గొర్రెలు దొరకడం లేదు! | district collectors complaint to talasani for sheeps distribution | Sakshi
Sakshi News home page

గొర్రెలు దొరకడం లేదు!

Published Sat, Jul 1 2017 6:26 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM

గొర్రెలు దొరకడం లేదు! - Sakshi

గొర్రెలు దొరకడం లేదు!

పంపిణీ నెమ్మదించిందని తలసానికి కలెక్టర్ల ఫిర్యాదు
పథకం అమలులో సమస్యలు తెలుసుకున్న మంత్రి


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకానికి జీవాల కొరత ఏర్పడింది. తమకు కేటా యించిన కొన్ని ప్రాంతాలలో లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేయడానికి సరిపడా జీవాలు దొరకడంలేదని కొందరు జిల్లా కలెక్టర్లు పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఇక గొర్రెలు లభ్యమైన ప్రాంతాలలో మందలోని అన్ని గొర్రెలూ కొనుగోలు చేయాలని విక్రయదారులు కోరుతుంటే, మరోవైపు అన్నీ ఒకే సైజులో ఉన్న గొర్రెలే కావాలని లబ్ధిదారులు కోరుతున్నారని కలెక్టర్లు వివరించారు. దీంతో గొర్రెల కొనుగోళ్లు, పంపిణీ నెమ్మదిగా సాగుతోందని వివిధ జిల్లాల కలెక్టర్లు మంత్రికి తెలిపారు.

గొర్రెల పంపిణీ అమలు తీరుపై శుక్రవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, పశుసంవర్థకశాఖ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గొర్రెల అభివృద్ధి సమాఖ్య ఫెడరేషన్‌ చైర్మన్‌ రాజయ్య యాదవ్, పశుసంవర్థకశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సురేష్‌చందా, డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు, గొర్రెల అభివద్ధి సమాఖ్య ఫెడరేషన్‌ ఎండీ లక్ష్మారెడ్డిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల కలెక్టర్లు, పశుసంవర్థకశాఖ అధి కారులను పథకం అమలుపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

వేగం పెంచండి...
గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని తలసాని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులతో సమన్వయం చేసుకొని మంచి గొర్రెలను కొనుగోలు చేయాలన్నారు. ఆయా జిల్లాలకు నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తిచేసేలా చర్యలు తీసుకో వాలన్నారు. ఏ జిల్లా అధి కారులైనా వారికి కేటా యించిన ప్రాం  తాలలోనే... గొర్రెల కొనుగోళ్ల ను జరపాలన్నారు. ఎవరికీ కేటాయించని గొర్రెలు లభ్యమయ్యే ప్రాంతాలు ఉంటే అవసరమైన జిల్లాలకు కేటాయించే విధంగా చూస్తామన్నారు. లబ్ధిదారుల వాటాధనాన్ని గొర్రెల కొనుగోలుకు 10 రోజుల ముందే చెల్లించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అధికసంఖ్యలో గొర్రెలను లారీలలో రవాణా చేయడం వల్ల అవి మృత్యువాత పడే ప్రమాదం ఉందని, ఒక్కో లారీలో కేవలం 4 యూనిట్ల గొర్రెలను మాత్రమే రవాణా చేయాలని మంత్రి ఆదేశించారు.

రూ.వెయ్యి కోట్లతో
మత్స్యరంగ సమగ్ర అభివృద్ధి...

మత్స్యరంగ సమగ్ర అభివద్ధి కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని తలసాని అన్నారు. శుక్రవారం మత్స్యశాఖ అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. ఈ సంవత్సరం కూడా సుమారు 70 కోట్ల చేపపిల్లలను చెరువులు, రిజర్వాయర్లలో విడుదల చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు మంత్రి వివరించారు. చేపపిల్లల కొనుగోలులో కచ్చితంగా నిబంధనలను పాటించాల్సిందేనన్నారు. చేపపిల్లలను విడుదల చేసే సమయంలో మత్స్యశాఖ అధికారులతో పాటు మత్స్య సొసైటీ సభ్యులు కూడా బాధ్యతతో వ్యవహరించాలని ఆదేశించారు. రూ.వెయ్యి కోట్ల ఎన్‌సీడీసీ నిధులతో మత్స్యరంగ అభివృద్ధికోసం 2017–18, 2018–19లలో అమలయ్యే విధంగా రెండేళ్ల ప్రణాళికతో అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేసినట్లు చెప్పారు.

40 మార్కెట్ల నిర్మాణానికి నిధులు
చేపలకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించేందుకు ఒక్కో మార్కెట్‌కు రూ.10 లక్షల ఖర్చుతో 40 మార్కెట్‌ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని మంత్రి చెప్పారు. మత్స్య సహకార సొసైటీలో సభ్యుడిగా ఉండి, 2015 సంవత్సరం వరకు ఆడిట్‌ నిర్వహించిన సొసైటీలలోని సభ్యులు మాత్రమే సబ్సిడీ పథకాలకు అర్హులవుతారని ఆయన పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement