
గ్రీన్‌సిగ్నల్ వచ్చేనా..?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, కొత్త లైన్ల ప్రతిపాదనలు, స్టేషన్లలో నెలకొన్న సమస్యలపై బుధవారం దక్షిణ మధ్య రైల్వే అధికారులతో హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో కరీంనగర్, పెద్దపల్లి ఎంపీలు బి.వినోద్‌కుమార్, బాల్క సుమన్ పాల్గొన్నారు. ఇరువురు ఎంపీలు తమ తమ నియోజకవర్గ పరిధిలో పెండింగ్‌లో ఉన్న ఒక్కో ప్రతిపాదనను ప్రస్తావిస్తూ వాటికి వివరణ ఇవ్వాలని కోరారు.
జమ్మికుంట రైల్వే స్టేషన్‌లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలనే ప్రతిపాదనతోపాటు పలు అంశాలపట్ల రైల్వే అధికారులు ఇచ్చిన సమాధానంతో ఎంపీలు విభేదిం చారు. జిల్లాకు సంబంధించి రైల్వే పనులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండటం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగ్ ప్రాజెక్టు పనుల కోసం ఏళ్ల తిరబడి రైల్వే అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారులతో జరిగే సమావేశాలన్నీ చాయ్, బిస్కెట్లకే పరిమితమవుతున్నాయే తప్ప ఫలితం లేకుండా పోయిందని వినోద్‌కుమార్ అసహనం వ్యక్తం చేశారు. ‘ఒక్క రైల్వే ప్రాజెక్టు కోసం మీ చుట్టు ఏళ్ల తరబడి తిరగాలా? ఇప్పటికే ఎన్నోసార్లు సమావేశాలు జరిగినా అవి చాయ్, బిస్కెట్లకు పరిమితమవుతున్నాయే తప్ప ఫలితం రావడం లేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాల్క సుమన్ సైతం పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్న రైల్వే సమస్యలను ప్రస్తావిస్తూ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వినోద్‌కుమార్ మొత్తం 22 ప్రతిపాదనలు అధికారుల ముందుంచగా కొన్నింటిపట్ల సానుకూల స్పందన వ్యక్తమైంది. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పీకే శ్రీవాస్తవ మాట్లాడుతూ తన పరిధిలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మిగిలిన అంశాలను సైతం వెంటనే రైల్వే శాఖ ఉన్నతాధికారులకు పంపుతానని పేర్కొన్నారు.
సమావేశంలో ఎంపీలిద్దరు ప్రతిపాదించిన అంశాలివే..
వినోద్‌కుమార్ ప్రతిపాదనలు
కొత్తపల్లి నుంచి మనోహరాబాద్ వరకు బ్రాడ్‌గేజ్ రైల్వేలైన్ నిర్మాణం వెంటనే చేపట్టాలి.
ఏపీ ఎక్స్‌ప్రెస్ తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలి.
తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను కరీంనగర్ ఎక్స్‌ప్రెస్ లేదా కొమురం భీమ్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలి.
కరీంనగర్ -తిరుపతి రైలును కరీంనగర్ ఎక్స్‌ప్రెస్ గా మార్చాలి.
కరీంనగర్-రాయపట్నం రోడ్డులోని రైల్వేస్టేషన్ సమీపంలో క్రాసింగ్ నెంబరు 18లో రైల్వేఓవర్ బ్రిడ్జి నిర్మించాలి.
ఉప్పల్ రైల్వేస్టేషన్, బిజిగిరిషరీఫ్ వద్ద రైల్వేఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలి.
జమ్మికుంట స్టేషన్‌లో ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను నిలుపడానికి చర్యలు తీసుకోవాలి.
ఉప్పల్ రైల్వేస్టేషన్‌లో తెలంగాణ ఎక్స్‌ప్రెస్ నిలుపాలి.
కరీంనగర్ రైల్వేస్టేషన్ నుంచి గ్రానైట్ రవాణాకు అదనపు ర్యాక్‌లను ఏర్పాటు చేయాలి.
కరీంనగర్ రైల్వేస్టేషన్‌లో ఎరువులను నిల్వ చేసేందుకు వెయ్యి మెట్రిక్‌టన్నుల సామర్థ్యమున్న గోదాము నిర్మించాలి.
తీగలగుట్టపల్లి పంచాయతీ పరిధిలోని హన్మాన్‌నగర్‌లో రైల్వేగేటు మంజూరీ చేయాలి.
కొత్తపల్లి, గంగాధర రైల్వేస్టేషన్లకు అప్రోచ్ రోడ్లను నిర్మించాలి.
కరీంనగర్ రైల్వేస్టేషన్ నుంచి తిరుపతికి ప్రతిరోజు రైలు నడిపించాలి.
రైల్వేస్టేషన్‌లో పారిశుధ్య కార్మికులను నియమించాలి.
కరీంనగర్ బస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న రిజర్వేషన్ కౌంటర్‌లో హెల్ప్‌డెస్క్ కోసం ఉద్యోగిని నియమించాలి.
తిరుపతి రైలును నెల్లూరు స్టేషన్‌లో నిలుపడానికి చర్యలు తీసుకోవాలి.
జగిత్యాల నుంచి సిర్పూర్ వరకు నడిచే పుష్పుల్‌లో టాయిలెట్ల సౌకర్యం కల్పించాలి.
సనత్‌నగర్ రైల్వేస్టేషన్ నుంచి సరుకుల ఎగుమతి, రవాణాతో ఇబ్బంది ఏర్పడుతున్న నేపథ్యంలో మేడ్చల్ స్టేషన్ నుంచి రవాణాను అనుమతించాలి. తద్వారా జంటనగరాలకు, అవుటర్ రింగ్‌రోడ్డుకు అనుకూలంగా ఉంటుంది.
బాల్క సుమన్ ప్రతిపాదనలు
రామగుండం నుంచి మణుగూర్ వరకు వయా మంథని, ఏటూరునాగారం, కమలాపూర్, భూపాలపల్లి మీదుగా రైల్వే ట్రాక్ ఏర్పాటు చేయాలి.
రామగుండంలో స్వర్ణజయంతి, నవజీవన్, కొనుగు, తమిళనాడు, దర్భాంగా, ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలి.
సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి సికింద్రాబాద్ వరకు కొత్తగా ఇంటర్‌సిటీ రైలును ఏర్పాటు చేయాలి.
మానిక్‌ఘడ్ నుంచి సికింద్రాబాద్ వరకు మరో కొత్త రైలును ప్రవేశపెట్టాలి.
సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ను ప్రతి రోజు నడపాలి.
రామగిరి, భాగ్యనగర్, నాగ్‌పూర్, సింగరేణి, తెలంగాణ ప్యాసింజర్ రైళ్లకు అదనపు బోగీలను అమర్చాలి.
మహారాష్ట్ర గోండియా-సికింద్రాబాద్ వరకు ప్రయాణికుల రైలును నడిపించాలి.
పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల తదితర రైల్వేస్టేషన్లను జీఎం ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించాలి.