- ప్రభుత్వాన్ని నిలదీయనున్న విపక్షాలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో ‘విద్యుత్’ సెగలు తాకనున్నాయి. బడ్జెట్ సమావేశాల రెండో రోజైన శుక్రవారం నాడు ప్రధానంగా కరెంట్ సమస్యపైనే చర్చ జరుగనుంది. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావనకు వచ్చే పది ప్రశ్నల్లో.. మూడు ప్రశ్నలు విద్యుత్‌కు సంబంధించినవే ఉన్నాయి. దీంతో అధికార, విపక్షాల మధ్య ఈ అంశంపై వివాదం రాజుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో కరెంటు సంక్షోభంపై ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి.
ఈ తరుణంలో అసెంబ్లీలోనూ ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అని పార్టీలూ సమాయత్తమయ్యాయి. మరోవైపు ఈ సమస్యకు సమైకాంధ్ర పాలకుల వివక్షనే ప్రధాన కారణమని, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను ఉల్లంఘించి.. న్యాయమైన వాటా ప్రకారం రావాల్సిన విద్యుత్‌ను ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుపడుతోందని వాదిస్తున్న అధికార పార్టీ.. ఇప్పుడు ఇదే విషయాన్ని అసెంబ్లీ వేదికగా ప్రజలకు తెలియజెప్పేందుకు సిద్ధమైంది.
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్, ఉత్పత్తి, కొరత వంటి గణాంకాలతో పాటు తెలంగాణ, ఏపీల మధ్య ఒప్పందాలు, విద్యుత్ పంపిణీ, కృష్ణపట్నం, వైజాగ్ హిందూజా, దిగువ సీలేరు ప్రాజెక్టుల్లో రాష్ట్రానికున్న వాటాలు, వ్యవసాయానికి 9 గంటల సరఫరా, పంప్‌సెట్లపై సర్‌చార్జీ రద్దు.. వంటి అంశాలు ప్రశ్నోత్తరాల సమయంలో ప్రధానంగా ప్రస్తావనకు రానున్నాయి.