
ఏ జిల్లాకు ఎవరెవరు?
డీసీసీ అధ్యక్షుల నియామకంపై టీపీసీసీ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పార్టీ జిల్లా కమిటీలకు సారథుల నియామకాలపై టీపీసీసీ కసరత్తు చేస్తోంది. నవంబర్‌లోనే డీసీసీ అధ్యక్షుల నియామకంతో పాటు గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న పీసీసీ కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శుల నియామక ప్రక్రియను పూర్తిచేయాలని భావిస్తోంది. టీపీసీసీ కార్యవర్గం గతంలోనే పూర్తయినా జిల్లాల విభజన జరగడంతో మార్పులు చేర్పులు అనివార్యమైనాయి. డీసీసీ అధ్యక్షులుగా ఎక్కువ మంది అవసరం కావడంతో సమర్థులూ, పార్టీకోసం పూర్తిసమయం పనిచేయగలిగే నాయకులకోసం టీపీసీసీ అన్వేషిస్తోంది.
అయితే జిల్లాల విస్తీర్ణం తగ్గిపోవడంతో డీసీసీ అధ్యక్షులుగా పనిచేయడానికి సీనియర్లు అనాసక్తిగా ఉన్నారు. మరో పక్క అన్ని జిల్లాలకు కొత్తవారిని నియమించడంవల్ల ఇబ్బందులు వస్తాయనే కారణంతో పాత జిల్లాలకు అధ్యక్షులుగా ఉన్నవారినే కొనసాగాలని టీపీసీసీ కోరింది. ఈ నేపథ్యంలో నాయిని రాజేందర్‌రెడ్డి(వరంగల్ అర్బన్), ఒబేదుల్లా కొత్వాల్(మహబూబ్‌నగర్), ఐత సత్యం(ఖమ్మం), తాహెర్‌బిన్ హందాన్ (నిజామాబాద్) తదితరులు పదవుల్లో కొనసాగే అవకాశం ఉంది.ఆదిలాబాద్ జిల్లాకు అధ్యక్షునిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎ.మహేశ్వర్‌రెడ్డి నిర్మల్ డీసీసీ అధ్యక్షునిగా కొనసాగడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారు. పెద్ద జిల్లాకు అధ్యక్షునిగా పనిచేసిన తాను చిన్న జిల్లాకు పనిచేయలేనని టీపీసీసీకి చెప్పినట్టుగా తెలిసింది. ఇక సంగారెడ్డి జిల్లా పగ్గాలను మాజీ ఎమ్మెల్యే టి.జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి)కి అప్పగించడం దాదాపు ఖరారైనట్టుగా టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి.
నల్లగొండలో ఉత్కంఠ
నల్లగొండ డీసీసీ అధ్యక్షుని విషయంలో పార్టీ అగ్రనేతల అనుచరుల మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది. నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అనుచరుల్లో ఎవరికి అవకాశం దక్కుతుంనేది ఉత్కంఠగా మరింది. కోమటిరెడ్డి సోదరులకు అనుచరుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను వారు ప్రతిపాదిస్తున్నారు. కొత్తగూడెం జిల్లాకు రేగ కాంతారావు పేరు టీపీసీసీ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. జనగామ జిల్లాకు పొన్నాల లక్ష్మయ్య ప్రతిపాదించిన పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. ఇక్కడ పొన్నాల లక్ష్మయ్య కోడలు వైశాలి పేరు వినిపిస్తోంది. మహబూబాబాద్ డీసీసీకి భరత్‌చంద్రారెడ్డిని ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది.
మేడ్చల్ జిల్లాకు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక్కడ డీసీసీ అధ్యక్షునిగా రెడ్డి సామాజికవర్గానికి అవకాశం ఇవ్వాల్సి వస్తే ఉద్దెమర్రి నర్సింహారెడ్డి ఖరారయ్యే అవకాశముంది. కాగా, జిల్లాలు చిన్నవి కావడం వల్ల పెద్ద నేతల మధ్య వివాదాలు తగ్గే అవకాశముందని టీపీసీసీ ముఖ్యనాయకుడొకరు వ్యాఖ్యానించారు. తీవ్రమైన విభేదాలున్న జిల్లాలు మినహా డీసీసీల పదవులను నవంబర్ నెలాఖరులోగా భర్తీ చేయాలని టీపీసీసీ కృతనిశ్చయంతో ఉందని తెలుస్తోంది.