టాప్ 12
2014 ఎన్నో సంచలనాలకు వేదికైంది. ఈ ఏడాది అత్యంత హైలెట్‌గా నిలిచిన అంశాల్లో ఒకటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భా వం, రెండు సార్వత్రిక ఎన్నికలు. ఫిబ్రవరి 18, 20 తేదీల్లో లోక్‌సభ, రాజ్యసభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంతో జిల్లాలో సంబురాలు మిన్నంటాయి. మే 16న వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అనూహ్య ఫలితాలను నమోదు చేసింది. ఖమ్మం ఎంపీతో పాటు మూడు ఎమ్మెల్యే స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడంతో వేగంగా రాజకీయ సమీకరణల్లో మార్పులు వచ్చాయి. మే 25న ఆనంద్‌కుమార్ జిల్లా ఖ్యాతిని ఎవరెస్ట్‌శిఖరంపై నిలపడం మరో సంచలనం.
కాలం వేగంగా కదిలింది. సెకన్లు నిమిషాలుగా.. నిమిషాలు గంటలుగా.. గంటలు రోజులుగా.. రోజులు వారాలుగా.. వారాలు నెలలుగా.. నెలలు సంవత్సరంగా.. ఇలా తన ప్రస్థానాన్ని కొనసాగించింది. అంతే వేగంగా జిల్లాలో ఈ ఏడాది అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో ఎన్నడూ లేనట్లుగా ఒకేసారి మున్సిపల్, పరిషత్, సార్వత్రిక ఎన్నికలు రావడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. పల్లె నుంచి పట్టణం దాకా ప్రజాప్రతినిధులు కొలువుదీరారు. ప్రత్యేక రాష్ట్ర సంబరాలను జిల్లా ప్రజలు ఆనందంతో చేసుకున్నారు. రాజకీయ సమీకరణాలు చోటుచేసుకున్నాయి. జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలకు రాష్ట్ర స్థాయిలో పదవులు దక్కాయి. మరోవైపు జిల్లా ఆణిముత్యాలు ఆనంద్, మేఘనలు ప్రశంసలతో జిల్లా ఖ్యాతిని అగ్రపథాన నిలిపారు. ఇలా ఈ ఏడాది ప్రధానంగా ఎన్నికలు, నూతన రాష్ట్ర సంబరాలకు వేదికైంది.
- సాక్షి, ఖమ్మం
జనవరి
తెలంగాణ జిల్లాల ఆర్మీ రిక్రూట్‌మెంట్ జనవరి 18 నుంచి 24 వరకు కొత్తగూడెంలో ప్రకాశం స్టేడియంలో జరిగింది. వారం రోజులపాటు జరిగిన ఈ ర్యాలీలో తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి 30 వేల మంది యువతీ యువకులు పాల్గొన్నారు. దేశ సేవకు మేము సైతం అంటూ యువత భారీగా కదలడంతో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి అనూహ్య స్పందన వచ్చింది. ఇక్కడ జరిగిన ర్యాలీలో తదుపరి పోటీల కోసం 5,291 మంది ఎంపికయ్యారు.
ఫిబ్రవరి
ఫిబ్రవరి 18న లోక్‌సభలో, 20న రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదంతో జిల్లా వ్యాప్తంగా సంబురం చేసుకున్నారు. జనం హార్షాతిరేకంతో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, యువత ఆనందోత్సహంతో ఊగిపోయారు.
మార్చి
మార్చి 5న సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని తెలంగాణలో ఖమ్మం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఖమ్మంలో పెవిలియన్ గ్రౌండ్‌లో జరిగిన జనభేరి సభకు ప్రజలు భారీ ఎత్తున కదలివచ్చారు. సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, వైరా, కొణిజర్ల మీదుగా జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ఖమ్మం చేరుకుంది. రోడ్ షోలో ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. జనభేరి సభ సక్సెస్ కావడంతో వైఎస్సార్‌పీ శ్రేణులు సార్వత్రిక ఎన్నికల్లో ఇదే ఊపుతో కదంతొక్కాయి.
మార్చి 24న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధిర, ఇల్లెందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ రోడ్ షో జరిగింది. జిల్లా నుంచి ప్రజలు ఆమె పర్యటనకు తరలొచ్చి బ్రహ్మరథం పట్టారు. ఇదే నెల 8న సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జిల్లాకు చెందిన ఆ పార్టీ సీనియర్ నేత తమ్మినేని వీరభద్రం ఎన్నికయ్యారు. రాజధానిలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో పార్టీ నాయకత్వం ఆయనకు తెలంగాణ సారథ్య బాధ్యతలు అప్పగించింది. 15న ఖమ్మంలో ప్రజాగర్జన సభకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హాజరయ్యారు.
ఏప్రిల్
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 13 నుంచి 16 వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఆమె ప్రచారానికి ప్రజలు జేజేలు పలికారు. ఏప్రిల్ 26న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో ప్రచారం నిర్వహించారు. కొత్తగూడెం, మధిరలో సభలకు ఆయ న హాజరై ప్రసగించారు. ప్రజలు ఆయన పర్యటన కు నీరాజనం పలికారు. ఎన్నికల ప్రచారంలో భా గంగా ఏప్రిల్22న ఖమ్మం, కొత్తగూడెంలో నిర్వహించి న సభలకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హాజరయ్యారు. 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి.
మే
జిల్లా చరిత్రలోనే మే నెలలో అనూ హ్య సంఘటనలు చోటు చేసుకున్నా యి. జిల్లా ఖ్యా తి నలుదిశలా వ్యాపించడం తో పాటు రాజకీయాలకు కొత్త భాష్యం చెప్పిం ది ఈనెల. 12న మున్సిపల్ ఎన్నికలు, 13న పరిషత్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈనెల 16న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డా యి. ఎంపీతో పాటు మూడు ఎమ్మెల్యే స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది.
వైఎస్సార్‌సీపీ ప్రభంజనతో ప్రత్యర్థి పార్టీలు కంగుతిన్నాయి. అలాగే కాం గ్రెస్ నాలుగు చోట్ల, సీపీఎం, టీడీపీ, టీఆర్‌ఎస్ ఒక్కో స్థానాన్ని దక్కించుకున్నాయి. మే 25న జిల్లా ఖ్యాతిని ఆనంద్‌కుమార్ ఎవరెస్టు శిఖరంపై నిలిపాడు. జిల్లాలో ని మారుమూల ప్రాంతమైన చర్ల మండలం కలివేరు గ్రామానికి చెందిన సాధనపల్లి కొండలరావు, లక్ష్మి దంపతుల కుమారుడు ఆనంద్‌కుమార్ ఎవరెస్టును అధిరోహించి యావత్ ప్రపంచం నుంచి ప్రశంసలు పొందాడు.
జూన్
జూన్ 2 తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరి న రోజు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి న రోజు ఇది. ఊరూవా డా పట్టణం ఉప్పొంగిన ఆనందంతో కేరింతలు కొట్టిన శుభదినం. ప్రత్యే క రాష్ట్రం ఏర్పడడంతో ‘మన పాలన మనకేనంటూ’ఆనందోత్సహంతో ఊగిపోయారు.జిల్లా కేంద్రం లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకులను అధికార యంత్రాంగం నిర్వహించింది. స్వచ్ఛందంగా ప్రజలు రాష్ట్ర అవతరణ వేడుకలను జరుపుకున్నారు.
జూలై
రాష్ర్టం ఏర్పడిన వెంటనే నెలరోజుల్లో నూతన ప్రభుత్వం తన మార్కు పాలన ప్రారంభించిం ది. జిల్లా 44 వ కలెక్టర్‌గా జూలై 29న డాక్టర్ కె.ఇలంబరితిని జిల్లాకు నియమించింది. పోలవరం ముంపు కింద జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా ఈనెలలో 11న అఖిలపక్షం, జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా బంద్ నిర్వహించారు.
ఆగస్టు
ఆగస్టు 7న జిల్లా షరిషత్ చైర్మన్ ఎన్నిక జరిగింది. చైర్‌పర్సన్‌గా వెంకటాపురం జెడ్పీటీసీ సభ్యురాలు గడిపల్లి కవిత ఎన్నికయ్యారు. నూతన రాష్ట్రంలో తొలిసారి జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకలకు ఎక్త్సెజ్ శాఖ మంత్రి పద్మారావు హాజరయ్యారు. 30న టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆపార్టీకి రాజీనామా చేశారు. ఆయన బాటలోనే ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత నడిచారు.
సెప్టెంబర్
సెప్టెంబర్ 8న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇదేనెల 6న సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభలకు ఖమ్మం వేదికైంది. మహాసభల సందర్భంగా కార్మికలోకం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించింది.
అక్టోబర్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అక్టోబర్ 8న ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. ఆయన నియామకంతో జిల్లాలోని పార్టీ శ్రేణులు హర్షంవ్యక్తంచేశాయి. ఈ నియామకం తర్వాత పొంగులేటి తొలిసారి అక్టోబర్ 14న జిల్లాలోకి అడుగుపెట్టడడంతో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అక్టోబర్ 26న నూతన ఎస్పీగా షానవాజ్‌ఖాసిం బదిలీపై వచ్చారు.
నవంబర్
నూతన రాష్ట్రంలో నవంబర్ 5 నుంచి ప్రారంభమైన తొలి బడ్జెట్ సమావేశంలో ఎమ్మెల్యేలు తమ వాణి వినిపించారు. కార్తీక సోమవారం కావడంతో ఇదే నెల 3న భద్రాచలానికి భక్తులు పోటెత్తారు. భక్తిప్రవత్తులతో కార్తీక మాసంలో పూజలు చేశారు.
డిసెంబర్
ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసిన కూసుమంచి మండలం జుజుల్‌రావుపేటకు చెందిన మేఘన సాఫ్ట్‌వేర్ కంపెనీ గూగుల్‌కు ఎంపికైంది. రూ.75 లక్షల వేతనంతో మెరిసి జిల్లా ఖ్యాతిని ఐటీ రంగంలో అగ్రపథాన నిలిపింది. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా జిల్లాకు చెందిన పిడమర్తి రవిని ఇదే నెల 3న నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 16న తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాణోతు చంద్రావతి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ డెరైక్టర్‌గా నియమితులయ్యారు.