సింగరేణికి కొత్త సారథి..!
ఖాళీ కానున్న సీఎండీ పోస్టు
ఇప్పటికే ఖాళీ అయిన డెరైక్టర్(పా) పదవి
కొత్తవారి నియామకానికి {పభుత్వం కసరత్తు
కొత్తగూడెం(ఖమ్మం) : కోలిండియాతో పోటీపడుతూ బొగ్గు ఉత్పత్తిలో దూసుకుపోతున్న సింగరేణి సంస్థకు కొత్త సారథులు రానున్నారు. సంస్థలో కీలకమైన చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ పదవిలో ఉన్న సుతీర్థ భట్టాచార్య కోలిండియా చైర్మన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు ఆలస్యం కావడంతో ఆయన ఇంకా రిలీవ్ కాలేదు. మరో వారంరోజుల్లో ఉత్తర్వులు అందనుండటంతో ఈ పోస్టు ఖాళీ కానుంది. ఇక మరో కీలకపోస్టు అయిన డెరైక్టర్(పా) పోస్టులో ఉన్న టి.విజయ్‌కుమార్ ఇప్పటికే బదిలీ అయ్యారు. దీంతో డెరైక్టర్ పోస్టు కూడా ఖాళీగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యాలతో నడుస్తున్న సింగరేణి సంస్థలో ఈ రెండు పోస్టుల్లో ఐఏఎస్ స్థాయి అధికారులను నియమించడం ఆనవాయితీ. సీఎండీ పోస్టును విడదీసి చైర్మన్‌గా రాజకీయ నేపథ్యం ఉన్న వారిని నియమిస్తారనే ప్రచారం జరుగుతుండడంతో మేనేజింగ్ డెరైక్టర్‌గా ఐఏఎస్ స్థాయి అధికారిని నియమించే అవకాశం ఉంది. డెరైక్టర్(పా) పోస్టు మాత్రం ఇప్పట్లో భర్తీచేసే అవకాశాలు కన్పించడం లేదు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్‌ల కొరత ఉన్న నేపథ్యంలో కనీసం ఆరు నెలలపాటు ఇన్‌చార్జ్‌తో కొనసాగించనున్నారు. ప్రస్తుతం సింగరేణి బోర్డ్ ఆఫ్ డెరైక్టర్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున డెరైక్టర్‌గా ఉన్న ఎనర్జీ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలేంద్రకుమార్ జోషి లేదా ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ స్పెషల్ సెక్రటరీ కె.రామకృష్ణారావును సంస్థ సీఎండీగా నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేసే అవకాశాలున్నాయి. సింగరేణిపై అనుభవం ఉన్నవారికే సీఎండీ బాధ్యతలు అప్పగిస్తే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్త విద్యుత్ ప్రాజెక్టులకు బొగ్గు కొరతలేకుండా ప్రణాళికలు రూపొందించే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం సింగరేణి బోర్డ్‌లో తెలంగాణ ప్రభుత్వం తరఫున డెరైక్టర్‌లుగా ఉన్న వీరిలో ఒకరిని సీఎండీగా నియమించే అవకాశాలున్నట్లు చర్చ జరుగుతోంది.