తెలంగాణలో మాఫియాల రాజ్యం
తమ్మినేని వీరభద్రం
సంగారెడ్డి క్రైం: రాష్ట్రంలో ఇసుక, డ్రగ్స్, ల్యాండ్ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. సంగారెడ్డిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి అంటే రోడ్లు, భవనాలు నిర్మించడం కాదని, సంపద పెరిగినంత మాత్రాన ప్రగతి సాధించినట్లు కాదన్నారు. ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందినట్లన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాద శక్తులు విజృంభిస్తూ దళితులు, మైనార్టీలపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు.
గో సంరక్షణ పేరుతో దాడులకు పాల్పడటం దారుణమని చెప్పారు. ప్రభుత్వమే యథేచ్ఛగా ఇసుక మాఫియాకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రశ్నించిన నేరెళ్ల దళితులను పోలీసుల అండతో థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసించిందన్నారు. ఎస్పీని వదిలేసి ఎస్‌ఐని బలిచేయడం వింతగా ఉందన్నారు. కేసీఆర్ పాలనను ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడకుండా తప్పించుకుంటున్న కేసీఆర్‌ను పదేపదే ప్రశ్నిస్తున్న ఆచార్య కోదండరాంను అరెస్టుల పేరుతో అడ్డుకునే ప్రయత్నం చేస్తోందన్నారు.