ఆర్టీసీ సమ్మె: బంద్‌ ప్రశాంతం | Telangana RTC Employees Strike Bandh Peacefully | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ సమ్మె: బంద్‌ ప్రశాంతం

Published Sun, Oct 20 2019 1:52 AM | Last Updated on Sun, Oct 20 2019 11:52 AM

Telangana RTC Employees Strike Bandh Peacefully - Sakshi

బంద్‌ సందర్భంగా ఖాళీగా కనపడుతున్న ఎంజీబీఎస్‌..

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మెలో భాగంగా కార్మిక సంఘాలు శనివారం నిర్వహించిన రాష్ట్ర బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. కొన్ని చోట్ల మాత్రం చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. బంద్‌కు ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతి వ్వడం, ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించి వీలైనంత వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవడంతో బస్టాండ్లు సహా రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం వరకు దుకాణాలు మూతపడ్డాయి. పెట్రోలు బంకులు కూడా ఉదయం వేళ తెరుచుకోలేదు. శనివారం రాత్రి వరకు కేవలం 516 బస్సులే (5.7%) రోడ్డెక్కాయి. ఇందులో మూడు అద్దె బస్సులు కాగా మిగతావి ఆర్టీసీ బస్సులు. కొన్ని చోట్ల ప్రైవేటు బస్సులు పోలీసు రక్షణ మధ్య రోడ్డెక్కాయి.

హన్మకొండ, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ, సిద్దిపేట, సూర్యాపేట, భూపాలపల్లి, మెదక్‌ తదితర ప్రధాన బస్టాండ్లు ఖాళీగానే కనిపించాయి. ఆటో కార్మిక సంఘాలు, క్యాబ్‌ డ్రైవర్ల సంఘాలు బంద్‌కు మద్దతిచ్చినప్పటికీ హైదరాబాద్‌లో ఆటోలు, క్యాబ్‌లు పాక్షికంగా తిరిగాయి. ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లలో మాత్రం ప్రయాణికుల రద్దీ నెలకొంది. సుమారు 3.5 లక్షల మంది మెట్రో రైళ్లలో రాకపోకలు సాగించగా మరో 1.7 లక్షల మంది ఎంఎంటీఎస్‌ సేవలను వినియోగించుకున్నారు. తప్పనిసరిగా ఇళ్ల నుంచి బయటకు వెళ్లిన ప్రయాణికుల నుంచి ప్రైవేటు వాహనదారులు ఇష్టారాజ్యంగా వసూలు చేశారు. తెలంగాణ బంద్‌ను దృష్టిలో ఉంచుకొని ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులను రద్దు చేసింది.

డ్యూటీలకు రాని తాత్కాలిక డ్రైవర్లు...
సమ్మె నేపథ్యంలో గత పక్షం రోజులుగా ఆర్టీసీ బస్సులను నడుపుతున్న వేలాది మంది తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు బంద్‌ నేపథ్యంలో శనివారం డ్యూటీలకు హాజరు కాలేదు. కనీసం ఐదు శాతం మంది కూడా డిపోలకు రాలేదు. కొన్ని ప్రాంతాల్లో వచ్చినా, డిపో గేట్ల వెలుపల ఆర్టీసీ కార్మికులు, విపక్షాల కార్యకర్తలు ఆందోళన చేపట్టడంతో వారికి బస్సులు ఇవ్వలేదు. ఉదయం 10 గంటల తర్వాత పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేయడం మొదలుపెట్టాక తాత్కాలిక డ్రైవర్లకు బస్సులు కేటాయించారు. చాలాచోట్ల వారు బస్సులు తీసుకొని రోడ్డెక్కగానే ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఆందోళనకారుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పోలీసులు వారిని నిలువరించలేకపోయారు. కొన్ని చోట్ల తాత్కాలిక డ్రైవర్లను కిందకు దింపేసి బస్సు టైర్లలో గాలి తీసి నడవకుండా అడ్డుకున్నారు. కొన్ని చోట్ల అద్దాలను కూడా ధ్వంసం చేశారు. హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బండ్లగూడ బస్‌ డిపో వద్ద బస్సును బయటకు తీసేందుకు ప్రయత్నించిన సైదిరెడ్డి అనే తాత్కాలిక డ్రైవర్‌పై ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారు. మరికొన్నిచోట్ల ఒక్కో బస్సు వెంట రెండు, మూడు పోలీసు వాహనాలను ఎస్కార్టుగా ఇవ్వడంతో అవి మాత్రం వెళ్లాయి.

ఎక్కడికక్కడ అరెస్టులు...
బస్టాండ్ల వద్ద ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు ఉదయం నుంచే ముందస్తు అరెస్టులు ప్రారంభించారు. హైదరాబాద్‌లోని జూబ్లీ బస్టాండ్‌ వద్ద నిరసన తెలిపేందుకు వచ్చిన టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, టీ టీడీపీ నేత ఎల్‌. రమణ, టీడీపీ మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే అబిడ్స్‌లో నిరసనల్లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచందర్‌రావు సహా ఆ పార్టీ నేతలను, చార్మినార్‌ వద్ద నిరసన ర్యాలీ చేపట్టిన కాంగ్రెస్‌ నేతలు మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, అంజన్‌కుమార్‌ యాదవ్‌ తదితరులను, హిమాయత్‌నగర్‌లోని పార్టీ కార్యాలయం వెలుపలికి రాగానే సీపీఐ నేతలు చాడ వెంకట్‌రెడ్డి, అజీజ్‌పాషాలను, బస్‌ భవన్‌ ముట్టడికి యత్నించిన సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, సీపీఐ నేత బాల మల్లేశ్, న్యూడెమొక్రసీ నేత పోటు రంగారావు తదితరులను ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వద్ద అరెస్టు చేశారు. ఈ సందర్భంలోనే పోటు రంగారావు చేయి బొటనవేలు పోలీసు వ్యాన్‌ తలుపులో నలిగి కొంతభాగం ఛిద్రమైంది. దీంతో ఆయన్ను తొలుత ఉస్మానియాకు, ఆ తర్వాత ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

గాయపడిన న్యూడెమోక్రసీ నేత పోటు రంగారావు , వామపక్ష నేత తమ్మినేని వీరభద్రం అరెస్ట్‌ దృశ్యం

డిపోలు, బస్టాండ్ల వద్ద నిరసనలు...
తెలంగాణ బంద్‌లో భాగంగా ఆర్టీసీ కార్మికులు అన్ని జిల్లాల పరిధిలో శనివారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, విద్యార్థి సంఘాల నాయకులు ఉదయం 4 గంటలకే డిపోల ఎదుట బైఠాయించారు. దీంతో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, సూర్యాపేట, కోదాడ, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ఉట్నూర్, నిర్మల్, భైంసా డిపోల పరిధిలో ఒక్క బస్సు కూడా బయటకు రాలేదు. పరకాల జనగామ, మహబూబాబాద్‌ డిపోల నుంచి తెల్లవారుజామున మొదటి సర్వీస్‌ను పోలీసు ఎస్కార్ట్‌ సాయంతో పంపినా ఆందోళనకారులు వాటిని అడ్డుకున్నారు. నిజామాబాద్‌ రీజియన్‌ పరిధిలో 43 బస్సులు పోలీసుల ఎస్కార్ట్‌ సాయంతో రోడ్డెక్కాయి. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో బీజేపీ, న్యూడెమోక్రసీ నాయకులు సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మలను దహనం చేశారు. నిజామాబాద్‌–2 డిపోకు చెందిన మూడు బస్సులపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి.

కరీంనగర్‌ టవర్‌ సర్కిల్‌లో దుకాణాల ముందు టైర్‌ కాల్చి నిరసన తెలుపుతున్న కాంగ్రెస్‌ నేతలు 

నిజామాబాద్‌ నుంచి వరంగల్‌ వెళుతున్న బస్సుపై కొందరు రాళ్లు రువ్వడంతో అద్దం పగిలి ఓ ప్రయాణికుడి తలకు గాయమైంది. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో దాదాపు 200 మంది బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ముల్కనూరులో ఆర్టీసీ కార్మికులు సెల్‌ టవర్‌ ఎక్కగా పోలీసులు వారికి నచ్చజెప్పడంతో కిందకు దిగారు. జనగామ జిల్లా బచ్చన్నపేటలో తాత్కాలిక డ్రైవర్, కండక్టర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. యాదగిరిగుట్టలో కార్మికులు వంటావార్పు చేపట్టారు. నల్లగొండలో మహిళా కార్మికులపట్ల కొందరు మహిళా కానిస్టేబుళ్లు దురుసుగా ప్రవర్తించారని కార్మికులు ఆందోళనకు దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. మెదక్‌ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి బైపాస్‌ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై సికింద్రాబాద్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఆందోళనకారులు అడ్డుకొని టైర్లలో గాలి తీసేశారు. దీంతో పోలీసులు ప్రయాణికులను ప్రైవేటు వాహనాల్లో పంపించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ డిపో పరిధిలో 24 బస్సులు తిరిగాయి. 

బంద్‌కు సంఘీభావంగా తెలంగాణ భవన్‌ ముట్టడి
ఆర్టీసీ కార్మికుల తెలంగాణ బంద్‌కు సంఘీభావంగా సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ను ముట్టడించారు. అయితే పోలీసులు ముందుగానే అక్కడికి చేరుకుని నిరసనకారులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సమ్మెకు దిగిన కార్మికులపై అణచివేత ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసి తన కుటుంబ సభ్యులు, మిత్రులకు కట్టబెట్టేందుకు కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్‌ కౌర్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ మొండి వైఖరిని వీడి కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలన్నారు. అనంతరం నేతలు తెలంగాణ భవన్‌ ఏఆర్సీ వేదాంతం గిరిని కలసి వినతిపత్రం సమర్పించారు.  

‘క్యాబ్‌ డ్రైవర్లూ.. సమ్మె విరమించండి’ 
ఆర్టీసీ కార్మికుల సమ్మెను దృష్టిలో పెట్టుకుని ఓలా, ఉబర్‌ తదితర క్యాబ్‌ డ్రైవర్లు సమ్మెను విరమించాలని గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ పిలుపునిచ్చారు. తమ సమస్యలను పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ తెలంగాణ స్టేట్‌ టాక్సీ డ్రైవర్స్‌ జాక్‌ శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది. ఉబర్‌ కొత్తగా ‘ఛిౌఝఝu్ట్ఛ’ పేరుతో ప్రారంభించిన సేవలను హైదరాబాద్‌లో అనుమతించరాదని, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం క్యాబ్‌ ఆపరేటర్లు, యాప్‌ ఆధారిత క్యాబ్‌ ఆపరేటర్ల నియంత్రణకు మార్గదర్శకాలు తేవాల్సి ఉందని జాక్‌.. తమిళిసైకి తెలియజేసింది. టాక్సీ డ్రైవర్ల విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తానని, ప్రజలకు మరింత అసౌకర్యం కలగకుండా వెంటనే సమ్మె విరమించాలని డ్రైవర్లకు గవర్నర్‌ సూచించారు.  

బంద్‌తో ఆసుపత్రుల్లో తగ్గిన ఔట్‌ పేషెంట్లు 
ఆర్టీసీ సమ్మెలో భాగంగా తలపెట్టిన రాష్ట్ర బంద్‌ ప్రభావం ఆసుపత్రులపై పడింది. రవాణా వ్యవస్థ స్తంభించడంతో ఆసుపత్రులకు వచ్చే ఔట్‌ పేషెంట్ల సంఖ్య సగానికి సగం తగ్గింది. వివిధ జిల్లాల నుంచి బస్సులు తిరగకపోవడంతో హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య దాదాపు 50 నుంచి 70 శాతం తగ్గినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అంచనా వేశాయి. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి రోజువారీ 2 వేల వరకు ఓపీ నమోదు కాగా శనివారం మాత్రం దాదాపు 900 మాత్రమే ఉందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. గాంధీ ఆసుపత్రికి రోజువారీ 2,500 వరకు ఓపీ ఉండాల్సి ఉంటే, అందులో 60 శాతం మేర రోగులు తగ్గినట్లు సమాచారం. అత్యవసర రోగులు మాత్రమే ఏదో ఓ ఏర్పాటు చేసుకొని ఆసుపత్రులకు వచ్చారు. జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో దాదాపు 70 శాతం మేర ఔట్‌ పేషెంట్లు తగ్గినట్లు అధికారులు అంచనా వేశారు. కొన్ని జిల్లాల్లో ఆసుపత్రుల్లోని సిబ్బంది కూడా సమ్మెకు మద్దతు ప్రకటించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపడంతో వైద్య సేవలు స్తంభించాయి.  

ఆర్టీసీ సమ్మెపై 25న ఎన్‌సీబీసీలో విచారణ 
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై జాతీయ బీసీ కమిషన్‌ (ఎన్‌సీబీసీ) స్పందించింది. ఈ నెల 25న జాతీయ బీసీ కమిషన్‌ ముందు పూర్తి నివేదికతో హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యానికి స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరు వర్గాలకు నోటీసులు జారీ చేసింది. సమ్మె చేస్తున్న వారు సెల్ఫ్‌ డిస్మిస్‌ అయినట్లు ప్రభుత్వం పేర్కొనడంతో దాదాపు 20వేల బీసీ కుటుంబాలు వీధిన పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తూ పలువురు ఎన్‌సీబీసీని ఆశ్రయించారు. కమిషన్‌ సభ్యుడు ఆచారి తల్లోజు ఈ ఫిర్యాదును పరిశీలించి విచారణకు స్వీక రించారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, కేసుకు సంబంధించిన ఫైళ్లు, డైరీలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.    

దిష్టిబొమ్మల దహనానికి వామపక్షాల పిలుపు
ఆర్టీసీ సమ్మె విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం చేయాలని వామపక్షాలు పిలుపునిచ్చాయి. శాంతియుతంగా బంద్‌ నిర్వహిస్తున్న ప్రజలను అరెస్టు చేయడంతో పాటు అక్రమ కేసులు బనాయిస్తూ తీవ్ర నిర్బంధానికి గురి చేయడాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. శనివారం హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వామపక్ష పార్టీల భేటీ జరిగింది. సమావేశంలో తమ్మినేని వీరభద్రం, వెంకట్‌ (సీపీఎం), చాడ వెంకట్‌రెడ్డి, బాలమల్లేశ్‌ (సీపీఐ), రమ, సూర్యం (న్యూ డెమోక్రసీ), సాధినేని వెంకటేశ్వర్లు, గోవర్ధన్‌ (న్యూ డెమోక్రసీ), సుధాకర్‌ (ఎంసీపీఐ) తదతరులు పాల్గొన్నారు. మొండి వైఖరిని విడనాడి ఆర్టీసీ కార్మికులతో ముఖ్యమంత్రి చర్చలు జరపాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండ్‌ చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement