మేలో రాహుల్ రాష్ట్ర పర్యటన: భట్టి
హైదరాబాద్: రాష్ట్రంలో పెరుగుతున్న రైతు ఆత్మహత్యల నేపథ్యంలో రైతులకు భరోసా కల్పించేందుకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మేలో జిల్లాల పర్యటనకు రానున్నట్లు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. గురువారం గాంధీభవన్‌లో కిసాన్‌మోర్చా అధ్యక్షుడు ఎం.కోదండరెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చేందుకు మోదీ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన కిసాన్‌ర్యాలీకి రాష్ట్రం నుంచి భారీగా రైతులు హాజరయ్యారని భట్టి చెప్పారు. రైతు ఆత్మహత్యలను నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
ఇప్పటికే రాష్ట్రంలో 900కు పైగా ఆత్మహత్యలు జరిగాయన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల ఏ జిల్లాలో ఎక్కువ నష్టం జరిగిందో తెలుసుకున్నాక రాహుల్ ఎక్కడ పర్యటించాలనేది నిర్ణయిస్తామన్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో తనకు విబేధాల్లేవని భట్టి ఓ ప్రశ్నకు బదులిచ్చారు. కాగా, ఐదేళ్లపాటు అధికారం ఉంటుందనే నమ్మకం లేకనే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్‌లోకి చేర్చుకుంటున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి మల్లు రవి విమర్శించగా హామీల అమలుపై టీఆర్‌ఎస్ సర్కారు శ్వేతపత్రాన్ని ప్రకటించాలని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.