20 రోజుల్లోనే గ్రీన్‌సిగ్నల్ | telangana industrial policy | Sakshi
Sakshi News home page

20 రోజుల్లోనే గ్రీన్‌సిగ్నల్

Published Tue, Feb 10 2015 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 9:02 PM

telangana industrial policy

సింగిల్ విండో ద్వారా వీఎస్‌టీ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు
నూతన పారిశ్రామిక విధానంలో తొలి అడుగు.. ఐ-పాస్ సర్టిఫికెట్ జారీ చేసిన రాష్ర్ట ప్రభుత్వం
పరిశ్రమల శాఖపై మంత్రి జూపల్లి సమీక్ష... జిల్లా, రాష్ట్ర స్థాయిలో భూములు, పరిశ్రమలపై ఆరా
జూన్ 2 నుంచి వచ్చిన ఎంఎస్‌ఎంఈ దరఖాస్తులు 5,289
రూ.2,538.05 కోట్ల పెట్టుబడులు, 46,235 మందికి ఉపాధి
పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్, సకలం ఆన్‌లైన్


సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నూతన పారిశ్రామిక విధానం(టీఎస్-ఐపాస్)లో తొలి అడుగుపడింది. రూ. 200 కోట్లలోపు పెట్టుబడితో పరిశ్రమలు స్థాపించేందుకు వచ్చే వారికి సింగిల్ విండో పద్ధతిలో 30 రోజుల్లో అన్ని అనుమతులు మంజూరు చేయాలన్న నిబంధనకు కార్యరూపం లభించింది. రూ. 80 కోట్ల పెట్టుబడితో 600 మందికి ఉపాధి కల్పించేలా వజీర్ సుల్తాన్ టొబాకో(వీఎస్‌టీ) కంపెనీ తూప్రాన్‌లో నిర్మించ తలపెట్టిన భారీ ప్రాసెసింగ్ యూనిట్‌కు 20 రోజుల్లోనే అన్ని అనుమతులు మంజూరయ్యాయి.

ఈమేరకు టీఎస్‌ఐఐసీ కమిషనర్ జయేష్ రంజన్ సంతకంతో జారీ చేసిన ఐపాస్ సర్టిఫికెట్‌ను వీఎస్‌టీ ప్రతినిధులకు సోమవారం పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అందజేశారు. నూతన విధానంపై పరిశ్రమల శాఖ, టీఎస్‌ఐఐసీ అధికారులతో పరిశ్రమల భవన్‌లో మంత్రి జూపల్లి సమీక్ష జరిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్‌ఎంఈ)లతో పాటు భారీ పరిశ్రమల స్థాపనకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో వచ్చిన దరఖాస్తులు, సింగిల్ విండో పద్ధతిలో ఇచ్చిన అనుమతులపై ఆయన చర్చించారు.

నూతన పారిశ్రామిక విధానానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో లభిస్తున్న ఆదరణను అధికారులకు వివరించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో జూన్ 2 నుంచి జనవరి 31 వరకు ఉత్పత్తి, సేవా రంగాల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం 5289 దరఖాస్తులు వచ్చాయని, రూ. 2538.05 కోట్ల పెట్టుబడులతో వస్తున్న ఈ పరిశ్రమల వల్ల 46,235 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి చెప్పారు. వీటిలో 3,067 పరిశ్రమలకు సంబంధించి అనుమతులు మంజూరు కాగా, 1749 పరిశ్రమలు ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయన్నారు. 416.73 కోట్లతో ఏర్పాటైన ఈ పరిశ్రమల వల్ల తొలిదశలో 14,114 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఫార్మాతోపాటు ఇంజనీరింగ్, గూడ్స్, ప్లాస్టిక్ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు కూడా రాష్ట్రానికి రాబోతున్నాయన్నారు.

పారిశ్రామికవేత్తలకు సహకరిస్తాం
పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. పరిశ్రమల కోసం ఎవరు దరఖాస్తు చేసుకున్నా, అనుమతుల కోసం ఇతర ప్రభుత్వ శాఖల చుట్టూ తిరగకుండా పరిశ్రమల శాఖనే అన్ని అనుమతులను మంజూర చేయించే బాధ్యతను తీసుకుంటుందన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు, అనుమతుల ట్రాకింగ్ వ్యవస్థను రూపొందించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమలకు గుర్తింపు సంఖ్య కేటాయించి.. వాటికి ఏవైనా సమస్యలు ఎదురైతే ఆ సంఖ్య ఆధారంగా పరిశ్రమల శాఖను సంప్రదించే ఏర్పాటు చేస్తామన్నారు.

టోల్‌ఫ్రీ నెంబర్ కూడా కేటాయిస్తామన్నారు. జిల్లా స్థాయిల్లోనూ ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించి, అనుమతుల కోసం ‘మీ సేవా’ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే వ్యవస్థను తీసుకొస్తామన్నారు. టీఎస్‌ఐఐసీ గుర్తించిన 2.50 లక్షల ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ఇప్పటికే రూ. 100 కోట్లు కేటాయించిందని, వచ్చే బడ్జెట్‌లో మరిన్ని కేటాయింపులు జరుపుతామని జూపల్లి చెప్పారు. భూముల కేటాయింపును కూడా ఆన్‌లైన్‌లోనే జరిపేలా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

నిర్ణీత గడువులో పరిశ్రమలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, ఆ భూముల్లో రియల్‌ఎస్టేట్, ఇతర వ్యాపారాలకు అనుమతివ్వబోమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాంకేతిక విద్యనభ్యసించి నిరుద్యోగులుగా ఉన్న వారికి పరిశ్రమల పట్ల అవగాహన కల్పించేందుకు మండల స్థాయిలో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్ర స్థాయిలో పరిశ్రమల అనుమతుల తీరును పరిశీలించేందుకు వారం రోజుల్లో చేజింగ్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర, టీఎస్‌ఐఐసీ కమిషనర్ జయేష్ రంజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

పరిశ్రమలకు ఊతమిద్దాం
జిల్లాల వారీగా పరిశ్రమల ఏర్పాటుకు అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో సహకరించాలని, ఔత్సాహికులను ప్రోత్సహించడం ద్వారా బంగారు తెలంగాణకు బాటలు వేయాలని అధికారులకు మంత్రి జూపల్లి హితబోధ చేశారు. రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, అందిస్తున్న రాయితీలపై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.

సమీక్షలో భాగంగా జిల్లాలవారీ పరిస్థితిపై నివేదికలను పరిశీలించారు. సీసీఎల్‌ఏ, వాటర్‌బోర్డు, విద్యుత్ డిస్కమ్‌లు, ట్రాన్స్‌కో, వాణిజ్య పన్నులు, నీటి పారుదల శాఖ, ఫైర్ సర్వీసెస్, పంచాయితీరాజ్, ఫ్యాక్టరీస్ శాఖ, మైనింగ్ వంటి 19 రకాల అనుమతులను సింగిల్‌విండో విధానం ద్వారా 30 రోజుల్లో అందించేందుకు చేసిన ఏర్పాట్లను ఈ సందర్భంగా అధికారులు వివరించారు. పరిశ్రమల కోసం జిల్లాలవారీగా సేకరించిన, కేటాయించిన భూముల వివరాలను మంత్రికి తెలియజేశారు. రాష్ట్రంలో బృహత్తర బాధ్యత పరిశ్రమల శాఖపైనే ఉందని, తదనుగుణంగా చిత్తశుద్ధితో పనిచేయాలని ఈ సందర్భంగా జూపల్లి సూచించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement