కొత్త కలెక్టర్ రాహుల్ బొజ్జా
సర్కార్ ఉత్తర్వులు జారీ
త్వరలో విధుల్లో చేరిక
జిల్లా నూతన కలెక్టర్‌గా రాహుల్ బొజ్జా నియమితులయ్యారు. ప్రస్తుతం ఎస్సీ డెవలప్‌మెంటు డిపార్టుమెంటు డెరైక్టర్‌గా పనిచేస్తున్న రాహుల్ బొజ్జాను ఎన్నికల కమిషన్ అనుమతితో కలెక్టర్‌గా జిల్లాకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కలెక్టర్‌గా పనిచేసిన స్మితా సబర్వాల్ ముఖ్యమంత్రి కేసీఆర్ అదనపు కార్యదర్శిగా బదిలీపై వెళ్లిపోవడంతో అప్పటి నుంచి కలెక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. జాయింట్ కలెక్టర్ డాక్టర్ శరత్ ఇన్‌చార్జి కలెక్టర్‌గా కొనసాగుతున్నారు. రాహుల్ నియామకం నేపథ్యంలో శరత్ జాయింట్ కలెక్టర్‌గా పాత స్థానంలోనే కొనసాగుతారు. కాగా మెదక్ ఉప ఎన్నిక జరుగుతున్న దృష్ట్యా రాహుల్ బొజ్జా అతి త్వరలోనే విధుల్లో చేరే అవకాశం ఉంది.
మొదట పోలీసు.. తర్వాత ఐఏఎస్
ఐఏఎస్ అధికారి అయిన రాహుల్ బొజ్జా హైదరాబాద్‌కు చెందినవారు. ఆయన 2000లో ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. అంతకంటే ముందు ఢిల్లీ పోలీసు సర్వీస్ ఎంపికయ్యారు. ఆ తర్వాతే ఐఏఎస్‌గా సెలక్టయ్యారు. చెన్నై యూనివర్శిటీ నుంచి ఐఐటీ మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన ఈయన 2000లో ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. శిక్షణ అనంతరం వరంగల్ జిల్లా ములుగు సబ్ కలెక్టర్‌గా పోస్టింగ్ పొందారు. ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా, గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, ఓఆర్‌ఆర్ ప్రాజెక్టు డెరైక్టర్‌గా, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జైరాం రమేష్ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. 2012 జనవరిలో వరంగల్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన తెలంగాణ కుంభమేళ సమ్మక్క-సారక్క జాతరను సమర్థంగా నిర్వహించారు. అక్కడి నుంచి శాప్ ఎండీగా , ఏపీఐఐసీ ఇన్‌ఛార్జి ఈడీగా, జీహెచ్‌ఎంసీ స్పెషల్ కమిషనర్‌గా పనిచేశారు.