
కోరుట్ల: ఎడారి దేశాల్లో ఎంతో కొంత సంపాదించుకొచ్చి తమను సంతోషంగా ఉంచుతాడని ఆశించిన ఆ కుటుంబానికి వలసజీవి మృతివార్త అశనిపాతంగా మారింది. ఏడాది కాలంగా ఒకే ఒక్కసారి భర్తతో మాట్లాడిన భార్య, పిల్లలు చివరకు ఆయన ఇక లేరనే సమాచారం అందడంతో హతాశులయ్యారు. ఫోన్ రాకున్నా.. డబ్బులు పంపకున్నా ఎక్కడో ఓ చోట పని చేసుకుని బాగానే ఉంటాడని అనుకున్న ఆ కుటుంబం మరణవార్తతో విషాదంలో మునిగిపోయింది.
ఏడాది క్రితం..
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అర్ఫత్‌పురాకు చెందిన మహ్మద్ జాఫర్(43) ఏడాది క్రితం లేబర్ పనిమీద సౌదీకి వెళ్లాడు. ఆ తర్వాత నెలరోజులకు కుటుంబ సభ్యులతో ఓ సారి మాట్లాడి తాను బాగానే ఉన్నానని చెప్పాడు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. ఆ తరువాత జాఫర్ నుంచి ఫోన్‌రాలేదు. జాఫర్ సౌదీలో మారుమూల ప్రాంతంలో ఉద్యోగం కావడంతో ఫోన్ చేయలేకపోతున్నాడని కుటుంబసభ్యులు భావించారు. చివరకు శుక్రవారం సౌదీలో ఉన్న నిజామాబాద్ జిల్లా పెర్కిట్‌వాసి కోరుట్లకు సమాచారం ఇవ్వడంతో జాఫర్ వార్త సమాచారం తెలిసింది.
అనుమానాస్పదంగా.. ఆలస్యంగా
సౌదీలోని ఖర్జూ పట్టణానికి సుమారు 350 కిలోమీటర్ల దూరంలో ఉండే హాయల్ అనే ప్రాంతంలో మహ్మద్ జాఫర్ మృతదేహాన్ని అక్కడి పోలీసులు కనుగొన్నట్లుగా కుటుంబసభ్యులకు సమాచారం అందింది. ఈ నెల 2వ తేదీన జాఫర్ మృతి చెందాడని, అతడి మృతదేహాన్ని అల్‌జోఫ్ పట్టణంలోని సతారా ఆసుపత్రి మార్చురీలో ఉంచారని తెలిసింది. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో సహజ మరణంగా భావించి ఆసుపత్రిలో ఉంచినట్లు కుటుంబసభ్యులకు సమాచారం వచ్చింది. జాఫర్ అటవీ ప్రాంతంలో మృతి చెందడంపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. 25రోజుల వరకు తమకు ఎలాంటి సమాచారం ఎందుకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాఫర్ సౌదీలో ఏ కంపెనీలో పనిచేస్తున్నాడో తెలియని కారణంగానే అతడిని గుర్తించడంలో ఆలస్యం జరిగిందని సౌదీలో ఉంటున్న పెర్కిట్ వాసి చెబుతున్నా.. అతడి మృతిపై అనుమానాలు వీడటం లేదు.
మృతదేహం తెప్పించుకోలేని దీనస్థితి..
సౌదీలో మృతిచెందిన మహ్మద్ జాఫర్‌కు భార్య రిజ్వానా, ముగ్గురు మగ పిల్లలు జుబేర్(17), జమీర్(15), సమీర్(10) ఉన్నారు. భార్య రిజ్వానా బీడీలు చుడుతూ పిల్లలను చదివిస్తోంది. భర్త గల్ఫ్‌లో కాస్తోకూస్తో సంపాదిస్తే తమ జీవితాలు బాగుపడతాయని ఆశించిన రిజ్వానా, పిల్లలు కుటంబ పెద్ద మృతితో దయనీయ స్థితిలో పడ్డారు. సౌదీ నుంచి జాఫర్ మృతదేహాన్ని ఇండియాకు తెప్పించడం ఖర్చులతో కూడిన పని కావడం డబ్బులు లేక అక్కడే అంత్యక్రియలు పూర్తి చేయడానికి అంగీకరించే పరిస్థితిలో ఉన్నారు. జాఫర్ మృతదేహాన్ని తెప్పించడంతోపాటు కుటుంబాన్ని ఆదుకునేందుకు దాతలు సాయం చేయాలని అర్థిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment