శంషాబాద్ : వైద్య రంగానికి రాష్ట్ర సర్కారు పెద్ద పీట వేస్తోందని ఐటీ, పరిశ్రమల మంత్రి కె. తారకరామారావు అన్నారు. కేన్సర్ వ్యాధి నియంత్రణపై టాటా ట్రస్టుతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. గురువారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని నోవాటెల్ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసమే ప్రభుత్వం మిషన్ భగీరథ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఇంటికీ సురక్షిత నీరు అందించేందుకు కృషి చేస్తోందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు రాష్ట్ర వైద్యశాఖ కూడా వైద్యరంగంలో విప్లవాత్మక మైన మార్పులు తీసుకొస్తోందన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో గుండె, కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయన్నారు. కేసీఆర్ కిట్ల పంపిణీతో ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య 31 శాతం నుంచి 50 శాతానికి పెరిగిందన్నారు.
త్వరలో ఉచిత పరీక్షల నిర్వహణ
రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ఉచిత పరీక్షల నిర్వహణకు కూడా ప్రభుత్వం యోచిస్తోందన్నారు. తెలంగాణ ప్రజల సమగ్ర ఆరోగ్య సమాచారాన్ని ఆధార్‌తో అనుసంధానం చేసేలా చర్యలు తీసుకునేందుకు అడుగులు వేస్తున్నామన్నారు. కేన్సర్ నియంత్రణకు ప్రభుత్వానికి టాటా ట్రస్టు చేయూతనందిం చడం అభినందనీయమన్నారు. హైదరా బాద్‌లో అత్యధిక ఉపాధి అవకాశాలు టాటా సంస్థ ద్వారా లభిస్తున్నాయన్నారు.
కేన్సర్ వ్యాధి నియంత్రణకు ముందస్తు నివారణ చర్యలు కీలకమని టాటా సంస్థల అధినేత, మాజీ చైర్మన్ రతన్ టాటా అన్నారు. ప్రభుత్వానికి చేయూతనందిస్తామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు వికేంద్రీకరణ ద్వారా వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని వైద్య మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
కేసీఆర్ కిట్ల పరిశీలన..
ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవం జరిగిన మహిళలకు అందిస్తున్న కేసీఆర్ కిట్లను మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి రతన్ టాటాకు చూపించారు. అందులో ఉన్న వస్తువుల గురించి ఆయనకు వివరించారు. కిట్లలోని ఒక్కో వస్తువును రతన్ టాటా పరిశీలించి చూశారు. కార్యక్రమంలో వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో పాటు టాటా ట్రస్టు ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment