అప్పుడే నూరేళ్లు నిండాయా కన్నా
కోల్‌సిటీ :
తమ కుటుంబంలో లేక లేక కలిగిన చిన్నారికి అప్పుడు నూరేళ్లు నిండుతాయని వారు అనుకోలేదు. కానీ జరగరాని ఘోరం జరగడంతో ఆ కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములుండగా.. ఇద్దరికి ఆడపిల్లలు క లిగారు. కానీ చిన్న కుమారుడికి కొడుకు పుట్టడంతో వారంతా ఆ పిల్లాడిని అల్లారుముద్దుగా పెంచుతున్నారు. సోమవారం ఆ చిన్నారి నీటితొట్టిలో పడగా మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులతోపాటు కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోధించారు.
ఈ సంఘటన గోదావరిఖనిలో సోమవారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు... గోదావరిఖనిలోని గాంధీనగర్‌కు చెందిన మూడెత్తుల సంపత్, మల్లేశ్వరి దంపతులకు ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. సంపత్ కరీంనగర్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ దంపతులకు తొమ్మిది నెలల రిత్విక్ ఉన్నాడు. మల్లేశ్వరి తన కుమారుడితో పరశురాంనగర్‌లోని పుట్టింట్లో ఉంటోంది. సోమవారం ఆమె ఇంట్లో నిద్రపోతుండగా, రిత్విక్ అంబాడుతూ వెళ్లి ఇంటి ఆవరణలోని నీటితొట్టిలో పడిపోయాడు. బాలుడు ఎక్కడా కనిపించడం లేదని కుటుంబసభ్యులు వెతకగా నీటితొట్టిలో తేలుతూ కనిపించాడు. వెంటనే కరీంనగర్‌కు తరలిస్తుండగా పెద్దపెల్లి సమీపంలోకి రాగానే మృతి చెందాడు.
గంట ముందే..
రిత్విక్ చనిపోవడానికి గంట ముందే సంపత్ భార్యతో ఫోన్‌లో మాట్లాడాడు. హైదరాబాద్‌లో ఓ చిన్నారి బోరుబావిలో పడిందని.. రిత్విక్ బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా గమనించాలని సూచించాడు. కానీ అంతలోనే ఆయనకు రిత్విక్ మరణవార్త తెలియడంతో షాక్‌కు గురయ్యాడు. సంపత్‌కు ఇద్దరు సోదరులుండగా.. వారికి ఆడపిల్లలు కలిగారు. రిత్విక్ పుట్టినప్పటి నుంచి ఆ కుటుంబమంతా సంతోషంలో మునిగి ఉంది. కానీ ఇంతలోనే ఈ ఘోరం జరగడంతో ప్రస్తుతం శోకసంద్రంలో ముగినిపోయారు.