ముగిసిన టీ.వైఎస్‌ఆర్ సీపీ ప్లీనరీ
హైదరాబాద్ : తెలంగాణ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం ముగిసింది. ఈ ప్లీనరీలో మొత్తం 12 తీర్మానాలను ఆమోదించిన పార్టీ, అలాగే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఎల్‌బీనగర్ ప్రాంతంలోని చంపాపేట్ రోడ్డులోని ఎస్‌ఎన్ రెడ్డి గార్డెన్స్(సామ నరసింహా రెడ్డి గార్డెన్)లో జరిగిన తెలంగాణ వైఎస్‌ఆర్ సీపీ ప్లీనరీ సమావేశానికి ముఖ్య అతిథిగా వైఎస్ జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ...ప్రజలంతా తమ కుటుంబమని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి భావించారన్నారు. ఆయన అకాల మరణాన్ని జీర్ణించుకోలేక తెలంగాణలోనే ఎక్కువమంది మరణించారన్నారు. దేశంలోనే అత్యంత శక్తివంతమైన కుటుంబాన్ని ఎదిరించి...పోరాడుతున్న వ్యక్తి వైఎస్ జగన్ అన్నారు.
2024లో తెలంగాణలో అధికారం దిశగా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలపై పోరాడదామని ఆయన పిలుపునిచ్చారు. ఇక ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఇద్దరూ రాజీపడ్డారని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.