
ఫిబ్రవరి మూడో వారంలో రాష్ట్ర బడ్జెట్
సాక్షి, హైదరాబాద్:
కేంద్రం తరహాలో రాష్ట్ర బడ్జెట్‌ను ఫిబ్రవరిలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు బడ్జెట్ తయారీ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. గతేడాది మార్చి 14న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఏటా ఫిబ్రవరి నెలాఖరున ప్రవేశపెట్టే బడ్జెట్‌ను ఫిబ్రవరి ఒకటో తేదీనే ప్రవేశపెట్టేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే పంథాను అనుసరించి బడ్జెట్ రూపకల్పన చేయాలని ఆర్థిక శాఖకు సీఎం దిశా నిర్దేశం చేశారు.
కేంద్ర బడ్జెట్ ఆధారంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా నిధులు, కేంద్ర ప్రాయోజిత పథకాల కేటాయింపులపై స్పష్టత వస్తుంది. అందుకే ఫిబ్రవరి మూడో వారంలో బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు సన్నద్ధంగా ఉండాలని ఆర్థిక శాఖను అప్రమత్తం చేసినట్లు సమాచారం. అన్ని శాఖల ప్రతిపాదనలు సిద్ధంగా ఉంటే బడ్జెట్ తయారీ ప్రక్రియకు కనీసం 15 రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. 2017–18 బడ్జెట్‌కు సంబంధించి అన్ని శాఖల ప్రతిపాదనలు రెండు రోజుల కిందటే ఆర్థిక శాఖకు చేరాయి. ఈసారి ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులు విలీనమవటంతో నిర్వహణ పద్దులు, ప్రగతి పద్దులుగా అన్ని శాఖలు ప్రతిపాదనలు తయారు చేశాయి. ఆదాయ వ్యయాల అంచనాలు, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు కేటాయింపులు, వచ్చే ఆర్థిక సంవత్సరపు ప్రాధాన్యాలకు అనుగుణంగా బడ్జెట్ కసరత్తు మొదలైంది.
రూ.15 వేల కోట్ల మేరకు సవరణ..
2016–17 బడ్జెట్ అంచనాలు, వాస్తవంగా వచ్చిన ఆదాయ వ్యయాల ఆధారంగా సవరణ బడ్జెట్‌ను సైతం ఆర్థిక శాఖ తయారు చేయనుంది. కొత్త బడ్జెట్‌తో పాటు సవరణ బడ్జెట్ గణాంకాలను పొందుపరచనుంది. గతేడాది రూ.1.30 లక్షల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. నోట్ల రద్దు పరిణామాలు, భూముల అమ్మకంతో ఆశించిన ఆదాయం రాకపోవటంతో దాదాపు రూ.15 వేల కోట్ల మేర అంచనాలు తలకిందులైనట్లు ప్రభుత్వం విశ్లేషించింది. ఈ నేపథ్యంలో రూ.1.15 లక్షల కోట్లతో సవరణ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.