16 నుంచి అసెంబ్లీ
- అదే రోజు నుంచి మండలి భేటీ కూడా
- వారం పాటు నిర్వహించాలని యోచన
- ఒక రోజు ముందు బీఏసీ సమావేశం
- షెడ్యూల్‌పై సమీక్షలో సీఎం కేసీఆర్ నిర్ణయం
- 10న కేబినెట్, 14న కలెక్టర్లతో సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ, శాసనమండలి శీతాకాల సమావేశాలను ఈనెల 16 నుంచి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాలను ప్రకటించాల్సిందిగా గవర్నర్‌ను కోరుతూ నోట్ పంపాలని అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాంను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కోరారు. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి బుధవారం ప్రగతి భవన్‌లో సన్నాహక సమావేశం జరిగింది. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, పోచారం శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం, అసెంబ్లీ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు.
అసెంబ్లీ సమావేశాలకు ముందు రోజైన 15వ తేదీన ఉదయం పదకొండున్నర గంటలకు స్పీకర్ కార్యాలయంలో బీఏసీ సమావేశం నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. అయితే జీఎస్టీ బిల్లును ఆమోదించేందుకు ఆగస్టు 30న ఒక రోజు అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. తిరిగి మూడున్నర నెలల తర్వాత సమావేశాలు జరుగనుండటం ప్రాధాన్యాత సంతరించుకుంది. ఈసారి వారం రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ముందుగా కేబినెట్ భేటీ
ఈనెల 10న మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలతో పాటు నోట్ల రద్దు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాజకీయ వ్యూహరచనపై ఇందులో చర్చించే అవకాశాలున్నాయి.
ప్రగతిభవన్‌లో కలెక్టర్ల సదస్సు
ఈనెల 14న ప్రగతిభవన్‌లో జిల్లా కలెక్టర్ల సమావేశంతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రెండు సెషన్లలో ఈ సమావేశం జరుగనుంది. మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులు, కలెక్టర్లు సమావేశానికి హాజరుకావాలని సీఎం సూచించారు. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత కలెక్టర్లతో నిర్వహించే తొలి సమావేశం కావడంతో.. ప్రభుత్వ పథకాల అమలు, ప్రణాళికల తయారీ, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే దిశగా ప్రజలను చైతన్యపర్చడం తదితర అంశాలపై అందులో చర్చించనున్నారు.
15న టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలను సమాయత్తం చేసేందుకు ఈనెల 15న ప్రగతి భవన్‌లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం జరపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలకు సమాచారం చేరవేశారు.
18న క్రిస్మస్ వస్త్రాల పంపిణీ
ఈనెల 18న ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిరుపేద క్రైస్తవులకు వస్త్రాలను పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా పేద కుటుంబాలకు దుస్తులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం గత ఏడాది నుంచి అమలు చేస్తున్న విషయం తెలిసిందే.