ఇక వేగంగా ‘మిషన్ కాకతీయ’ పనులు
- 279 చెరువుల పనులకు రూ.123కోట్ల పరిపాలనా అనుమతులు
- రెండు మూడు రోజుల్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభం
- ఈనెల రెండో వారంలో పనులు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘మిషన్ కాకతీయ’ పనులను త్వరితగతిన ప్రారంభించేందుకు కసరత్తును వేగిరం చేసింది. జనవరి రెండో వారానికి కనీసం 50 శాతం పనులను ఆరంభించాలని దృఢ సంకల్పంతో ఉన్న ప్రభుత్వం ప్రస్తుతం 279 చెరువుల పునరుద్ధరణ పనులకోసం రూ.123 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూ రుచేసింది. శుక్రవారం నుంచి వరుసగా ఎలాంటి అభ్యంతరాలు లేని చెరువులన్నింటికీ పరిపాలనా అనుమతులు ఇచ్చే దిశగా ఆర్థిక శాఖ సైతం సన్నాహాలు చేస్తోంది.
మిషన్ కాకతీయలో భాగంగా తొలి దశలో పనులు చేపట్టనున్న 9వేల చెరువుల్లో సర్వే, అంచనాల తయారీ, పరిశీలన పూర్తి చేసుకున్న సుమారు 600 చెరువులకు రూ.230 కోట్ల అంచనాలు సిద్ధం చేసిన నీటి పారుదల శాఖ 15 రోజుల కిందటే ఆర్థిక శాఖకు పంపిన విషయం తెలిసిందే. అయితే వివిధ కారణాలను చూపుతూ చెరువుల పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేయడంలో ఆర్థిక శాఖ అలసత్వం ప్రదర్శించడంతో స్వయంగా మంత్రి టి.హరీశ్‌రావు కల్పించుకోవాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలోనే ఆర్థిక శాఖ రూ.123.06 కోట్ల పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. మరమ్మతు పనులకు అనుమతులు లభించిన చెరువులన్నింటికీ 48 గంటల్లో టెండర్లు పిలవాలని నీటి పారుదల శాఖ భావిస్తోంది. వారం రోజుల్లో టెండర్ల ప్రక్రియను ముగించి జనవరి రెండో వారానికి పనులు ప్రారంభిస్తామని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఆర్థిక ఏడాది తొలి దశలో గోదావరి, కృష్ణా బేసిన్‌ల పరిధిలో రూ.500కోట్ల పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు అవుతాయని, అనంతరమే మిగతా పనులను చేపడతారని ఆ వర్గాలు వెల్లడించాయి.
కేంద్ర మంత్రి ఉమాభారతికి ఆహ్వానం!
జనవరి రెండోవారంలో చెరువుల పనుల ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ఉమాభారతిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా ఆహ్వానించే అవకాశం ఉంది. ఈ నెల 4 లేదా 5న ఢిల్లీకి వెళ్లనున్న ఆయన ఉమాభారతిని కలుస్తారని సమాచారం.