పెన్షన్ బకాయిలు చెల్లింపునకు ఓకే..
* పట్టుపట్టి సాధించుకున్న రిటైర్డ్ ఉద్యోగులు
* పెన్షన్ వ్యత్యాస బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: పట్టు వీడకుండా రిటైర్డు ఉద్యోగులు చేసిన ప్రయత్నానికి ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. 1998కు ముందు రిటైరైన ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.327 కోట్ల పెన్షన్ వ్యత్యాస బకాయిలను చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది.
ఒకేసారి మొత్తం బకాయిలు చెల్లించడం ఆర్థికంగా భారమవుతుందనే కారణంతో.. ఏడాదికి 25 శాతం చొప్పున నాలుగేళ్లలో మొత్తం బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఆర్థిక శాఖ బుధవారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి విడత బకాయిలను వచ్చే ఏడాది జనవరి 1న, రెండో విడత 2016 ఏప్రిల్ 1న, మూడో విడత 2017 జనవరి 1న, చివరి విడత బకాయిలను 2018 జనవరి 1న చెల్లించనున్నట్లు అందులో పేర్కొంది.
తాజా ఉత్తర్వుల ప్రకారం 1998కు ముందు రిటైరైన ఉద్యోగులు దాదాపు 30 వేల మందికి సవరించిన పెన్షన్‌తో పాటు ఈ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ పెన్షన్ వ్యత్యాస బకాయిల మొత్తం రూ.900 కోట్లుగా ఆర్థిక శాఖ లెక్కగట్టింది. తెలంగాణ వాటా బకాయిలు రూ.327 కోట్లుగా అంచనా వేసింది.
ఇప్పటివరకు రావాల్సిన బకాయిలను నాలుగు విడతలుగా చెల్లించడంతో పాటు చివరి నెల వేతనం ఆధారంగా సవరించిన కొత్త పెన్షన్‌ను వెంటనే చెల్లించనున్నట్లు ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అర్హులైన రిటైర్ ఉద్యోగులందరూ నిర్దేశించిన నమూనాలో రివైజ్డ్ పెన్షన్‌కు బిల్లులు తయారు చేసి సంబంధిత పెన్షన్ మంజూరీ చేసే అధికారికి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
15 రోజుల వ్యవధిలో అధికారులు వీటిని పరిశీలించి సవరించిన పెన్షన్ మంజూరీ ఉత్తర్వులు జారీ చేస్తారు. 1998 మే 25కు ముందు రిటైరైన ఉద్యోగులు.. ఆ తర్వాత మరణించి ఉంటే ఆయన కుటుంబీకులు, వారసులకు నిబంధనల ప్రకారం ఈ బకాయిలను చెల్లిస్తారు. కొత్త విధానంలో పెన్షన్ చెల్లించడం వల్ల బకాయిల భారం ప్రతినెలా రూ.10 కోట్లు కానుంది.
అసలేం జరిగింది:
1998కు ముందు రిటైరైన ఉద్యోగులకు తమ సర్వీసులో చివరి పది నెలల వేతన సగటు ఆధారంగా పెన్షన్ అందించే విధానం అమల్లో ఉండేది. ఆ తర్వాత ఉద్యోగుల చివరి నెల జీతం ఆధారంగా పెన్షన్ లెక్కగట్టే విధానం అమల్లోకి వచ్చింది. దీంతో తమకు అన్యాయం జరిగిందని.. తమకు అందుతున్న పెన్షన్‌కు, కొత్త విధానంతో రావాల్సిన పెన్షన్‌కు వ్యత్యాసముందని అంతకు ముందు రిటైరైన ఉద్యోగులు న్యాయ పోరాటం చేశారు.
గతేడాది ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే సుప్రీం తీర్పును అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తూ వచ్చింది. రిటైర్‌డ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఏడాది కాలంగా పట్టుపట్టడంతో ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చింది.