వైఎస్సార్ సీపీ సిటీ శ్రేణుల్లో ఆనందం
- ఆకట్టుకున్న వైఎస్ జగన్, షర్మిల ప్రసంగాలు
- వైఎస్సార్ సీపీ సిటీ శ్రేణుల్లో ఆనందం
- తెలంగాణ విస్తృత స్థాయి సమావేశం విజయవంతం
సాక్షి, సిటీబ్యూరో: మోహిదీపట్నంలోని క్రిస్టల్ గార్డెన్స్‌లో బుధవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం విజయవంతమైంది. దీంతో నగరంలోని పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, ఆయన సోదరి షర్మిల ఈ సమావేశంలోవైఎస్‌ఆర్ అభిమానులు, కార్యకర్తలు, ప్రజలను ఆకట్టుకునేలా ప్రసంగించారు. నేతలకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.
తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్ సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొనసాగుతారని జగన్ ప్రకటించారు. తన సోదరి షర్మిల తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్ సీపీకి సహకారం అందిస్తారని ఆయన ప్రకటించగానేసభలోని వారు పెద్ద ఎత్తున చప్పట్లు కొడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణలో వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, షర్మిల రాష్ట్ర బాధ్యతలు తీసుకుంటుందని జగన్ ప్రకటించడంతో వారు హర్షామోదం వ్యక్తం చేశారు.
అందరూ ఒక్కసారిగా లేచి ‘వైఎస్సార్ జిందాబాద్, జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వం వర్థిల్లాలి, వైఎస్సార్ ఆశయాలు నెరవేరుస్తామ’ని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నగరంలోని ప్రతి డివిజన్‌కు పార్టీని తీసుకెళ్లాలని, ప్రజల సమస్యలపై పార్టీ శ్రేణులు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.
షర్మిల మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్సార్ ఆశయ సాధనకు శ్రమిద్దామని, ఆయన పేరునిలబెట్టేందుకు అందరం కలిసి కృషి చేద్దామని ఇచ్చిన పిలుపునకు కార్యకర్తల నుంచి మంచి స్పందన కనిపించింది. పార్టీ నగర నేత ఆదం విజయ్ కుమార్ మాట్లాడుతూ 115 డివిజన్లలో వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడేందుకు కృషి చేస్తానని చెప్పారు. నగరంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించేందుకు యత్నిస్తానని తెలిపారు. శ్రేణులకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు.
భారీగా జనం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బుధవారం మొట్టమొదటిసారి జరిగిన వైఎస్సార్ సీపీ విస్తృత సమావేశానికి భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. నిర్ణీత సమయం 10.30కి ముందే నగరంతో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు తమ పేర్లను, పార్టీతో తమ అనుబంధాన్ని బయోడేటా పత్రాల్లో నమోదు చేసి నిర్వాహకులకు అందజేశారు.
ఉదయం 11.40కి సమావేశ మందిరానికి చేరుకున్న పార్టీ అధినేతలు వైఎస్ జగన్, షర్మిల ను కలిసేందుకు కార్యకర్తలు పోటీ పడ్డారు. మాజీ ఎమ్మెల్సీ రెహమాన్ దసరా, బక్రీద్ శుభాకాంక్షలు అంటూ ప్రసంగించి, పార్టీ కార్యకర్తల్లో నూతనోత్తేజం కల్పించారు. ‘టీడీపీ కార్యకర్తలూ... జాగ్రత్త. మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై చేయి వేస్తే చూస్తూ ఊరుకోబోమని’ హెచ్చరించారు.
నగరంలోని అన్ని డివిజన్ల నుంచి పార్టీ నాయకులు సమావేశానికి హాజరుకావడం విశేషం. సమావేశంలో తెలంగాణ ప్రాంత ముఖ్య నేత శివకుమార్, ఇతర నేతలు వీసీ శేఖర్ గౌడ్, కొండా రాఘవరెడ్డి, హరి గౌడ్, సూర్యనారాయణ రెడ్డి, వెల్లాల రామ్మోహన్, కె.అమృతసాగర్, కార్పొరేటర్ సురేష్ రెడ్డి, బి.మోహన్ కుమార్, ఎ.అవినాష్ గౌడ్, రామచందర్, రాఘవనాయుడు, ఆర్.బ్రహ్మయ్య, ఎన్.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.