తెలంగాణ వెలుగురేఖ
గోదావరిఖని: రామగుండం ఎన్టీపీసీ మరిన్ని వెలుగులు విరజిమ్మనుంది. త్వరలోనే ప్లాంట్ విస్తరణ జరగనుంది. ప్రస్తుతం ఇక్కడ ఏడు యూని ట్ల ద్వారా 2,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. విస్తరణలో భాగంగా 800 మెగావాట్ల సామర్థ్యం గల ఐదు యూనిట్లు నెలకొల్పి మరో 4,000 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.
దశలవారీగా విస్తరణ పూర్తయితే ఎన్టీపీసీ సామర్థ్యం 6,600 మెగావాట్లకు చేరుకుంటుంది. ఎన్టీపీసీ ప్లాంట్ విస్తరణ విషయమై మంగళవారం ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ అరూప్‌రాయ్ చౌదరితోపాటు ఉన్నతాధికారులు ఎన్‌ఎన్.మిశ్రా, ఏకే.ఝా, ఆర్.వెంకటేశ్వరన్ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో కలి శారు. తెలంగాణలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి పెట్టిన కేసీఆర్ పిలుపు మేరకు వారు ఆయనతో సమావేశమయ్యారు.
ఇప్పటికే ఎన్టీపీసీ ప్లాంట్ విస్తరణకు ప్రణాళికలు ఉండటంతో కొత్త యూనిట్ల ఏర్పాటుపై సుముఖత వ్యక్తం చేశారు. రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్‌కు సమీపంలోనే కొత్త యూనిట్లు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సీఎండీ అరూప్‌రాయ్ చౌదరి సీఎం కేసీఆర్‌కు తెలిపారు. ఈ యూనిట్లకు అవసరమైన భూమిని ప్రభుత్వమే ఇస్తుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఒకవేళ స్థల సేకరణలో ఇబ్బందులుంటే సిం గరేణి సంస్థ నుంచి భూమిని సేకరించి ఇస్తామన్నారు. పర్యావరణ అనుమతులు వచ్చేందుకు కూడా సహకరిస్తామన్నారు.
దీంతోపాటు ఈ ప్లాంట్ నుంచి వెలువడే బూడిదను సింగరేణి సంస్థ తవ్వుతున్న భూగర్భ గనులలో ఇసుకకు బదులు ఉపయోగిస్తామని సీఎం వారికి తెలిపారు. మూడు సంవత్సరాల మూడు నెల ల్లో (39 నెలలు) మొదటి 800 మెగావాట్ల యూనిట్ ను నెలకొల్పి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని ఎన్టీపీసీ సీఎండీ కేసీఆర్‌కు స్పష్టం చేశారు.
రామగుండం బీ-థర్మల్ కేంద్రాన్ని మూసివేసి దాని స్థానంలో 660 మెగావాట్ల ప్లాంట్, బీపీఎల్ ప్లాంట్ స్థానంలో మరో రెండు యూనిట్లను తెలంగాణ జెన్‌కో ఏర్పాటు చేసే అవకాశం ఉండటంతో రామగుండం ప్రాంతం విద్యు త్ హబ్‌గా మారనుంది. దీంతో ఈ ప్రాంతంలో వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు అందుబాటులో రానున్నాయి. ఎన్టీపీసీ విస్తరణకు మార్గం సుగమం కావడంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.