
సాక్షిప్రతినిధి, సూర్యాపేట : తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ తొలిదశ ఉద్యమం జిల్లాలో చరిత్రాత్మకం. ఇదే చైతన్య స్ఫూర్తితో తెలంగాణ మలి దశ ఉద్యమంలో జిల్లాలోని యువత, ఉద్యోగులు, సంఘాలు, రైతులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఇప్పుడు ఇదే వర్గాలను ఆకర్షించేందుకు తెలంగాణ జన సమితి రాజకీయ బాట పట్టింది. నాడు ఉద్యమంలో పాల్గొన్న వర్గాలు, ప్రస్తుతం అన్ని పార్టీల్లో ఉన్న ద్వితీయ శ్రేణి నేతలపై ఆపార్టీ నజర్ పెట్టింది. సూర్యాపేట, కోదాడ, తుంగతుర్తి, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో ఇప్పటికే జేఏసీ పలుమార్లు ప్రజా సమస్యలపై ఉద్యమించింది.
అలాగే ప్రొఫెసర్ కోదండరాం కొత్తగా జిల్లా ఏర్పాటు అయిన తర్వాత పది సార్లు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో ప్రధానంగా మార్కెట్లలో ఇబ్బందులు, పంటలు పండని స్థితి పై ఆయన నేరుగా రైతులతో మాట్లాడారు. ఇలా పలు మార్లు జిల్లాలో ఆయన పర్యటించడం, కొత్తగా పార్టీ పెట్టడడంతో.. ఈ పార్టీ ఎలా ఉండబోతుందని జిల్లాలోని ఈ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే రాజధానిలో నిర్వహించే సభకు భారీ జన సమీకరణ చేసి తమ సత్తా ఏంటో చాటుతాం అంటూ ఆపార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
5 వేలకు పైగా జన సమీకరణే లక్ష్యంగా ..
జిల్లాలో ఆపార్టీ నేతలు ఆవిర్భావ సభకు 5 వేలకు పైగా జన సమీకరణ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రామాలు, పట్టణాల్లో పోస్టర్లు, కరపత్రాలు, ప్రచార రథాలతో ప్రచారం నిర్వహించారు. నాలుగు నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు చేసి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తొలి నుంచి ఉద్యమంలో కోదండరాం బాటలో నడిచిన ధర్మార్జున్ హైదరాబాద్ సభకు ఉమ్మడి జిల్లానుంచి జన సమీకరణ బాధ్యతలను భుజానకెత్తుకున్నారు.
ఇక ఈ పార్టీలో సూర్యాపేట నియోజకవర్గ కేంద్రంగా ప్రభాకర్, తండు నాగరాజు, గట్ల రవిశంకర్, కోదాడలో పందిరి నాగిరెడ్డి, చిన్ని, గంధం బంగారు, పాష, హుజూర్‌నగర్‌లో దొంతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, అంబటి నాగయ్య, ధనయ్యగౌడ్‌లు, తుంగతుర్తిలో పొన్నం మల్లేష్, సానాది వెంకట్‌రెడ్డి, నాగరాజులు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరంతా సభను సక్సెస్ చేయాలని ఆయా నియోజకవర్గాల్లో ప్రచార బాట పట్టారు. పార్టీ ఆదేశాలతో ప్రధానంగా యువత, రైతాంగాన్ని ఎక్కువగా సభకు తరలించేందుకు సమాయత్తమవుతున్నారు.
అసమ్మతి నేతలపై నజర్ ..
జిల్లాలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల్లో అసమ్మతి నేతలపై తెలంగాణ జన సమతి దృష్టి పెట్టినట్లు సమాచారం. నామినేటెడ్ పోస్టులు, పార్టీ పరంగా పదవులు రాని నేతలు అసమ్మతి రాగం వినిపిస్తుండడంతో వీరితో జన సమితి నేతలు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఈ పార్టీలకు చెందిన కొంతమంది ద్వితీయ శ్రేణి నేతలు, జిల్లా నాయకులు, కోదండరాంతో కూడా చర్చలు జరిపినట్లు సమాచారం.
పార్టీ ఆవిర్భావ సభ రోజు ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు జన సమితిలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఇతర పార్టీల్లోని ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలను జన సమితిలో చేర్చుకొని పల్లెపల్లెకు ‘జన సమితి’ కార్యాచరణను ప్రకటించేలా బహిరంభ సభను వేదికగా చేస్తున్నారు. ఈ సభ ముగియగానే ముందుగా జిల్లాలోని అన్ని మండలాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో పార్టీ జెండాను ఎగుర వేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. బహిరంగ సభ చైతన్య స్ఫూర్తి, రానున్న ‘మే’ డే ఉత్సవాలతో పార్టీ కార్యక్రమాలను పల్లెబాట పట్టించాలని ఆపార్టీ నాయకులు భావిస్తున్నారు.
అయితే బహిరంగ సభ పైనే అన్ని పార్టీల దృష్టి నెలకొంది. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మంది జనం వస్తారని ఇతర పార్టీల నేతలు ఎదురుచూస్తున్నారు. జన సమితి ఒంటరిగా పోటీ చేస్తుందా..? ఇతర పార్టీలతో కలిసి ఉద్యమిస్తుందా.. పోటీ చేస్తుందా..? సభలో పార్టీ కార్యాచరణ ఏం ఉంటుంది.. జిల్లాలో అనంతరం పరిస్థితి ఎలా ఉండబోతుందని అన్ని వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment