
‘పని కంటే ప్రగల్భాలకే ప్రాధాన్యమిస్తున్నారు’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలుకుని కిందిస్థాయి నాయకుల వరకూ... చేసే పని కంటే ప్రగల్భాలు, ప్రచారానికే అధిక ప్రాధాన్యతనిస్తున్నారని తెలంగాణ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి విమర్శించారు. లంచం అడిగిన వారిని చెప్పులో కొట్టమని మంత్రి కేటీఆర్ చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ఆయన బుధవారమిక్కడ అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ వారే అనుసంధానంగా వ్యవహరిస్తున్నట్లు, ఉద్యోగాల కోసం సీఎంఓలోని వ్యక్తులకు రూ.40 లక్షలు ఇచ్చినట్లు సతీష్‌రెడ్డి అనే వ్యక్తి చెప్పడం, ఈ అవినీతికి సంబంధించి పత్రికల్లో వార్తలొచ్చాయని గుర్తుచేశారు.
ఏ చిన్నపని కావాలన్నా డబ్బులు లేనిదే కావడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారని, గొంగట్లో తింటూ వెంట్రుకలు ఉన్నాయన్నట్లుగా టీఆర్‌ఎస్ నాయకుల మాటలున్నాయన్నారు. మిషన్‌కాకతీయలో అవినీతి జరగకపోతే ఎందుకు అంతమంది అధికారులు సస్పెండ్ అయ్యారో చెప్పాలన్నారు.సబ్ కాంట్రాక్ట్‌లు ఎవరి చేతుల్లో ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. మిషన్ కాకతీయలో మట్టి అమ్ముకోవడంపై, ఇసుక దోపిడిపై విచారణ జరిపించగలరా అని ప్రశ్నించారు.