
'కేసీఆర్ భూమి మీదకు వస్తారు'
హైదరాబాద్: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న టీఆర్ఎస్ పార్టీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు తెలిపారు. మంగళవారం ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, ఈసీ ప్రధాన కమిషనర్ ను కలవనున్నామని చెప్పారు. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు సోమవారమిక్కడ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ఫిరాయింపులపై స్పీకర్, మండలి చైర్మన్, గవర్నర్ లకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యమని వాపోయారు. హైకోర్టు నోటీసులు ఇచ్చినా లాభం లేకపోయిందని వాపోయారు. తలసాని సహా పార్టీ మారిన వారి విషయాన్ని రాష్ట్రపతికి వివరిస్తామన్నారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను ఓడిస్తే గాల్లో విహరిస్తున్న కేసీఆర్ భూమి మీదకు వస్తారని అన్నారు. చంద్రబాబును శిఖండి అనడం కేటీఆర్ స్థాయికి తగదన్నారు.
ఫిరాయింపుల చర్యల విషయంలోస్పీకర్, ఛైర్మన్, గవర్నర్ లపై రాష్ట్రపతి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ అంశంపై హైకోర్టు నోటీసులు ఇచ్చినా కూడా లాభం లేకుండా పోయిందన్నారు. 43 శాతం ఫిట్ మెంట్ అని ప్రకటించిన ప్రభుత్వం.. తొమ్మిది నెలల బకాయిల విషయంలో ఉద్యోగులకు అన్యాయం చేయడానికి కుట్ర చేస్తోందన్నారు. రూ.1100 కోట్ల బకాయిలను బాండ్ల ద్వారా 5 ఏళ్లలో చేస్తామంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.