
తేడా కొంచెమే!
కొత్త విధానంలో బడ్జెట్ రూపకల్పనకు రాష్ట్ర ఆర్థిక శాఖ కసరత్తు
2016–17 బడ్జెట్‌తో మోడల్ ప్రయోగం
ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులను.. ప్రగతి, నిర్వహణ పద్దులుగా విభజన
రూ.లక్షా 30 వేల కోట్లలో తేడా వచ్చింది రూ.9 వేల కోట్లే!
హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ స్వరూపం మారిపోతోంది. కేంద్రం నిర్దేశించిన మార్గద ర్శకాల ప్రకారం ప్రణాళిక, ప్రణాళికేతర పద్దు ల వర్గీకరణ తొలగిపోతుంది. స్థూలంగా అభివృద్ధి, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమా లకు అద్దం పట్టేది ప్రణాళిక వ్యయం.. ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణ ఖర్చు లను నిర్వచించేది ప్రణాళికేతర వ్యయం. ఈసారి నుంచి వీటి ప్రగతి పద్దు, నిర్వహణ పద్దులు అమల్లోకి రాబోతున్నాయి. దీంతో కొత్త బడ్జెట్ ఎలా ఉండబోతోందనే అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా ప్రగతి పద్దులో ఏముంటాయి, నిర్వహణ పద్దులో ఏం ఉండబోతున్నాయి, గతంతో పోలిస్తే బడ్జెట్ గణాంకాల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటాయా.. అనే అంశాలపై ఇటీవలే ఆర్థిక శాఖ కసరత్తు చేసింది. గతేడాది మార్చిలో ప్రవేశపెట్టిన 2016–17 బడ్జెట్‌ను తీసుకుని... కొత్త స్వరూపానికి అనుగుణంగా సర్దుబాటు చేసి, నమూనా బడ్జెట్‌ను రూపొందించింది. ఈ లెక్కన బడ్జెట్‌లో పద్దుల మధ్య రూ.9 వేల కోట్ల వరకు మాత్రమే మారుతున్నట్లు లెక్క తేలింది. గతేడాది పెట్టిన రూ.1.3 లక్షల కోట్ల బడ్జెట్‌లో ప్రణాళికేతర వ్యయం రూ.63 వేల కోట్లు, ప్రణాళిక వ్యయం రూ.67 వేల కోట్లు. అదే కొత్త బడ్జెట్ విధానం ప్రకారం సర్దుబాటు చేస్తే ప్రగతి (ప్రణాళిక) పద్దు కిందకు సుమారు రూ.76 వేల కోట్లు.. నిర్వహణ (ప్రణాళికేతర) పద్దు కిందకు రూ. 53 వేల కోట్లు వస్తున్నాయి. కొన్ని ఖర్చుల పద్దులను మార్చాల్సి రావడంతో ఈ తేడా వచ్చింది. దీంతో కొత్త బడ్జెట్ విధానంతో పెద్ద ప్రయోజనమేమీ లేదని, ప్రభుత్వం మరింత గొప్పలు చెప్పుకునేందుకే పనికొస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఏమేం చేర్చారు?
ఈసారి ప్రభుత్వం విధిగా చెల్లించాల్సిన ఖర్చులన్నింటినీ నిర్వహణ ఖర్చుగా లెక్క గట్టారు. ఏ ప్రభుత్వమొచ్చినా, విధానాలు మారినా తప్పనిసరిగా చెల్లించాల్సిన ఉద్యోగు ల జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులు, అప్పు లపై వడ్డీలు వంటివి ఇందులో చేర్చారు. ఇక ప్రభుత్వ గ్రాంట్లు, తమ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఇచ్చే సబ్సిడీలు, రాయితీలు, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి ఖర్చులన్నిం టినీ ప్రగతి పద్దులో పొందుపరిచారు.
తేడా ఎక్కడ?
ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు, రాయితీలను ప్రణాళికేతర వ్యయంలో చూపించే సంప్రదాయం ఉంది. వ్యవసాయ విద్యుత్, సన్న బియ్యం వంటి రాయితీలన్నీ ఇకపై ప్రగతి ఖర్చులో చూపించాల్సి ఉం టుంది. గతంలో యూనివర్సిటీ ఉద్యోగుల జీతభత్యాలు, కొన్ని శాఖల ఉద్యోగుల జీతాలను ప్రణాళిక వ్యయంలో చూపించారు. ఇప్పుడు వాటిని నిర్వహణ పద్దుకు బదిలీ చేస్తారు.
తయారీలోనూ కొత్త పంథా!
బడ్జెట్ తయారీ విధానం మారడంతో నిక్కచ్చిగా లెక్కలు తెలుసుకునేందుకు ఆర్థిక శాఖ ఈసారి కొత్త పంథాను అనుసరిస్తోంది. ‘‘ముందుగా ఆర్థిక శాఖ రాష్ట్ర ఆదాయ వనరులు, రాబడి అంచనాలను సిద్ధం చేస్తుంది. అందులోంచి ప్రణాళికేతర వ్యయాన్ని తీసివేసి.. మిగిలిన ఆదాయాన్ని ‘బ్యాలెన్స్ ఫ్రం కరెంట్ రెవెన్యూ (బీసీఆర్)’గా చూపిస్తుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే అప్పులు కూడా కలిసి ఉంటాయి. ఈ బీసీఆర్ మొత్తాన్ని ప్రభుత్వ ప్రాధాన్యాలను బట్టి శాఖల వారీగా, రంగాల వారీగా పథకాలకు కేటాయిస్తుంది. మొత్తం వ్యయాన్ని చూపించిన తర్వాత వివిధ పథకాల అమలుకు నికర బడ్జెట్ నుంచి మదింపు చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ బడ్జెట్‌ను నిర్వహణ పద్దు.. ప్రగతి పద్దుగా వర్గీకరిస్తాం..’’అని ఇటీవలే శాసనసభ అంచనాల కమిటీకి ఆర్థిక శాఖ నివేదించింది.