అవినీతికి తావివ్వం: కేసీఆర్
-
ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం తెస్తాం
-
పారిశ్రామిక వేత్తలను వేధించే అధికారులు, నేతలపై కఠిన చర్యలు..
-
ఇబ్బందులకు గురిచేస్తే సహించబోనని సీఎం హెచ్చరిక
-
జిల్లాలో 2 పరిశ్రమలు ప్రారంభం, మరో దానికి శంకుస్థాపన
సాక్షి, మహబూబ్‌నగర్: రాష్ర్టంలో అవినీతికి తావులేని, పూర్తి పారదర్శకతతో కూడిన ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని తీసుకొస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. సింగిల్ విండో పద్ధతిలో 15 రోజుల్లోనే పరిశ్రమలకు అన్ని అనుమతులు ఇస్తామని పేర్కొన్నారు. గురువారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం వేముల, కొత్తూరు మండలం పెంజర్ల గ్రామాల పరిధిలో పలు పరిశ్రమల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలను ప్రస్తావిస్తూ కేసీఆర్ మాట్లాడారు. నూతన పారిశ్రామిక విధానంపై సంప్రదింపుల ప్రక్రియను పూర్తి చేసి ముసాయిదాను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ‘కొత్త పారిశ్రామిక విధానం ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా ఉంటుందని గర్వంగా ప్రకటిస్తున్నా. సీఎం కార్యాలయంలో చేజింగ్ సెల్ ఏర్పాటు చేసి.. పారిశ్రామిక వేత్తలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అనుమతులు ఇస్తాం. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో అన్ని రకాల అనుమతులతో కూడిన పత్రాలను కవర్‌లో పెట్టి అందజేస్తాం’ అని కేసీఆర్ తెలిపారు.
‘రాష్ట్రవ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా ‘హరితహారం’ కార్యక్రమానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. రాబోయే మూడేళ్లలో ప్రతి గ్రామంలో 1.20 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. తద్వారా గ్లోబల్ వార్మింగ్, కాలుష్య సమస్యల పరిష్కారానికి, వాతావరణ సమతుల్యత కోసం అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ‘రాష్ట్రాభివృద్ధి కేసీఆర్ ఒక్కడితోనే సాధ్యం కాదు. సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు మొదలుకుని అన్నిస్థాయిల్లో ప్రజాప్రతినిధులు ఎక్కడి వారక్కడ పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం. స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన అధికారాలను అప్పగిస్తాం.
అయితే అధికారంతో పాటు బాధ్యత కూడా ఉంటుందని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గుర్తుంచుకోవాలి’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఇప్పటికే ‘మన ఊరు-మన ప్రణాళిక’ల ద్వారా ప్రతిపాదనలు స్వీకరించామని, రాష్ట్ర స్థాయిలో ‘మన రాష్ట్రం - మన ప్రణాళిక’ సిద్ధం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. మహబూబ్‌నగర్ లాంటి జిల్లా కేంద్రంలో కూడా వారం, పది రోజులకోసారి కూడా తాగునీరు సరఫరా కావడం లేదని, ఇలాంటి తాగునీటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని వాటర్ గ్రిడ్‌కు రూపకల్పన చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే రూ. 4 వేల కోట్లతో మురుగునీటి కాలువలు, సిమెంటు రోడ్ల నిర్మాణాన్ని దశలవారీగా పూర్తి చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.
రూ. 20 వేల కోట్లతో పునరుద్ధరణ
రాష్ర్టంలో చిన్న నీటి వనరుల పునరుద్ధరణను ఓ ఉద్యమంలా చేపట్టనున్నట్లు సీఎం పేర్కొన్నారు. ‘సమైక్య పాలనలో తెలంగాణలో నీటి పారుదల వ్యవస్థ దెబ్బతిన్నది. అందుకే ఇప్పుడు వాటి పునరుద్ధరణను ఉద్యమంలా చేపడుతున్నాం. చిన్న నీటిపారుదల వనరుల అభివృద్ధికి రూ. 20 వేల కోట్లు వెచ్చిస్తాం. ఏడాదికి రూ. 5 వేల కోట్ల చొప్పున నాలుగేళ్లలో ఖర్చు చేస్తాం’ అని కేసీఆర్ ప్రకటించారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు సాగునీరు, హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు అందిస్తామని చెప్పారు.
‘2016 నాటికి తెలంగాణలో మిగులు విద్యుత్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. వ్యవసాయం, పరిశ్రమలు, గృహాలకు రెప్పపాటు కూడా కోతలు లేకుండా చూస్తా. సాధ్యమైనంత త్వరగా విద్యుత్ కొరతను అధిగమించేందుకే ఆ శాఖను నా వద్దే పెట్టుకున్నా’ అని సీఎం కేసీఆర్ అన్నారు. ‘తెలంగాణ తెచ్చుకున్నం. తెలంగాణ నిలబడాలి. తెలంగాణ మీద ఎలా కుట్రలు జరుగుతున్నయో మీరందరూ గమనిస్తున్నరు. కేసీఆర్ దేనికీ భయపడడు. 14 ఏళ్ల నుంచి అనేక విమర్శలు ఎదుర్కొన్నం. అంకిత భావంతో పనిచేస్తే బంగారు తెలంగాణ సాధ్యం. ఎవరికీ అనుమానాలు అక్కర్లేదు’ అని వ్యాఖ్యానించారు.
ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
అడ్డాకుల మండలం వేములలోని స్పర్శ్ పారిశ్రామికవాడలో రూ. 200 కోట్ల పెట్టుబడితో నిర్మించిన అత్యాధునిక ఫార్మస్యూటికల్ గ్లాస్ తయారీ ప్లాంట్ ‘కోజెంట్ గ్లాస్’ను కేసీఆర్ ప్రారంభించారు. రూ. 300 కోట్లతో పరిశ్రమను విస్తరించే యోచనలో ఉన్న ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో యూఎస్ కాన్సుల్ జనరల్ మైఖేల్ ముల్లిన్స్, ఫ్రెంచ్ కాన్సుల్ జనరల్ ఎరిక్ లావెర్త్, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి, పలువురు టీఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు. అనంతరం కొత్తూరు మండలం పెంజర్ల శివారులో జాన్సన్ అండ్ జాన్సన్ పరిశ్రమకు శంకుస్థాపన, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్(పీ అండ్ జీ) పరిశ్రమ ప్రారంభోత్సవంలోనూ సీఎం పాల్గొన్నారు. ఆయనతో పాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర, ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, మహబూబ్‌నగర్ కలెక్టర్ ప్రియదర్శినితో పాటు పీఅండ్‌జీ సీఈవో శంతన్‌కోస్లా, జాన్సన్ అండ్ జాన్సన్ ఎండీ శ్రీవాస్తవ కూడా ఉన్నారు.
అధికారులపై సీఎం ఆగ్రహం
మహబూబ్‌నగర్ జిల్లాలో పరిశ్రమల ప్రారంభోత్సవం సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పీ అండ్ జీ పరిశ్రమకు వెళ్లే రోడ్డును వేయడానికి ఆర్‌అండ్‌బీ అధికారులు సదరు కంపెనీ వారిని డబ్బులు అడగడం దారుణమన్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటైతే స్థానికులకు ఉద్యోగాలతో పాటు ఎంతో లాభం ఉంటుందన్నారు. ఇలాంటి పరిశ్రమలకు వచ్చే అవరోధాలను ముందుండి పరిష్కరించాల్సిన అధికారులు, ప్రజా ప్రతినిధులు వారిని ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా వారు తమ తీరును తక్షణమే మార్చుకోవాలని లేని పక్షంలో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అధికారులు, నేతలు ఏవైనా సమస్యలు సృష్టిస్తే వ్యాపారవేత్తలు తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. పారిశ్రామికవేత్తలకు అధికారులు సహకరించాలే తప్ప ఇబ్బందులకు గురి చేయొద్దని హితవు పలికారు.