ఇక.. పెయిడ్ పార్కింగ్ | The paid parking .. | Sakshi
Sakshi News home page

ఇక.. పెయిడ్ పార్కింగ్

Published Wed, Jun 18 2014 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 AM

ఇక.. పెయిడ్ పార్కింగ్

ఇక.. పెయిడ్ పార్కింగ్

నగరంలో ఏర్పాటుకు సన్నాహాలు
పోలీస్, బల్దియా ఉన్నతాధికారుల నిర్ణయం
రహదారుల వెంట వాహనాలు నిలిపితే బాదుడే..
.
 
కార్పొరేషన్ :ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ప్రధాన రహదారుల్లో పెయిడ్ పార్కింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని పోలీస్, నగర పాలక సంస్థ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ అంశంపై వరంగల్ నగర పాలక సంస్థ కౌన్సిల్ హాల్‌లో మంగళవారం బల్దియా కమిషనర్ సువర్ణ పండాదాస్, అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్‌రావు, ట్రాఫిక్ డీఎస్పీ ప్రభాకర్‌రావు సమీక్షించారు. ఈ సందర్భంగా బల్దియా ఏసీపీలు శిల్ప, శైలజ ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ సమస్య, అవాంతరాలు, పెయిడ్ పార్కింగ్‌కు అనువైన ప్రాంతాల వివరాలను పవర్ పాయింట్వరంగల్ చౌరస్తా నుంచి పోచమ్మమైదాన్ వరకు ఐదు ప్రాంతాల్లో రెండు కారు పార్కింగ్ సెంటర్లు... మూడు ద్విచక్ర వాహనాల పార్కింగ్ సెంటర్లు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అవాంతరాలను గూగుల్ మ్యాపులో అనుసంధానం చేసినట్లు తెలిపారు. ప్రధాన రహదారుల్లో ఉన్న ఆక్రమణలను తొలగించాల్సి ఉందని వివరించారు. చిరువ్యాపారులు, డబ్బాలను అక్కడి నుంచి తరలించాల్సి ఉందని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై చర్చించారు. తదుపరి పెయిడ్ పార్కింగ్ విధానం అమలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 100 నుంచి 150 వాహనాలు పార్కింగ్ చేసే విధంగా వీటిని రూపకల్పన చేయనున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తించిన పెయిడ్ పార్కింగ్ సెంటర్ల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను మరోమారు పరిశీలించాలని నిర్ణయించారు. గతంలో రెండుమార్లు పెయిడ్ పార్కింగ్ సెంటర్ల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు. తీరా టెండర్లు పిలిచాక ప్రజా సంఘాల నుంచి వ్యతిరేకత రావడంతో వాటిని రద్దు చేశారు. ఈ దఫా బల్దియా, పోలీస్ అధికారులు పెయిడ్ పార్కింగ్ సెంటర్ల నిర్వహణ ఎలా చేపడతారో చూడాలి మరి.

వాహనదారులకు భారమే..

నగరంలో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. వాణిజ్య సంస్థల ఎదుట  వాహనదారుల కష్టాలు చెప్పలేని విధంగా ఉన్నాయి. ఒకవైపు సెల్లార్లను వ్యాపార సంస్థలకు వాడేస్తున్నారు. మరోవైపు షాపుల ఎదుట దురాక్రమణకు పాల్పడుతున్నారు. దీంతో షాపుల ఎదుట వాహనాలను నిలపడం ఇబ్బందిగా మారింది. 2009 సంవత్సరంలో అప్పటి జాయింట్ కలెక్టర్, బల్దియా ఇన్‌చార్జ్ కమిషనర్ వాకాటి కరుణ పెయిడ్ పార్కింగ్ సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేపట్టారు. పార్కింగ్ స్థలాలు వద్దంటూ అప్పటి పాలకవర్గం, ప్రజాప్రతినిధులు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. 2013లో అప్పటి కమిషనర్ వివేక్‌యాదవ్ పెయిడ్ పార్కింగ్ కోసం మార్కింగ్ చేయించి, నిర్వహణ కోసం టెండర్లు పిలిచారు. వివిధ ప్రజా సంఘాల నుంచి ఒత్తిడి రావడంతో వాటిని పక్కన పెట్టారు. వాహనాల సంఖ్య నానాటికి పెరుగుతున్నందున వాణిజ్య సముదాయాలు కలిగిన రోడ్లలో ట్రాఫిక్ సమస్య జటిలంగా మారుతుంది. దీంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ తాజాగా 15 రోజుల నుంచి పార్కింగ్ స్థలాలను గుర్తించేందుకు బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. బల్దియా కమిషనర్ సువర్ణదాస్ పండా, అర్బన్ ఎస్పీ పెయిడ్ పార్కింగ్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఇక పెయిడ్ పార్కింగ్ సెంటర్ల ఏర్పాటు కానున్నాయి. ఇక మీదట బండి పెడితే తప్పనిసరిగా పైసలు చెల్లించాల్సి ఉంది. బల్దియాలో జరిగిన సమావేశంలో , బల్దియా సీపీ రమేష్‌బాబు, డీసీపీ భాగ్యవతి, ఏసీపీలు రాజేశ్వర్‌రావు, రవి, శైలజ, శిల్ప, టీపీఓ మహేందర్, సీఐలు పాల్గొన్నారు.

పార్కింగ్ సెంటర్లు ఇవే...

ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్ నుంచి బట్టలబజార్ మీదుగా పాపయ్యపేట చమన్ వరకు ఒక కారు, రెండు  ద్విచక్ర ..  బట్టలబజార్ నుంచి ఎంజీఎం వరకు ఒక ద్విచక్ర వాహన పార్కింగ్ సెంటర్
 
హన్మకొండ చౌరస్తా నుంచి పద్మాక్ష్మి రోడ్డులోని హనుమాన్ ఆలయం వరకు మూడు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు, ఒక చోట కారు పార్కింగ్ సెంటర్
 
హన్మకొండలోని డీసీసీ భవన్ నుంచి ఆర్టీసీ బస్ స్టేషన్ వరకు రెండు ప్రాంతాల చొప్పున ద్విచక్ర వాహన, కారు పార్కింగ్ సెంటర్లు. అశోక థియేటర్ ఎదుట మల్టీలెవల్ పార్కింగ్ సెంటర్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement