
వారు బీసీలకు చెందినవారే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులాల జాబితా నుంచి తమ కులాలను తొలగించడంపై హైకోర్టును ఆశ్రయించిన వారికి ఊరట లభించింది. బీసీ కులాల నుంచి తొలగింపునకు గురైన కులాలకు చెందిన విద్యార్థులను బీసీలుగా పరిగణించాలని సోమవారం స్పష్టం చేసింది. తొలగింపునకు గురైన కులాల విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం ఎంసెట్ కౌన్సెలింగ్‌కు హాజరైతే వారిని బీసీలుగా పరిగణించాలని, కొత్త ధ్రువీకరణ పత్రాల కోసం ఒత్తిడి తీసుకురావొద్దని తేల్చిచెప్పింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తుది విచారణను ఆగస్టు రెండో వారానికి వాయిదా వేశారు. రాష్ట్రంలోని బీసీ కులాల జాబితా నుంచి 26 కులాలను తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై గత వారం రోజులుగా విచారణ జరుగుతోంది. బీసీ కమిషన్ సిఫారసులు లేకపోయినా ప్రభుత్వం తమ కులాలను బీసీల జాబితా నుంచి తొలగించిందని పిటిషనర్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో బీసీ కమిషన్ లేదని, ఈ విషయం తెలిసినప్పటికీ ప్రభుత్వం తమను బీసీ కులాల జాబితా నుంచి తొలగించిందని వాపోయారు. తమ పిల్లలు ఇక్కడే పుట్టి ఇక్కడే చదువుకుంటున్నారని, ఇన్నేళ్లు వారు బీసీలుగా కొనసాగుతూ వచ్చారని, ఇప్పుడు ప్రభుత్వ ఏక పక్ష చర్యల వల్ల వారు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో 112 కులాలే ఉన్నట్లు బీసీ కమిషన్ సభ్య కార్యదర్శి స్పష్టం చేశారని, దీంతో 26 కులాలను బీసీ కులాల జాబితా నుంచి తొలగించినట్లు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్ కోర్టుకు నివేదించారు.