ప్రభుత్వం తరపున చెక్కును అందుకుంటున్న రాంరెడ్డి (ఫైల్) తెలంగాణ రాంరెడ్డి (ఫైల్)
మన్సూరాబాద్: శతాధిక వృద్ధుడు తెలంగాణ రాంరెడ్డి (101) (గుండా రాంరెడ్డి) మలక్‌పేట యశోద ఆసుపత్రిలో చికిత్స పొందూ మంగళవారం ఉదయం మృతి చెందారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా, హుజూర్‌నగర్ తాలుకా గుండ్లపల్లి గ్రామంలో 1919లో రాంరెడ్డి గుండా నర్సిరెడ్డి–అచ్చమ్మలకు మూడవ సంతానంగా జన్మించారు. బీఎస్సీ పూర్తి చేసిన అతను 1945లో కొడంగల్ తాలుకాలో కార్పొరేషన్ ఆఫీసర్‌గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరాడు. 1949లో హైదరాబాద్ కార్పొరేషన్ ఆఫీసర్‌గా 1951–54 వరకు డిస్ట్రిక్ కార్పొరేషన్ ఆఫీసర్‌గా, 1954 –56 వరకు మహబూబ్‌నగర్‌లో సెల్స్ ట్యాక్స్ ఆఫీసర్‌గా 1957–58 వరకు హైదరాబాద్ సీటీఓగా బాధ్యతలు నిర్వర్తించాడు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు నిరసనగా 1958లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి తన ఇంటి పేరును తెలంగాణ రాంరెడ్డిగా మార్చుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం.
వరంగల్‌లో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో మాజీ ప్రధాని పీపీ నర్సింహ్మారావు ఆయనకు సహాధ్యాయి. 1968 తెలంగాణ ఉద్యమ సమయంలో నల్లగొడ జిల్లాలో ఎమ్మెల్సీ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి విజయం సాధించారు. 1971లో అప్పటి ముఖ్యమంత్రి పీవీ కౌన్సిల్‌హాల్‌లో అతడిని కలిసిన సమయంలో ‘ఏమి రాంరెడ్డి నీకు ఇంకా తెలంగాణ పిచ్చి పోలేదా’ అని ప్రశ్నించడంతో..మీరు చూస్తారో లేదో కాని నేను తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తానని సమాధాన మిచ్చారు. 2013లో ప్రత్యేక తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో పాస్ కాగానే ఆయన మట్టపల్లి నర్సింహ్మస్వామిని దర్శించుకుని, తన 55 ఏళ్ల కల నిజమైందని ఆనందించారు. 2015లో తెలంగాణ ప్రభుత్వం రూ.10లక్షల చెక్కుతో రాంరెడ్డిని సన్మానించింది.
10న అంత్యక్రియలు
తెలంగాణ (గుండా) రాంరెడ్డి అస్వస్తతతో సోమవారం రాత్రి మలక్‌పేటలోని యశోద ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందారు. ఆయన నాగోలు డివిజన్ పరిధిలోని సాయిసప్తగిరికాలనీలో ఉ ంటున్న తన కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి వద్ద ఉంటున్నాడు. ఇటీవల అమెరికా వెళ్లిన శ్రీనివాస్‌రెడ్డి 9న నగరానికి వస్తుండటంతో అప్పటి వరకు మృతదేహాన్ని ఎల్‌బీనగర్‌లోకి కామినేని ఆసుపత్రిలో భద్రపరిచారు. 10న నాగోలులోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కు టుంబ సభ్యులు తెలిపారు. రాంరెడ్డి మృతి వార్త తెలియగానే కాలనీవాసులు మురళీకృష్ణ, వైఎల్‌ఎన్‌రెడ్డి, శంకర్, మహేందర్‌రెడ్డి, జగన్ యశోద ఆసుపత్రికి వెళ్లి రాంరెడ్డికి నివాళులర్పించారు.
రాంరెడ్డి మరణం తీరనిలోటు: గోనారెడ్డి
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు జి.రాంరెడ్డి మరణం తెలంగాణ ప్రజలకు తీరని లోటని జూనియర్ లెక్చరర్ల సంఘం మాజీ అధ్యక్షుడు గోనారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment