సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల గురించి మాట్లాడితే టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ఉలికిపాటు ఎందుకని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ దేశ రాజకీయాల గురించి మాట్లాడితే చంద్రబాబు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. కేంద్రం నిధులు ఇస్తోందని చంద్రబాబు ఈ రోజు ఒప్పుకున్నారు కదా అని గుర్తుచేశారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు పెట్టిన రూ.1000 కోట్లు ఎక్కడి నుండి వచ్చాయో బాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ఎన్టీఆర్ అల్లుడిగా నీవు వచ్చినప్పడు, నిన్ను ముఖ్యమంత్రి చేసిందే మేం’అని అన్నారు. ‘నేను హుందాగా మాట్లాడుతా అని చంద్రబాబు అంటున్నారు.
హుందాగా మాట్లాడటం గురించి మీరు మాకు నేర్పాలా?’అని ప్రశ్నించారు. ప్రధానికి తమకు ఎందుకు లంకె పెడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఈ విషయంలో చంద్రబాబు వ్యాఖ్యలు ‘దెయ్యాలు వేదాలు వల్లించినట్టు’ ఉన్నాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హైదరాబాద్‌కు వస్తే నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హైటెక్ సిటీకి ఎక్కడ ఫౌండేషన్ వేశారో చూపిస్తామని సవాల్ విసిరారు. ఒడిశా, కలకత్తా వెళ్లిన సీఎం కేసీఆర్ ఏం చేశారో ముందు ముందు మీకు తెలుస్తుందన్నారు. ధర్మపోరాటాల దీక్ష పేరుతో వందల కోట్లు వృథా చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఓడిపోవడం ఖాయమన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలు ఇరిగేషన్ ప్రాజెక్టులను అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మొదలు పెట్టారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment