సాక్షి, సిటీబ్యూరో: ఈసారి గ్రేటర్‌లో ఎండలు మండిపోయాయి. కొన్ని ప్రాంతాలైతే నిప్పుల కొలిమిని తలపించాయి. ప్రధానంగా నగరంలోని ఐదు ప్రాంతాల్లో అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అసాధారణ స్థాయిలో జూపార్క్ ప్రాంతంలో నాలుగు రోజుల పాటు సరాసరిన 43.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవ్వగా... మైత్రీవనంలో 43.4, మాదాపూర్‌లో 43.2, బీహెచ్‌ఈఎల్, నాంపల్లి ప్రాంతాల్లో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఆయా ప్రాంతాల్లో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జూపార్క్‌లోని పక్షులు, జంతువులు, వీధి కుక్కలు విపరీత ప్రవర్తనకు గురయ్యాయి. వీధి కుక్కలు దాడి చేయడంతో ఎన్‌జీఆర్‌ఐ, మౌలాలి ప్రాంతాల్లో పలువురు గాయాలపాలయ్యారు. కాగా ఈసారి ఏప్రిల్, మేలో చాలా ప్రాంతాల్లో దాదాపు 20 రోజులు 40 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలో హరితం 8శాతానికి పడిపోవడం, యూవీ (అతినీలలోహిత కిరణాలు) రేడియేషన్ ఇండెక్స్ 11 పాయింట్ల గరిష్టానికి చేరుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
యూవీ సెగలు..
యూవీ ఇండెక్స్ (అతినీలలోహిత వికిరణ తీవ్రత) పెరగడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బహుళ అంతస్తుల భవంతులు, గాజు మేడలతో ఉష్టం వాతావరణంలో తేలికగా కలవకుండా భూఉపరితల వాతావరణానికే పరిమితం అవుతోంది. ఫలితంగా వికిరణ తీవ్రత పెరుగుతోంది. దీంతో ఓజోన్ పొర మందం తగ్గి భానుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు నేరుగా భూ వాతావరణంలోకి చేరుకుంటున్నాయి. ఇవి నేరుగా భూ వాతావరణంలోకి చేరడంతో పాటు మనుషులపై పడుతుండడంతో కళ్లు, చర్మ సంబంధ వ్యాధులు వస్తున్నాయి. అధిక సమయం ఎండలో తిరిగితే కళ్లు, చర్మం మండడం, రెటీనా దెబ్బతినడం లాంటి విపరిణామాలు తలెత్తుతున్నాయి. యూవీ సూచీ సాధారణంగా 7పాయింట్లకు పరిమితమైతే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ 10 పాయింట్లు నమోదైతే చర్మం, కళ్లకు ప్రమాదం ఉంటుంది. ఇక 12 పాయింట్లు దాటితే చర్మ కేన్సర్‌లు పెరిగే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. బయటకు వెళ్లినప్పుడు వికిరణ తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు సన్ స్క్రీన్ లోషన్లు రాసుకోవాలని, చలువ కళ్లద్దాలు, క్యాప్ ధరించాలని, గొడుకు వినియోగించాలని సూచిస్తున్నారు.
హరితం హననం..
తోటల నగరంగా ప్రసిద్ధి చెందిన భాగ్యనగరంలో ఇప్పుడు హరితం హననమవుతోంది. రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. రహదారులు, బహుళ అంతస్తుల భవంతులు శరవేగంగా విస్తరిస్తుండడంతో హరిత వాతావరణం క్రమేణా కనుమరుగవుతోంది. దీంతో నగర పర్యావరణం త్వరగా వేడెక్కుతోంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 30శాతం గ్రీన్ బెల్ట్ (హరిత వాతావరణం) ఉండాలి. కానీ నగరంలో కేవలం 8 శాతమే గ్రీన్‌బెల్ట్ ఉండడంతో ప్రాణవాయువు కరువైంది. అంతేకాదు ఒకప్పుడు ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు నగర వాతావరణం ఉపశమనం కలిగిస్తుందనే పేరుండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. దాన్ని మనమే చేజేతులా దూరం చేసుకుంటున్నాం. రహదారుల విస్తరణ, బహుళ అంతస్తుల భవంతులు, వాణిజ్య సముదాయాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగడం... అందుకు తగిన విధంగా హరిత వాతావరణం లేకపోవడం... వాహనాలు, పరిశ్రమల నుంచి కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ తదితర వాయువుల ఉద్గారాలు పెరిగి వేసవి తాపం నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యేక ఏర్పాట్లు..
అధిక ఉష్ణోగ్రతలతో జూపార్క్‌లో జంతువులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. పులులు, పక్షుల ఎన్‌క్లోజర్స్ చుట్టూ గోనె సంచులు ఏర్పాటు చేసి వాటిపై నీటిని విరజిమ్మేందుకు స్ప్రింక్లర్లు ఏర్పాటు చేశాం. కొన్ని ఎన్‌క్లోజర్స్‌లో కూలర్లు సైతం పెట్టాం. ప్రతి గంటకూ ఉష్ణోగ్రతల్లో మార్పులను తెలుసుకొని జంతువులు డీహైడ్రేషన్‌కు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నాం. తాగే నీటిలో గ్లూకోజ్ కలపడంతో పాటు మల్టీ విటమిన్స్ కలిపి అందజేస్తున్నాం. జూపార్క్‌లో సుమారు 1600 జంతువులను వేసవి తాపం ఉక్కిరిబిక్కిరి చేసినప్పటికీ వాటి పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. – క్షితిజ, జూపార్క్ క్యూరేటర్
Comments
Please login to add a commentAdd a comment