అతిరథుల సమక్షంలో పారిశ్రామిక విధానం | Telangana to announce new industrial policy on June 7 | Sakshi
Sakshi News home page

అతిరథుల సమక్షంలో పారిశ్రామిక విధానం

Published Tue, Jun 2 2015 3:32 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

అతిరథుల సమక్షంలో పారిశ్రామిక విధానం - Sakshi

అతిరథుల సమక్షంలో పారిశ్రామిక విధానం

2 వేల మంది ప్రముఖులను ఆహ్వానించనున్న రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న నూతన పారిశ్రామిక విధానం కోసం మార్గదర్శకాల విడుదలకు ఈ నెల 12న ముహూర్తం ఖరారు కావడంతో ఆహ్వానితుల జాబితాను రూపొందించడంపై టీఆర్‌ఎస్ సర్కారు దృష్టి సారించింది. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు, బహుళజాతి కంపెనీల ప్రతినిధుల సమక్షంలో నూతన విధానాన్ని ప్రకటించాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్...

ఇందుకోసం 2 వేల మంది పారిశ్రామికరంగ ప్రముఖులను మార్గదర్శకాల విడుదల కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశంలోని పారిశ్రామిక దిగ్గజాలు, ప్రముఖులు వంద మందికి కేసీఆర్ స్వయంగా ఆహ్వాన పత్రాలు పంపనున్నారు. హెచ్‌ఐసీసీలో జరిగే ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న పరిశ్రమలశాఖ...వంద మంది ప్రముఖుల జాబితా తయారీ ప్రక్రియను కేసీఆర్ సూచనలకు అనుగుణంగా చేపడుతోంది.

అలాగే మిగతా ఆహ్వానితులకు సంబంధించిన జాబితాపై కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలతోపాటు, వివిధ అసోసియేషన్లకు ఆహ్వానాలు పంపుతున్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం (డీఐసీ) ద్వారా ఆయా జిల్లాల్లోని పరిశ్రమల యాజమాన్యాలకు కూడా ఆహ్వానాలు పంపుతున్నారు. ఆహ్వాన పత్రాల పంపిణీ, కార్యక్రమానికి వచ్చే వారిని సమన్వయం చేసేందుకు పరిశ్రమలశాఖ సమన్వయ కమిటీ ఏర్పాటు చేయనుంది.
 
ఇప్పటికే మిస్త్రీకి ఆహ్వానం: నూతన పారిశ్రామిక విధానం మార్గదర్శకాల విడుదల కార్యక్రమానికి టాటా సన్స్ చైర్మన్ సైరస్ మిస్త్రీని ప్రభుత్వం ఆహ్వానించింది. రాష్ట్ర మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు మే 27న ముంబై వెళ్లి మిస్త్రీని ప్రత్యేకంగా ఆహ్వానించారు. మరికొంత మంది ప్రముఖులకు సీఎం స్వయంగా ఫోన్ చేయడంగానీ, మంత్రులతో ఆహ్వానం పంపడంగానీ జరుగుతుందని పరిశ్రమలశాఖ అధికారులు వెల్లడించారు. మార్గదర్శకాల విడుదల కార్యక్రమాన్ని ఈ నెల 7న నిర్వహించాలని ప్రభుత్వం భావించినా హెచ్‌ఐసీసీలో ఇతర కార్యక్రమాలు ఉండటం, ఆహ్వానితుల జాబితా సకాలంలో సిద్ధం కాదనే భావనతో ఈ నెల 12కు వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement