అభినందన సభలా.. | Telangana ZP Last Meeting Nizamabad | Sakshi
Sakshi News home page

అభినందన సభలా..

Jun 15 2019 11:35 AM | Updated on Jun 15 2019 11:35 AM

Telangana ZP Last Meeting Nizamabad - Sakshi

నిజామాబాద్‌ జిల్లా జెడ్పీటీసీ సభ్యులతో చైర్మన్‌ రాజు, జుక్కల్‌ ఎమ్మెల్యే సింధే

ఉమ్మడి జిల్లా పరిషత్‌ చివరి సర్వసభ్య సమావేశం శుక్రవారం అభినందన సభలా సాగింది. ఉదయం పలు ప్రజాసమస్యలపై సభ్యులు చర్చించారు. మధ్యాహ్నం సన్మానాలు, సత్కారాలతో సాగింది. సమావేశంలో అటవీ శాఖ అధికారుల తీరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రస్తుత పాలకవర్గంపై స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రశంసలు కురిపించారు. 

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌:  జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. చైర్మన్‌ దఫేదార్‌ రాజు అధ్యక్షతన సమావేశం జరిగింది. రెండు జిల్లాల వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధు లు ఈ సమావేశానికి హాజరయ్యారు.
 
అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.. 
సమావేశం ప్రారంభమైన వెంటనే ఎజెండాలోని అంశాలను కాకుండా, ఆయా మండలాల్లో నెలకొన్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురావాలని చైర్మన్‌ రాజు సూచించారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు సమస్యలను ప్రస్తావించారు. అటవీశాఖ అధికారులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని గాంధారి జెడ్పీటీసీ తానాజీ ఆగ్రహం వ్యక్తంచేశారు. గాంధారి – వెల్లుట్ల పాత రోడ్డుపై మరమ్మతులు పనులను అడ్డుకోవడం ఎంతవరకు సమం జసమని అధికారులను ప్రశ్నించారు. ఎన్నో ఏళ్లుగా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను అటవీ అధికారులు లాగేసుకుంటున్నారని, ఈ భూమే ఆధారంగా జీవిస్తున్న గిరిజనులపై కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రైతుబంధు డబ్బులను బ్యాంకర్లు తమ అప్పుల కింద జమ చేసుకుంటున్నారని జుక్కల్‌ ఎమ్మెల్యే సింధే పేర్కొన్నారు.

శనగల డబ్బులెప్పుడిస్తరు? 
మూడు నెలల క్రితం శనగలు విక్రయించిన రైతులకు ఇప్పటికీ డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు. రైతుల వద్ద బీమా ప్రీమియం వసూలు చేస్తున్న బీమా కంపెనీలు పంట నష్టపోతే పరిహారం ఇవ్వడంలో ముఖం చాటేస్తున్నా యని ఆరోపించారు. ఎనిమిది నెలలుగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు రాకపోవడం, పంట నష్టపోయిన రైతులకు పరిహారం వంటి అంశాలను సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశాలపై నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు ఎంఆర్‌ఎం.రావు, సత్యనారాయణ సమాధానమిచ్చారు.
 
పీఆర్‌ రోడ్లు ఆర్‌అండ్‌బీకి.. 
కామారెడ్డి జిల్లాలో ఏడు పంచాయతీరాజ్‌ రోడ్లను ఆర్‌అండ్‌బీ రోడ్లుగా బదిలీ చేసేందుకు జెడ్పీ తీర్మానించింది. 2019–20 ఆర్థి క సంవత్సరానికి సంబంధించిన జెడ్పీ బడ్జెట్‌ అంచనాలు, అలాగే 2018–19 ఆర్థిక సంవత్సరం సవరించిన బడ్జెట్‌కు ఆమోదముద్ర వేసింది. 36 మండల పరిషత్‌ల బడ్జెట్‌లకూ ఆమోదం తెలిపింది. జెడ్పీ సాధారణ నిధుల నుంచి చేపట్టనున్న పనులు, గతంలో మంజూరైన పనుల మార్పులు.. ఇలా 16 అంశాలకు ఆమోదముద్ర వేసింది.
 
చైర్మన్‌ దఫేదార్‌ రాజుపై ప్రశంసలు 
జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దఫేదార్‌ రాజుపై శాసనసభా స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రశంసల జల్లులు కురిపించారు. చైర్మన్‌ పదవి రాజుకు కొత్తే అయినప్పటికీ.. ఐదేళ్ల పాటు సమర్థవంతమైన పాలనను అందించారని కితాబునిచ్చారు. జెడ్పీ సమావేశాలన్నీంటిని హుందాగా నడిపించారని, పాలకపక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా ప్రజా సమస్యలకే ప్రాధాన్యత ఇస్తూ సమావేశంలో అర్థవంతమైన చర్చ జరిగేలా సభలను నడిపించారని పేర్కొన్నారు. ఐదేళ్ల పదవీకాలాన్ని విజయవంతం చేసుకున్న సందర్భంగా చైర్మన్‌ రాజు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలను స్పీకర్‌ అభినందించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు కూడా పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు.

సన్మానాల జోరు.. 
చివరి సర్వసభ్య సమావేశంలో సన్మానాలు జోరుగా సాగాయి. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని చైర్మన్‌ రాజు సన్మానించారు. మధ్యాహ్న భోజన విరామం అనంతరం సన్మానాల కార్యక్రమం కొనసాగింది. జెడ్పీ చైర్మన్‌ రాజు, వైస్‌ చైర్మన్‌ గడ్డం సుమనారవిరెడ్డిలను కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, ఇతర ప్రజాప్రతినిధులు సన్మానించారు. ఎమ్మెల్యేలు హన్మంత్‌సింధే, నల్లమడుగు సురేందర్, ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌రావు, వీజీగౌడ్, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలను కూడా సత్కరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement