
ఐఏఎస్‌కు టెండర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
కాంట్రాక్టు కార్మికుల నియామక టెండర్ల గోల్‌మాల్ వ్యవహారాన్ని ‘సాక్షి’ బట్టబయలు చేయడంతో బల్దియా అధికారుల్లో వణుకు మొదలైంది. నిబంధనలను అడ్డంగా తోసిరాజని శ్రీరాజరాజేశ్వర సంస్థకు టెండర్‌ను కట్టబెట్టిన అధికారుల మెడకు ఉచ్చు బిగిసుకుంది. సాక్షాత్తు కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్, ఐఏఎస్ అధికారి శ్రీకేష్ లట్కర్ ప్రమేయం ఉండటంతో ఈ ఉచ్చు నుంచి బయటపడేందుకు నానాపాట్లు పడుతున్నారు.
ఒకవైపు నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్‌తో రాజీ యత్నాలు కొనసాగిస్తూనే.. మరోవైపు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో మంతనాలు జరుపుతున్నారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, కిందిస్థాయి అధికారులను నమ్మి ఫైలుపై సంతకం చేశానని, ఎలాగైనా ఈ ఉచ్చు నుంచి బయటపడేయాలని ప్రాధేయపడుతున్నట్లు సమాచారం. అర్హతల్లేని సంస్థకు కాంట్రాక్టు కట్టబెడుతూ అడ్డంగా దొరికిపోవడంతో ఈ వ్యవహారం ఎటు మలుపు తిరుగుతోందననే భయం పట్టుకుంది.
పూర్తి ఆధారాలతో దొరికిపోయినందున ఈ వ్యవహారం నుంచి బయటపడటం అంత సులువు కాదని హైదరాబాద్‌లోని సీనియర్ ఐఏఎస్‌లు, ఇంజనీరింగ్ ఇన్ ఛీప్ స్థాయి అధికారులు చెబుతుండటంతో సదరు ఐఏఎస్‌కు సైతం వణుకు మొదలైంది. ‘సాక్షి’లో కథనం రావడంతో శనివారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఈ వ్యవహారం నుంచి ఎలా బయటపడాలా? అనే అంశంపై సదరు ఐఏఎస్ అధికారి అటు ఉన్నతస్థాయి అధికారులు, ఇటు తన సన్నిహితులతో మంతనాలు జరుపుతూనే ఉన్నారు. రాష్ట్ర పురపాలక శాఖ డెరైక్టర్ జనార్దన్‌రెడ్డి శనివారం ఉదయం బల్దియా కమిషనర్‌కు ఫోన్ చేసి ఈ వ్యవహారంపై ఆరా తీశారు.
అర్హత లేని సంస్థకు కాంట్రాక్టు కట్టబెడుతూ రూపొందించిన ఫైళ్లపై సంతకం చేసినందున దీనినుంచి తప్పించుకోవడం అంత సులువు కాదని ఆయన హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో ఏం చేయాలో పాలుపోని శ్రీకేష్ లట్కర్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. వాస్తవానికి ఐఏఎస్‌ల కేటాయింపుల్లో లట్కర్‌ను ఏపీకి కేటాయించినప్పటికీ దీనిపై ఇంకా అధికారిక ఆదేశాలు వెలువడకపోవడంతో తెలంగాణలోనే కొనసాగుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ఉచ్చు నుంచి బయటపడి తిరిగి ఏపీ కేడర్‌కు వెళ్లిపోవాలనే నిర్ణయానికి వచ్చారు. అప్పటివరకు సెలవు పెట్టాలని కూడా భావిస్తున్నారు. అందులో భాగంగా ఈనెల 22 నుంచి 27 వరకు సెలవు పెట్టినట్లు తెలిసింది.
ఎస్‌ఈ, ఈఈ గుండెల్లో వణుకు
ఈ అక్రమాలకు మూల సూత్రధారులుగా భావిస్తున్న ఎస్‌ఈ రాజేంద్రప్రసాద్, ఈఈ లక్ష్మయ్య ఏకంగా కాళ్లబేరానికి వచ్చినట్లు తెలుస్తోంది. వ్యవహారం రాష్ర్ట స్థాయికి వెళ్లడం, తప్పు చేసి అడ్డంగా దొరికిపోవడంతో ఉద్యోగం నుంచి సస్పెండ్ కావడం ఖాయమని, అదే సమయంలో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా వచ్చే అవకాశాలున్నాయని, కేసు తీవ్రతను విశ్లేషిస్తున్న సహచర ఇంజనీర్లు చెబుతుండటంతో వారికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో ఒకవైపు ఉన్నతాధికారులతో, మరోవైపు నగర మేయర్‌కు తప్పు జరిగి పోయిందని ఒప్పుకుంటూనే ఎలాగైనా ఈ వ్యవహారం నుంచి బయటపడేయాలని ప్రాధేయపడుతున్నారు. అంతటితో ఆగకుండా ఉన్నతాధికారులను కలిసేందుకు ఎస్‌ఈ ఏకంగా హైదరాబాద్ వెళ్లారు. మరోవైపు నగర పాలక సంస్థ డిప్యూటీ ఈఈ సంపత్‌రావు ఈ బాగో తం తనకు ఎక్కడ మెడకు చుట్టుకుంటుందోననే భయంతో రెండ్రోజుల క్రితమే ఓ మంత్రి ద్వారా మెట్‌పల్లికి బదిలీ చేయించుకున్నారు.
ఆ ఇద్దరికీ షోకాజ్ నోటీసులు! రద్దు దిశగా టెండర్
అక్రమార్కులంతా టెండర్ల బాగోతం నుంచి బయటపడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నప్పటికీ ఈ వ్యవహారం ఇంతటితో ఆగే అవకాశాలు కన్పించడం లేదు. మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని నగర పాలక మండలి నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు సమాచారం. మరోవైపు టెండర్ల గోల్‌మాల్ వ్యవహారం బట్టబయలు కావడంతో వాటిని రద్దు చేసేందుకు నగర మేయర్ సిద్ధమైనట్లు తెలిసింది. తద్వారా టెండర్ బాగోతంతో నగర పాలక సంస్థపై పడిన అవినీతి మకిలీని కడిగేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. నేడో, రేపో ఈ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి.
లోకాయుక్తకు ఫిర్యాదు
నగరపాలక సంస్థలో చోటు చేసుకున్న అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని న్యాయవాది, 32వ డివిజన్ కార్పొరేటర్ ఏవీ రమణ శనివారం లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అవినీతి రహిత పాలనను అందించాలన్న ధృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉన్న సందర్భంలో ఉన్నతాధికారులే అత్యుత్సాహం చూపించి ఇలాంటి తప్పిదాలు చేయడం దురదృష్టకరమని, అర్హతలేని కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడంపై తక్షణమై స్పందించి అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
సీఎంకు ఎమ్మెల్యే ఫిర్యాదు
టెండర్లలో జరిగిన అవకతవకలపై స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శనివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దృష్టికి తీసుకెళ్లారు. ‘సాక్షి’లో వచ్చిన కథనంతోపాటు బల్దియా కమిషనర్, అధికారుల వ్యవహారానికి సంబంధించి ఆధారాలను సమర్పిస్తూ లిఖిత పూర్వక లేఖను పంపినట్లు తెలిసింది. మరోవైపు నగర పాలక సంస్థకు చెందిన కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు సైతం మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.