‘కోమటిరెడ్డి’ టాప్‌ | Telangana MLA Candidates Assets Analysis | Sakshi
Sakshi News home page

సంపన్నుల సమేత.. వినుడు వినుడు అభ్యర్థుల గాథ

Published Tue, Dec 4 2018 9:16 AM | Last Updated on Tue, Dec 4 2018 1:16 PM

Telangana MLA Candidates Assets Analysis - Sakshi

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఆది నుంచీ ఆసక్తికరంగా మారాయి. ముందస్తు ముచ్చట మొదలు ఆద్యంతం అనేక పరిణామాలు ఉత్కంఠ రేపాయి. తాజాగా ఎలక్షన్‌ వాచ్‌ సంస్థ అభ్యర్థుల అఫిడవిట్లను పరిశీలించగా  మరిన్ని విశేషాలు వెల్లడయ్యాయి. మొత్తం 119 స్థానాల్లో 1821 మంది అభ్యర్థులు బరిలో నిలవగా... 1777 మంది అభ్యర్థుల అఫిడవిట్లను ఈ సంస్థ విశ్లేషించింది. ధనికులు, పేదలు, ఆదాయం, అప్పులు, విద్యావంతులు, మహిళలు, యువత... ఇలా విభిన్న అంశాలపై సంస్థ వెల్లడించిన గణాంకాలివీ...  

ధనికులు
నల్లగొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధనవంతుల జాబితాలో టాప్‌లో నిలిచారు. ఈయన అఫిడవిట్‌లో రూ.266.86 కోట్ల చరాస్తులు, రూ.47.45 కోట్ల స్థిరాస్తులు చూపారు. మొత్తంగా ఆయనతో పాటు కుటుంబసభ్యుల పేరుతో ఉన్న స్థిర, చరాస్తుల విలువ రూ.314 కోట్లకు పైమాటే. ఇక బాల్కొండ బీఎస్పీ అభ్యర్థి ముత్యాల సునీల్‌కుమార్‌ స్థిర, చరాస్తులు రూ.182.66 కోట్లతో రెండో స్థానంలో, నాగర్‌కర్నూల్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి రూ.161.29 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో ఉన్నారు.  

పేదలు  
నిజామాబాద్‌ అర్బన్‌ స్వతంత్ర అభ్యర్థి బల్ల శ్రీనివాస్‌ కేవలం రూ.15 ఆస్తి చూపి అత్యంత నిరుపేదగా నిలిచారు. కోరుట్ల స్వతంత్ర అభ్యర్థి జగిలం రమేష్‌ రూ.500, పెద్దపల్లి సమాజ్‌వాదీ ఫార్వర్డ్‌బ్లాక్‌ అభ్యర్థి వేణుగోపాల్‌రెడ్డి రూ.500 ఆస్తులు చూపారు. ‘సున్న’ ఆస్తులున్నవని ప్రకటించినవారు 58 మంది ఉండడం విశేషం.
 
అప్పులు   
బాల్కొండ బీఎస్పీ అభ్యర్థి ముత్యాల సునీల్‌కుమార్‌ రూ.144 కోట్లు వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణంగా పొందినట్లు అఫిడవిట్‌లో చూపి, అప్పులున్న అభ్యర్థుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. పాలేరు కాంగ్రెస్‌ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి ఆస్తులు రూ.91 కోట్లు కాగా.. అప్పులు రూ.94కోట్లుగా పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి అప్పులు రూ.63 కోట్లు.

ఆదాయం  
అఫిడవిట్‌లో ఆదాయం అధికంగా చూపిన అభ్యర్థుల్లో మంచిర్యాల బీజేపీ అభ్యర్థి వీరబెల్లి రఘునాథ్‌  అగ్రభాగాన నిలిచారు. ఈయన అఫిడవిట్‌లో రూ.47 కోట్ల ఆస్తులు చూపగా.. ఐటీకి చూపిన ఆదాయం రూ.41కోట్లుగా ఉందని పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి ఐటీకి చూపిన ఆదాయం రూ.8కోట్లు కాగా..  నారాయణపేట టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాజేందర్‌రెడ్డి ఆస్తులు రూ.66కోట్లు, ఆదాయం రూ.7కోట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 

విద్యావంతులు  
1777 మంది అభ్యర్థుల్లో 5–12వ తరగతి చదివిన అభ్యర్థులు 799 మంది (45 శాతం), 845 మంది (48శాతం) పట్టభద్రులు (గ్రాడ్యుయేట్‌) ఉన్నారు. 16 మంది అభ్యర్థులు కేవలం అక్షరాస్యులమని తెలపగా, మరో 48 మంది తాము పూర్తిగా నిరక్షరాస్యులమని పేర్కొన్నారు.
 
యువోత్సాహం
748 మంది అభ్యర్థులు(42శాతం) తమ వయస్సు 25–40 సంవత్సరాలుగా ప్రకటించగా... 845 మంది (48శాతం) 41–60 ఏళ్ల మధ్యలో ప్రకటించారు. ఇక 61–80 ఏళ్ల మధ్యలో ప్రకటించినవారు 160 మంది(9శాతం) ఉండగా.. 24 మంది అభ్యర్థులు వయసు పేర్కొనలేదు.  

మొత్తం స్థానాలు- 119
మొత్తం అభ్యర్థులు- 1821
ఎలక్షన్‌ వాచ్‌ పరిశీలించిన అఫిడవిట్లు- 1777

పార్టీల వారీగా... 
బీజేపీ నుంచి పోటీ చేస్తున్న 118 మందిలో 86మంది (73శాతం), కాంగ్రెస్‌ అభ్యర్థులు 99 మందిలో 79 మంది (80 శాతం), టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు 119 మందిలో 107మంది (90 శాతం), బీఎస్పీ అభ్యర్థులు 100 మందిలో 26మంది (26 శాతం), టీడీపీ అభ్యర్థులు 13 మందిలో 12 మంది (92 శాతం) రూ.కోటి కంటే ఎక్కువ ఆస్తులు చూపినట్లు ఎలక్షన్‌ వాచ్‌ ప్రకటించింది.  

సగటు రూ.3.29 కోట్లు  
ఇక ఎన్నికల్లో బరిలో నిలిచిన మొత్తం అభ్యర్థుల ఆస్తులను పరిగణలోకి తీసుకుంటే సరాసరి ఒక్కో అభ్యర్థి సగటు ఆస్తి రూ.3.29 కోట్లుగా ఉందని ఎలక్షన్‌ వాచ్‌ పేర్కొంది. పార్టీల వారీగా చూస్తే టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల(119) సగటు ఆస్తి రూ.12.48 కోట్లు, బీజేపీ అభ్యర్థుల (118) సగటు ఆస్తి రూ.7.79 కోట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థుల(99)  సగటు ఆస్తి రూ.16.03కోట్లు,  బీఎస్పీ అభ్యర్థుల (100) సగటు ఆస్తి రూ.5.28కోట్లుగా వెల్లడించింది. 

మహిళలు  
జనాభాలో సగం ఉన్నప్పటికీ ఎన్నికల్లో మహిళలకు సముచిత ప్రాధాన్యం దక్కడం లేదు. ఈ ఎన్నికల్లో కేవలం 136 మంది (8శాతం) మహిళలు మాత్రమే బరిలో నిలిచినట్లు ఎలక్షన్‌ వాచ్‌ ప్రకటించింది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement