తెలంగాణ బంద్ సంపూర్ణం | Telangana shutdown hits normal life | Sakshi
Sakshi News home page

తెలంగాణ బంద్ సంపూర్ణం

Published Fri, May 30 2014 5:24 AM | Last Updated on Sat, Sep 2 2017 8:02 AM

Telangana shutdown hits normal life

* స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రజలు, సంస్థలు
* మూతపడిన బ్యాంకులు, పెట్రోల్ బంకులు, వాణిజ్య సముదాయాలు.. డిపోలు దాటని బస్సులు
* అన్ని జిల్లాల్లోనూ భారీగా నిరసనలు, ధర్నాలు
* పోలవరం ముంపు మండలాలపై కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు
* మోడీ, బాబు, వెంకయ్య దిష్టిబొమ్మల దహనం
* ఆందోళనల్లో పాల్గొన్న టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, టీజేఏసీ శ్రేణులు
* బంద్ ప్రశాంతం: డీజీపీ
 
సాక్షి నెట్‌వర్క్: తెలంగాణ బంద్ విజయవంతమైంది. పోలవరం ముంపు ప్రాంతాన్ని సీమాంధ్రలో కలపడాన్ని నిరసిస్తూ టీఆర్‌ఎస్ గురువారం ఇచ్చిన బంద్ పిలుపునకు అన్ని వర్గాలు భారీగా స్పందించాయి. కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తెలంగాణ అంతటా ఆందోళనలు జరిగాయి. టీఆర్‌ఎస్‌తో పాటు సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీల శ్రేణులు బంద్‌లో భాగస్వాములయ్యాయి. జేఏసీ కూడా మద్దతు తెలపడంతో బంద్ సంపూర్ణమైంది. అన్ని జిల్లాల్లోనూ బ్యాంకులు, పెట్రోల్ బంకులు, వాణిజ్య, వ్యాపార సంస్థలు పనిచేయలేదు. ఆర్టీసీ బస్సులు సాయంత్రం వరకు డిపోల నుంచి బయటకు రాలేదు. ఆందోళనకారులు ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు దిష్టిబొమ్మలను ద హనం చేశారు.
 
ఖమ్మం జిల్లాలో భారీగా నిరసనలు
ఖమ్మంలో ప్రభుత్వ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ముంపు మండలాలైన చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, భద్రాచలం, కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడులో ఆదివాసీలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్‌లో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఆయనతోపాటు మరో 15 మంది దీక్షలో కూర్చున్నారు. వీరికి అశ్వారావుపేట వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ఆ పార్టీ నేత డాక్టర్ తెల్లం వెంకట్రావు సంఘీభావం ప్రకటించారు.

వీఆర్‌పురంలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ముత్యాల రామారావు, కాంగ్రెస్ నాయకుడు కడుపు రమేష్, ఎంపీటీసీ గూటాల శ్రీనివాస్‌లు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఇక ఖమ్మంలో టీఆర్‌ఎస్, సీపీఎం, ఎల్‌హెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో ధర్నాచౌక్ వద్ద వేర్వేరుగా ఆందోళనలు జరిగాయి. 

కొత్తగూడెంలో సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. కేటీపీఎస్ ముందు విద్యుత్ ఉద్యోగులు ధర్నా చేశారు. టేకులపల్లి మండలంలో బొగ్గు లారీలను బోడు రోడ్డు సెంటర్‌లో ఆందోళనకారులు నిలిపివేశారు. వీరికి మద్దతుగా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య కూడా ఆందోళనలో పాల్గొన్నారు. వేలేరుపాడు, అశ్వారావుపేటలలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు నిరసనలు తెలిపారు.
 
ఇతర జిల్లాల్లోనూ..
ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్‌ఎస్, బీఎస్పీ నాయకులు వేర్వేరుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా చేశారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో పరీక్షలు వాయిదా పడ్డాయి. నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఎదుట నిర్వహించిన ధర్నాలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బిగాల గణేశ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్ నాయకులు బైకు ర్యాలీ తీశారు.

న్యూడెమోక్రసీ, సీపీఐ, సీపీఎం, పీడీఎస్‌యూ నాయకులు రాస్తారోకోలో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో అన్నివర్గాల వారు స్వచ్చందంగా బంద్ పాటించారు. బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. నల్లగొండ జిల్లాలో జాతీయు రహదారిపై పలుచోట్ల టీఆర్‌ఎస్ శ్రేణులు రాస్తారోకో చేపట్టాయి.

రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన నల్లబండగూడెం వద్ద రోడ్డును దిగ్బంధించి ఆంధ్రా నుంచి వచ్చే వాహనాలను అడ్డుకున్నారు. ప్రధాని మోడీ, చంద్రబాబు, వెంకయ్యల దిష్టిబొమ్మలను పలుచోట్ల దహనం చేశారు. సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ తదితర పార్టీలు వేర్వేరుగా ర్యాలీల్లో పాల్గొన్నాయి. వుహబూబ్‌నగర్ జిల్లాలో పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు ర్యాలీలు, ధర్నాలు చేపట్టాయి. టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మెదక్ జిల్లాలోనూ ఆందోళనలు కొనసాగాయి.
 
రాజధానిలో ప్రశాంతం
హైదరాబాద్‌లో బంద్ ప్రశాంతంగా ముగిసింది. బ్యాంకులు, వాణిజ్య సముదాయాలు, సినిమా హాళ్లు, పెట్రోల్ బంకులు, విద్యా సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. కొన్ని చోట్ల టీఆర్‌ఎస్ శ్రే ణులు బలవంతంగా మూయించారు. నగరం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు ఎంజీబీఎస్, జూబ్లీ బస్‌స్టేషన్‌లకే పరిమితం కావడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకున్నారు. టీఆర్‌ఎస్ శ్రేణుల బైక్ ర్యాలీలు, ముఖ్య కూడళ్ల వద్ద బైఠాయింపులు, మిన్నంటిన తెలంగాణ నినాదాలతో నగరం మార్మోగింది.

నిత్యం వాహనాల రద్దీతో కిటకిటలాడే ప్రధాన రహదారులు బోసిపోయి కనిపించాయి. పలు చోట్ల ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని అనంతరం విడుదల చేశారు. బంద్‌ను విజయవంతం చేసేందుకు టీఆర్‌ఎస్ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు సర్వశక్తులూ ఒడ్డారు. రంగారెడ్డిలోనూ బంద్ సంపూర్ణంగా జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. తాండూరులో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పి.మహేందర్‌రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు.

శంషాబాద్ వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై ఎమ్మెల్సీ స్వామిగౌడ్, మేడ్చల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. కలెక్టరేట్‌లో టీఎన్జీఓ  జిల్లా కార్యదర్శి రామ్మోహన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కాగా, జంట నగరాల పరిధిలోని అన్ని కోర్టుల్లో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. ఉదయం 10 గంటలకే కోర్టుల ముందు బైఠాయించి నిరసన తెలిపారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా జరిగిందని డీజీపీ ప్రసాదరావు తెలిపారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. భద్రతా చర్యల్లో ఏపీఎస్పీ, సీఆర్‌పీఎఫ్ బలగాలను కూడా వినియోగించామని చెప్పారు.
 
రాజీలేని పోరాటం చేస్తాం: టీఆర్‌ఎస్
పోలవరం ముంపు పేరిట ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ కేంద్రం జారీ చేసిన  ఆర్డినెన్సును వ్యతిరేకిస్తున్నామని టీఆర్‌ఎస్ ఎమ్యెల్యే హరీష్ రావు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు ఇద్దరు కలిసి తెలంగాణ ప్రజల గొంతుకోసి మోసం చేశారన్నారు. ఆర్డినెన్స్‌తో రెండు లక్షల మంది గిరిజనుల బతుకులు ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి గోస ఊరికే పోదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గిరిజనులకు అది మరణశాసనం వంటిదని, దీనికి నిరసనగానే వారు ఎన్నికలను కూడా బహిష్కరించారని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబు తెలంగాణలోనే ఉంటూ గోతులు తీస్తున్నారని, ఇది అమానుషమని దుయ్యబట్టారు. ఈ ఏడు మండలాల్లో ఉన్న ఖనిజ, అటవీ సంపద, చింతూర్ లోయలోని 460 మెగావాట్ల సీలేర్ విద్యుత్ ప్రాజెక్ట్‌ని సీమాంధ్రలో కలపడం వల్ల ఏడాదికి రూ. వెయ్యి కోట్ల నష్ట జరుగుతుందన్నారు.

ఇంత జరుగుతున్నా తెలంగాణ టీడీపీ నేతలు చీమూనెత్తురు లేకుండా మౌనంగా ఉంటున్నారని విమర్శించారు. పక్క రాష్ట్రానికి చెందిన చంద్రబాబు తెలంగాణ ప్రజల గొంతు కోస్తున్నా టీ-టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు బాబును ఎలా క్షమిస్తారని ప్రశ్నించారు. దీనిపై రాజీలేని పోరాటం చేస్తామని హరీష్‌రావు చెప్పారు. ఇక కేంద్రం చర్య అప్రజాస్వామికమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఎంజీబీఎస్‌లో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోకుంటే టీఆర్‌ఎస్ నేతృత్వంలో  పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
 
ఆర్డినెన్స్ తేవడం రాజకీయ కుట్ర: న్యూడెమోక్రసీ
పోలవరం ముంపు ప్రాంతాలపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను పెద్ద రాజకీయ కుట్రగా సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ అభివర్ణించింది. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత డిజైన్ ఎంత మాత్రం అంగీకారం కాదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదె దివాకర్ పేర్కొన్నారు. మరోవైపు పోలవరం ముంపు ప్రాంతాలపై ఆర్డినెన్స్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని గిరిజన ఐక్య వేదిక డిమాండ్ చేసింది. కేంద్రం చర్యకు నిరసనగా నగరంలోని ట్యాంక్‌బండ్‌పైనున్న కొమరం భీం విగ్రహం వద్ద గురువారం పలు సంఘాల గిరిజన నేతలు నిరసన తెలి పారు. ఆర్డినెన్స్‌పై న్యాయ పోరాటంతో పాటు, ఉద్యమాలు చేస్తామని వేదిక అధ్యక్షుడు వివేక్ వినాయక్ తెలిపారు.
 
టీ-కాంగ్రెస్ నేతల ఆగ్రహం
పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్సును తెలంగాణ కాంగ్రెస్ నేతలు తప్పుబట్టారు. ఇరు రాష్ట్రాలతో చర్చించకుండా హడావుడిగా ఆర్డినెన్స్ జారీ చేయడం సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధమని వ్యాఖ్యానించారు. ఇలాంటి తొందరపాటు నిర్ణయం వల్ల ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చురేగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివెనుక పెద్ద కుట్ర దాగి ఉందనే అనుమానం కూడా వ్యక్తం చేశారు.

ఇందిరాసాగర్ ఎత్తిపోతల ప్రాజెక్టు, 400 మెగావాట్ల హైడల్ ప్రాజెక్టు ముంపు మండలాల్లోనే ఉన్నాయని, వాటిని కూడా ఆంధ్రప్రదేశ్‌కు తరలించే కుట్రతోనే ఆర్డినెన్స్‌ను తెచ్చారని అభిప్రాయపడ్డారు. మాజీ మంత్రులు జానారెడ్డి, జీవన్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి గురువారం వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై మండిపడ్డారు. ఈ ఆర్డినెన్స్ న్యాయ సమీక్షకు నిలబడదని, రాష్ర్ట అసెంబ్లీ అభిప్రాయం కోరకుండా సరిహద్దులు మార్చే అధికారం కేంద్రానికి లేద ని జీవన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశమైన వెంటనే ఈ ఆర్డినెన్సును వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement