నలుగుతున్న నాలుగోసింహం! | Telangana Police Department Focus On Duty | Sakshi
Sakshi News home page

నలుగుతున్న నాలుగోసింహం!

Published Mon, May 27 2019 10:06 AM | Last Updated on Mon, May 27 2019 10:06 AM

Telangana Police Department Focus On Duty - Sakshi

సూర్యాపేట : పోలీసు శాఖ ఓ వైపు అధునాతన టెక్నాలజీని వినియోగిస్తూ దూసుకెళ్తుంటే.. మరోవైపు కిందిస్థాయి సిబ్బంది మాత్రం ఇంకా నైరాశ్యంలోనే కొట్టుమిట్టాడుతోంది. వారంలో ఒక్కరోజైనా వీక్లీ ఆఫ్‌గా తీసుకునే అవకాశం లేక సతమతమవుతోంది. మద్యానికి బానిసై కుటుంబాలకు దూరం కావొద్దంటూ కిందిస్థాయి పోలీసు సిబ్బందికి సందేశాలు పంపిస్తున్న ఉన్నతాధికారులు.. వారికి వీక్లీ ఆఫ్‌ మంజూరు అంశంలో మాత్రం విఫలమవుతున్నారు. వీక్లీ ఆఫ్‌ హామీ పదేళ్లకు పైగా ముందుకు కదలకపోవడం గమనార్హం. ఇదేమిటంటే సిబ్బంది కొరత, శాంతిభద్రత విధుల కారణంగా వీక్లీ ఆఫ్‌ ఇవ్వలేని పరిస్థితి ఉందనే సమాధానం వస్తోంది. అయితే గత మూడు నాలుగేళ్లలో పోలీసు శాఖలో వేల సంఖ్యలో పోస్టులను భర్తీ చేసినా కూడా వీక్లీ ఆఫ్‌ ఎందుకు అమలు కావడం లేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
 
సిబ్బంది కొరత సాకుతో.. 
ఉమ్మడి జిల్లాలోని ఆయా పోలీస్‌స్టేన్లలో మూడు వేలకు పైగానే హోంగార్డు నుంచి కానిస్టేబుల్, హెడ్‌ కానిస్టేబుల్, ఏఆర్‌ పీసీ, హెచ్‌సీ, ఏఎస్‌ఐల వరకు పనిచేస్తున్నారు. అందులో మెజారిటీ శాతం సివిల్‌ విభాగంలో పనిచేసే వారే. వీరికి వీక్లీఫ్‌ ఇస్తామని పదేళ్లకు పైగా అధికారులు ప్రకటిస్తూ వస్తున్నారు. తీరా దానిపై కసరత్తు చేసే సమయానికి సిబ్బంది కొరత అని, సివిల్‌ విభాగం శాంతిభద్రతల పరిరక్షణలో కీలకం కాబట్టి అమలు చేయడం కష్టమని చెబుతూ దాటవేస్తున్నారు. దీంతో కిందిస్థాయి పోలీసు సిబ్బందిలో అసంతృప్తి పెరుగుతూనే ఉంది. కొత్తగా పెద్ద సంఖ్యలో కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేసినందున సిబ్బంది కొరత అనేది పెద్ద సమస్య కాదని.. దీనిని అధిగమించేందుకు ఉన్నతాధికారులు కసరత్తు చేయకపోవడమే ఆందోళనకరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు టెక్నాలజీ పెరిగిన కొద్ది పనిభారం తగ్గుతోందని, పోలీసు సేవలు త్వరితగతిన అందుతున్నాయని.. ఈ నేపథ్యంలో వీక్లీ ఆఫ్‌ అమలుకు ప్రయత్నించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మూడు నెలలకే పర్చి్చమితం..
జిల్లాల పునర్విభజనకు ముందు  అప్పట్లో ఎస్పీలుగా పనిచేస్తున్న విక్రమ్‌ జిత్‌ దుగ్గల్, ప్రభాకర్‌రావులు జిల్లాలో పనిచేస్తున్న పోలీసు సిబ్బందికి వీక్లీ ఆఫ్‌ అమలులోకి తీసుకొచ్చారు. అది కూడా వారు పనిచేసిన ఏళ్ల తరబడి సమయంలో కేవలం మూడు నెలలు మాత్రమే సిబ్బందికి వీక్‌ ఆఫ్‌ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా నుంచి జిల్లాలుగా ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు ఏ ఒక్క రోజు కూడా వీక్‌ ఆఫ్‌ అమలు అయిన దాఖలాలు లేవు.
 

అనారోగ్యాల బారిన పడుతున్న సిబ్బంది

వారాంతపు సెలవు ఇప్పటికీ నినాదంగానే మారింది. పండుగ పబ్బం లేకుండా అత్యవసర పరిస్థితుల్లో 24 గంటలూ విధుల్లోనే ఉండాల్సిన పరిస్థితి. సిబ్బంది కొరతతో తీవ్రమైన పని ఒత్తిడి వలన పోలీసు సిబ్బంది రోగాల బారిన పడుతున్నారు. మరోవైపు శారీరక వ్యాయామంపై నిర్లక్ష్యం, మద్యం, దూమపానం వంటి వ్యసనాలు కూడా కొందరికి అనారోగ్యం పాలవడానికి మరో కారణం. పోలీసు సిబ్బందిపై పని భారం పెరిగి ఒత్తిళ్లకు లోనవుతున్నారు. 

వీక్‌ ఆఫ్‌ అమలు చేయాలి
జిల్లాలో పోలీసు సిబ్బందిపై రోజురోజుకూ ఒత్తిడి పెరుగుతోంది. ఒకవైపు వరుసగా ఎన్నికల బందోబస్తుతో నిమిషం కూడా విశ్రాంతి తీసుకునే సమయం లేకుండా పోయింది. జిల్లాలో ఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కానీ సిబ్బందికి మాత్రం వీక్లీ ఆఫ్‌ అమలు కావడంలేదు. వీక్లీ ఆఫ్‌ అమలు అయ్యే విధంగా ఉన్నతాధికారులు దృష్టిసారించాలి. – గుగులోతు అమర్‌సింగ్, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు, సూర్యాపేట

అమలులోనే ఉంది
క్షేత్రస్థాయి పోలీస్‌ ఇబ్బంది వీక్లీ ఆఫ్‌ అమలులోనే ఉంది. వరుస ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా కొన్ని నెలలుగా అమలు చేయడం లేదు. క్షేత్రస్థాయి పోలీసు సిబ్బంది  నేరుగానైనా.. అసోసియేషన్‌ ద్వారా సంప్రదించినా వారి సమస్యలను సత్వరమే పరిషరిస్తా. సిబ్బంది ఒత్తిడికి లోనుకాకుండా విధులు నిర్వహించుకోవాలి.– ఏవీ రంగనాథ్, నల్లగొండ ఎస్పీ

త్వరలో అమలు చేస్తాం
క్షేత్ర స్థాయి పోలీసు సిబ్బంది ఒత్తిడిలో మగ్గుతున్న విషయం వాస్తవమే. వరుస ఎన్నికల నేపథ్యంలో వీక్‌ ఆఫ్‌ అమలు చేయడం లేదు. త్వరలోనే వీక్‌ ఆఫ్‌ను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు అన్ని ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్‌ సిబ్బంది ఎంతగానో కృషిచేసింది. వారి సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నా. – రావిరాల వెంకటేశ్వర్లు, ఎస్పీ, సూర్యాపేట 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement