–18, 2018–19లలో అమలయ్యే విధంగా రెండేళ్ల ప్రణాళికతో అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేసినట్లు చెప్పారు. 40 మార్కెట్ల నిర్మాణానికి నిధులు చేపలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ఒక్కో మార్కెట్‌కు రూ.10 లక్షల ఖర్చుతో 40 మార్కెట్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని మంత్రి చెప్పారు. మత్స్య సహకార సొసైటీలో సభ్యుడిగా ఉండి, 2015 సంవత్సరం వరకు ఆడిట్ నిర్వహించిన సొసైటీలలోని సభ్యులు మాత్రమే సబ్సిడీ పథకాలకు అర్హులవుతారని ఆయన పేర్కొన్నారు.