ఆర్టీసీలో 'టెన్' షన్‌ | Ten rupees coins tension in rtc | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో 'టెన్' షన్‌

Published Wed, Jan 24 2018 1:52 AM | Last Updated on Wed, Jan 24 2018 1:52 AM

Ten rupees coins tension in rtc - Sakshi

పది రూపాయల బిళ్ల తెగ టెన్షన్‌ పెడుతోంది.. ఇటు ఆర్టీసీ, అటు బ్యాంకులు నానా హైరానా పడాల్సి వస్తోంది. రూ.పది నాణెం చలామణిలో లేదన్న తప్పుడు ప్రచారం జనాల్లోకి వెళ్లడమే ఇందుకు కారణం. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణి కులు తమ వద్ద ఉన్న రూ.పది బిళ్లను టికెట్‌ కొనేప్పుడు కండక్టర్లకు ఇస్తున్నారు. కానీ కండక్టర్లు చిల్లర రూపంలో తిరిగిస్తే మాత్రం తీసుకోవటం లేదు. దీంతో ఆర్టీసీలో పెద్ద మొత్తంలో రూ.పది బిళ్లలు పేరుకుపోతున్నాయి.

వాటిని బ్యాంకుల్లో జమ చేయబోతే, ఆర్బీఐ నిబంధన చూపి అంత చిల్లర తాము తీసుకోబోమంటూ బ్యాంకు సిబ్బంది తేల్చి చెబుతున్నారు. దీంతో ఆర్టీసీకి దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతోంది. చాలా డిపోల్లో ఆ బిళ్లల మూటలు కుప్పలుతెప్పలుగా పేరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు విషయాన్ని స్టేట్‌ బ్యాంకు ప్రధాన కార్యాలయం, ఆర్బీఐ, బ్యాంకు అంబుడ్స్‌మెన్‌లకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. – సాక్షి, హైదరాబాద్‌


తిరిగి ప్రయాణికులకే ఇబ్బంది
ప్రయాణికులు తీసుకోకపోతుండటం, బ్యాంకులు తిరస్కరిస్తుండటంతో డిపో అధికారులు కండక్టర్లను నియంత్రిస్తున్నారు. రూ.వేలల్లో నాణేలు వస్తున్న నేపథ్యంలో వాటిని వీలైనంత తక్కువకే పరిమితం చేయాలని మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో కండక్టర్లు ప్రయాణికుల నుంచి పది నాణేలు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. వెరసి హైదరాబాద్‌ నగరంలో గతంలో సగటున ఒక్కో డిపో పరిధిలో రోజుకు రూ.10 వేల విలువైన రూ. పది నాణేలు వచ్చిపడగా, ఇప్పుడా మొత్తం రూ.5–రూ.6 వేలకు పడిపోయింది.

మరోవైపు రూ.10 నాణేలు తీసుకోవటం లేదంటూ ఉన్నతాధికారులకు ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో ఆర్టీసీ అధికారులు నేరుగా ఆర్బీఐ, స్టేట్‌బ్యాంకు, బ్యాంకు అంబుడ్స్‌మెన్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ ఖాతా స్టేట్‌ బ్యాంకులో ఉండటంతో ఓ ఉన్నతాధికారి స్వయంగా ఆ బ్యాంకు చీఫ్‌ను కలసి కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో స్టేట్‌ బ్యాంకు ఉన్నతాధికారులు.. ఒక్కో బ్రాంచి వారీగా ఆరా తీసి పరిస్థితిని సరిదిద్దే పని ప్రారంభించినట్టు ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు.

నిబంధన మార్చమన్నాం: ఆర్టీసీ
‘రోజుకు రూ.వేయికి మించి రూ.10 నాణేలు బ్యాంకులో జమ చేయవద్దనే నిబంధన ఉందని స్టేట్‌ బ్యాంకు అధి కారులు చెబుతున్నారు. కానీ అది వ్యక్తిగత ఖాతాలకే అన్వయించాలి తప్ప.. నిత్యం లక్షల మంది ప్రయాణికుల తో వ్యవహారం నడిపే ఆర్టీసీకి వర్తింపజేస్తే ఎలా. ఇదే విషయాన్ని స్టేట్‌ బ్యాంకు ఉన్నతాధికారుల దృíష్టికి తీసుకెళ్లాం. నిత్యం రూ.కోట్లలో మొత్తాన్ని బ్యాంకుల్లో జమ చేసే ఆర్టీసీని ఆ నిబంధన నుంచి మినహాయించాలని అడిగాం. సానుకూలంగా స్పందిస్తున్నారు’


ఒక్క నిబంధన.. నానా హైరానా!
పది రూపాయిల నాణేలు చాలాకాలంగా చలా మణిలో ఉన్నాయి. అయితే పెద్ద నోట్ల రద్దు సమ యం లో ఆ బిళ్లలు చెల్లవంటూ ఓ వదంతి వ్యాపించింది. అప్పటికే నోట్ల టెన్షన్‌తో ఉన్న ప్రజలు ఆ నాణేలను తీసుకోవటం మానేశారు. వీలైనంత వరకు తమ వద్ద ఉన్న వాటిని బ్యాంకులకు జమ చేసేందుకు క్యూ కట్టారు. రూ.పది నాణేలు చెల్లుబాటవుతాయని, అవి చెల్లవనే వదంతి తప్పని స్వయంగా రిజర్వ్‌ బ్యాంకు ప్రకటించింది.

అయినా వాటిని తీసుకునేం దుకు నిరా కరిస్తున్నారు. ఇప్పుడు ఇదే ఆర్టీసీకి పెద్ద సమస్యగా మారింది. డిపోలకు సగటున నిత్యం రూ.10 వేల విలువైన రూ.పది బిళ్లలు వస్తున్నాయి. కండక్టర్లు చిల్లర ఇచ్చే క్రమంలో వాటిని ఇస్తే ప్రయాణికులు తీసుకో వటం లేదు. వాటిని బ్యాంకుల్లో జమ చేసేందుకు వెళ్తే.. రూ.పది బిళ్లలను రోజుకు రూ.వేయి విలువకు మించి తీసుకోవద్దనే నిబంధన ఉందంటూ తీసుకోవటం లేదు.

ఇతర ఖాతాదారుల ద్వారా పెద్ద సంఖ్యలో రూ.పది బిళ్లలు వస్తుండటంతో వాటిని నిల్వ చేయటం బ్యాంకులకూ సమస్యగా మారు తోంది. చెస్ట్‌ (డబ్బు నిల్వ చేసే ప్రత్యేక ఏర్పాటు) వసతి లేని బ్రాంచిలలో డబ్బు నిల్వ చేసే ప్రదేశం నాణేలతో నిండిపోవటంతో కొత్తగా నాణేలు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు.


ఎక్కడ నిల్వ చేయాలి
‘రూ.10 నాణేలను జమ చేసుకోకుండా తిరస్కరించకూడదు. మేం కూడా తీసుకోవాల్సిందే. కానీ నిత్యం కుప్పలుతెప్పలుగా నాణేలు వచ్చిపడుతుంటే ఇబ్బందే కదా. ఇప్పటికే రూ.35 లక్షల విలువైన నాణేలు ఉన్నాయి. వాటిని ఎక్కడ నిల్వ చేయాలో తెలియటం లేదు. సాధారణ క్యాష్‌ ఉంచాల్సిన ప్రాంతమంతా ఈ బిళ్లలతోనే నిండిపోతున్నాయి’ – ఓ బ్యాంకు బ్రాంచి మేనేజర్‌


కొన్ని చోట్ల తీసుకోవడం లేదు...
‘రాజేంద్రనగర్‌ ప్రాంతంలో ఉన్న స్టేట్‌ బ్యాంకు బ్రాంచీలో రూ.30 లక్షల విలువైన రూ.పది నాణేలు పేరుకు పోయాయని, స్థలం సరిపోక ఇబ్బందిగా ఉందని ఆ బ్రాంచి అధికారులంటున్నారు. కానీ మా పరిస్థితి గమనించి వారు నాణేలను స్వీకరించి సహకరిస్తున్నారు. కొన్ని చోట్ల మాత్రం నిరాకరిస్తున్నారు’ – రాజేంద్రనగర్‌ డిపో మేనేజర్‌ వెంకటరెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement