
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో దాదాపు 2.5 లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ జారీపై విద్యా శాఖ దృష్టి సారించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు కసరత్తు చేస్తోంది. గతేడాది విద్యా శాఖ జూలై 23న టెట్ నిర్వహించింది. అయితే ఈసారి అంతకుముందే టెట్ నిర్వహించాలని భావిస్తోంది. అంతేకాదు ఈసారి ఆన్‌లైన్‌లో టెట్‌ను నిర్వహించే యోచన కూడా చేస్తోంది. అయితే అధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరుకానున్న నేపథ్యంలో ఆన్‌లైన్ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తోంది. ప్రతిపాదనలకు ప్రభుత్వం ఓకే చెప్పగానే నోటిఫికేషన్ జారీ చేస్తామని విద్యా శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
గతేడాది టెట్‌లో పేపర్–1 పరీక్ష రాసేందుకు 1,11,647 మంది దరఖాస్తు చేసుకోగా, పరీక్షకు 98,848 మంది హాజరయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో 56,708 మంది (57 శాతం) అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్–2 పరీక్ష రాసేందుకు 2,56,265 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 2,30,932 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో కేవలం 45,055 మంది (19.51 శాతం) అర్హత సాధించారు. అంటే రెండు పేపర్లలో కలిపి దరఖాస్తు చేసిన వారిలో ఇంకా 2.5 లక్షల కంటే ఎక్కువ మంది టెట్ కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్), డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) ఫైనలియర్ చదువుతున్న మరో 25 వేల మంది అభ్యర్థులు టెట్ రాయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment