సాక్షి, హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీ భూముల పరిశీలన ఆదివారం ఉద్రికత్తకు దారితీసింది. ఓయూ భూములను పరిశీలించేందుకు వెళ్లిన తెలంగాణ పీసీసీ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. డీడీ కాలనీలో కబ్జా అయిన భూమి దగ్గరకు వెళ్లేందుకు యత్నించారు. అయితే వారిని అడ్డుకోవడంతో కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తమను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలంటూ నిలదీశారు. ఈ కార్యక్రమంలో టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, వి.హనుమంతరావు, వంశీచంద్‌రెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. (ప్రభుత్వ వైఫల్యాలపై టీపీసీసీ ‘పోరుబాట’)
కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరుబాట పట్టాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ ఓయూ భూములను పరిశీలించింది. ఉస్మానియా యూనివర్సిటీలో కొందరు బీజేపీ, టీఆర్‌ఎస్ నేతలు భూములు కబ్జా చేస్తున్నారన్న ఆరోపణలతో పీసీసీ నేతలు ఉస్మానియాకు వెళ్లారు.
ఇక ప్రభుత్వ వైఫల్యాలపై అధ్యయనం చేసేందుకు నాలుగు కమిటీలు ఏర్పాటు చేయాలని తెలంగాణ పీసీసీ నిర్ణయించింది. ఆర్థిక వ్యవహారాలపై సీఎల్పీ నేత భట్టి నేతృత్వంలో, ఉస్మానియా భూములు, విద్యారంగాలపై మాజీ ఎంపీ పొన్నం నేతృత్వంలో, నూతన వ్యవసాయ విధానంపై అధ్యయనానికి చిన్నారెడ్డి, కోదండరెడ్డి, గోదావరి పెండింగ్ ప్రాజెక్టులపై ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment